Miss World 2026: మిస్ వరల్డ్ 2026 విజేతగా జోహెరీ మోల్.. నిరాశపరిచిన భారత్.. అసలు ఎవరీ భామ?
Miss World 2026: వియత్నాం వేదికగా ఎంతో వైభవంగా జరిగిన 73వ మిస్ వరల్డ్ 2026 పోరు ముగిసింది.
Miss World 2026
Miss World 2026: వియత్నాం వేదికగా ఎంతో వైభవంగా జరిగిన 73వ మిస్ వరల్డ్ 2026 పోరు ముగిసింది. సుమారు 111 దేశాల సుందరీమణులు పోటీపడిన ఈ గ్రాండ్ ఫినాలేలో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోల్ డామింగెజ్ ప్రపంచ అందాల కిరీటాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. శనివారం సెప్టెంబర్ 5న జరిగిన మిస్ వరల్డ్ 2026 పోటీలు కంటిరెప్ప వాల్చనీయకుండా సాగాయి. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. భారత్ తరఫున ప్రతినిధిగా బరిలోకి దిగిన నికితా పోర్వాల్ అందరి దృష్టినీ ఆకర్షించినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. టాప్ 20 రేసులోనే ఆమె నిష్క్రమించడంతో భారత అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. తీవ్రమైన పోటీ నడుమ డొమినికన్ రిపబ్లిక్ భామ జోహెరీ మోల్ డామింగెజ్ తన అసాధారణమైన ప్రతిభ, సమయస్ఫూర్తితో మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని సొంతం చేసుకుంది.
రన్నరప్‌లుగా స్పెయిన్, మలేషియా సుందరీమణులు
ఈ ప్రతిష్టాత్మక పోటీలో స్పెయిన్‌కు చెందిన ఎలిజబెత్ రైన్స్ రన్నరప్‌గా నిలవగా, మలేషియా భామ ధనూషియా శెట్టి తదుపరి స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 72వ మిస్ వరల్డ్ విజేతగా నిలిచి, థాయిలాండ్ దేశానికి తొలిసారి ఆ కిరీటం అందించిన ఓపల్ సుచాతా స్వాంగ్‌శ్రీ కొత్త విజేత అయిన జోహెరీ మోల్‌కు కిరీటాన్ని తొడిగారు. ఈ అద్భుత ఘట్టం చూసి వేదిక ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.
ఎవరీ జోహెరీ మోల్ డామింగెజ్?
కేవలం అందంతోనే కాకుండా సామాజిక దృక్పథంతోనూ జోహెరీ మోల్ అందరి హృదయాలను గెలుచుకుంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఆమె ఒక మోడల్ మాత్రమే కాదు, మంచి కమ్యూనికేటర్, సామాజిక కార్యకర్త కూడా. ఇబెరోఅమెరికానా విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొందింది. సమాజంలో వెనుకబడిన, పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్యను అందించే లక్ష్యంతో వాయిసెస్ ఆఫ్ టుమారో అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దానికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.
కమ్యూనికేటర్‌గా, మోడల్‌గా బహుముఖ ప్రజ్ఞ
పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి ఆంగ్ల సాహిత్యం, సామాజిక శాస్త్రాలను బోధిస్తూ వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తోంది. దీనికితోడు యూనివిజన్ న్యూయార్క్‌కు చెందిన వెంటానా అ కిస్కేయా ప్రోగ్రామ్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తూ డొమినికన్ సంస్కృతిని, అక్కడి ప్రజల సామాజిక సమస్యలను ప్రపంచానికి చాటిచెబుతోంది. గోయా గివ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రొఫెషనల్ మోడల్‌గా తనదైన ముద్ర వేసింది.




