Nepal Floods: బురదలో 3 రోజులు పోరాటం.. ప్రాణాలతో బయటపడ్డ 6 ఏళ్ల చిన్నారి..!
Nepal Floods: నేపాల్‌లో విరుచుకుపడిన ఘోర వరదల్లో అద్భుతం చోటుచేసుకుంది.
Nepal Floods: బురదలో 3 రోజులు పోరాటం.. ప్రాణాలతో బయటపడ్డ 6 ఏళ్ల చిన్నారి..!
Nepal glacier collapse floods: హిమాలయ దేశం నేపాల్‌ను ప్రకృతి ప్రకోపం ఊహించని రీతిలో ముంచెత్తింది. బుధవారం అనూహ్యంగా హిమానీనదం కూలిపోవడంతో విరుచుకుపడిన ఆకస్మిక వరదలు, భయానక కొండచరియల విలయంలో 650 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా కన్నీళ్లు, శవాల కుప్పలు, మిగిలిన శిథిలాలే కనిపిస్తున్న ఈ తీవ్ర విషాదంలో ఓ అపురూపమైన అద్భుతం చోటుచేసుకుంది. మృత్యువు అంచుల్లో నుంచి ఓ ఆరేళ్ల చిన్నారి పునర్జన్మ పొందింది.
రసూవా జిల్లాలోని టిమురే ప్రాంతంలో భోటే కోశి నది ఉగ్రరూపం దాల్చడంతో నిమిషాల వ్యవధిలోనే గ్రామాలు నీటమునిగాయి. టన్నుల కొద్దీ మట్టి, బండరాళ్లు ఇళ్లను కప్పేశాయి. ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఆ ప్రాంతంలో మరణ మృదంగం మోగుతుండగా, గల్లంతైన వారి కోసం ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
వరద వచ్చి మూడు రోజులు గడిచిపోవడంతో శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉండే అవకాశం దాదాపు శూన్యమని అందరూ భావించారు. అయితే శుక్రవారం గాలింపు చర్యలు చేపడుతుండగా, మట్టి దిబ్బల అడుగున నుంచి అతి చిన్నగా, క్షీణించిన స్వరంతో ఓ చిన్నారి ఏడుపు శబ్దం వినిపించింది.అప్పటివరకు కేవలం మృతదేహాలనే వెలికితీస్తున్న మాకు ఆ చిన్నారి ఏడుపు శబ్దం ఒక పెద్ద వెలుగులా అనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మట్టిని, శిథిలాలను చేతులతో తొలగించి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశామని సహాయక చర్యల్లో పాల్గొన్న ఏపీఎఫ్ రెస్క్యూ అధికారి చెప్పుకొచ్చారు.
మూడు రోజుల పాటు చీకటిగా ఉన్న మట్టి దిబ్బల కింద, ఆహారం, నీరు లేకుండా ఆ ఆరేళ్ల చిన్నారి ప్రాణాలతో పోరాడి నిలవడం స్థానికులను, అధికారులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం శనివారం ప్రత్యేక హెలికాప్టర్‌లో రాజధాని ఖాట్మండుకు తరలించారు. ఊహించని ఈ విపత్తుతో గుండె పగిలిపోయిన నేపాల్ ప్రజలకు, ఈ ఘటన ఒక కొత్త ఆశాకిరణంలా మారింది. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమోనన్న నమ్మకంతో రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను మరింత తీవ్రతరం చేశాయి.




