Modi Cultural Gifts: మోదీ బహుమతుల సీక్రెట్... భారతీయ సాంస్కృతి ఉట్టిపడేలా...ప్రపంచ నాయకులను ఆకట్టుకునేలా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో అంతర్జాతీయ నాయకులకు అందించిన అద్భుతమైన భారతీయ హస్తకళలు, జీఐ ట్యాగ్ వస్తువుల వెనుక ఉన్న దౌత్యపరమైన రహస్యాలను తెలుసుకుందాం.

Balachander
Published on: 21 May 2026 2:07 PM IST
Modi Cultural Gifts: మోదీ బహుమతుల సీక్రెట్... భారతీయ సాంస్కృతి ఉట్టిపడేలా...ప్రపంచ నాయకులను ఆకట్టుకునేలా
X

Modi Cultural Gifts: అంతర్జాతీయ దౌత్యంలో కేవలం మాటలు, ఒప్పందాలు మాత్రమే కాదు.. ఒక దేశపు ‘సాఫ్ట్ పవర్’ కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనను ముగించుకున్నారు. అయితే ఈ పర్యటనలో రాజకీయ చర్చల కంటే ఎక్కువగా ప్రపంచ దేశాధినేతలకు ఆయన అందించిన ప్రత్యేకమైన బహుమతులు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. భారతదేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, సాంప్రదాయ వస్త్రాలు, భౌగోళిక గుర్తింపు పొందిన ఆహార పదార్థాలను ఎంచుకుని మరీ మోదీ బహుమతులుగా ఇచ్చారు. ఏ దేశ నేతకు ఏది ఇవ్వాలి? ఆ దేశ చరిత్రకు మన సంస్కృతికి ఉన్న పోలికలు ఏంటి? విశ్లేషిద్దాం.

ఇటలీ ప్రధానికి ‘మెలడీ’ చాక్లెట్.. జేవీయర్‌కు ‘మధుబని’!

ఈ పర్యటనలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి మోదీ ఇచ్చిన బహుమతులు ప్రత్యేకంగా నిలిచాయి. కేవలం భారతదేశపు ప్రసిద్ధ 'మెలడీ' టాఫీల ప్యాకెట్ మాత్రమే కాకుండా, అస్సాంకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ బంగారు వర్ణపు 'ముగా సిల్క్' శాలువాతో పాటు మణిపూర్‌కు చెందిన షిరుయ్ లిలీ ప్రేరిత పట్టు శాలువాను ఆమెకు బహుకరించారు. అలాగే ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాకు ఆగ్రా మార్బుల్ ఇన్‌లే బాక్స్‌తో పాటు భారత రత్న గ్రహీతలు పండిట్ భీమ్‌సేన్ జోషి, ఎమ్మెస్ సుబ్బులక్ష్మిల సంగీత రికార్డింగులను అందించారు.

మరోవైపు నెదర్లాండ్స్ రాజుకు జైపూర్ బ్లూ పాటరీని బహుమతిగా ఇచ్చారు. క్వార్ట్జ్ పౌడర్, గాజు పొడితో చేసే ఈ ప్రత్యేక కళకు నెదర్లాండ్స్ దేశపు డెల్ఫ్ట్ బ్లూ పాటరీ కళకు ఎంతో పోలిక ఉంది. నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్‌కు పవిత్రమైన ‘చేప’ ముద్ర ఉన్న మధుబని పెయింటింగ్‌ను ఇచ్చారు. ఇది అక్కడ నదులలో చేపల వలసలను రక్షించే వారి పర్యావరణ విధానాలకు అద్దం పట్టేలా ఉండటం విశేషం.

నార్వే, స్వీడన్ దేశాల్లో భారతీయ ముద్ర

నార్వే, స్వీడన్ దేశాధినేతలకు మోదీ ఇచ్చిన బహుమతులు వారి జీవన విధానానికి సరిగ్గా సరిపోయేలా ప్లాన్ చేశారు. నార్వే రాజు హరాల్డ్ Vకి ఒడిశాకు చెందిన ప్రసిద్ధ ‘కటక్’ సిల్వర్ ఫిలిగ్రీతో చేసిన పడవ నమూనాను ఇచ్చారు. వైకింగ్‌ల కాలం నాటి నార్వే సముద్రయాన చరిత్రకు, భారతదేశ ప్రాచీన నౌకాయాన సంస్కృతికి ఇది ఒక వారధి. అదేవిధంగా... స్వీడన్ ప్రధానికి లడఖ్ పష్మినా శాలువాను ఇచ్చారు. హిమాలయాల్లో 5000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే మేకల ఉన్నితో, స్థానిక మహిళలు చేతులతో నేసే ఈ శాలువా స్వీడన్ దేశపు చలి వాతావరణానికి, వారి పట్టుదలకు ప్రతీకగా నిలిచింది. స్వీడన్ ప్రధానికి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పుస్తకాలను కూడా అందించారు. 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి యూరపేతర వ్యక్తిగా ఠాగూర్‌కు స్వీడన్‌తో ఉన్న బంధాన్ని ఈ బహుమతి గుర్తుచేసింది. డచ్‌ రాణికి ఆరెంజ్‌, బ్లూ రంగులతో రూపొందించిన మీనాకారి, కుందన్‌ చెవిపోగులు అందించారు. ఆ రంగులు డచ్‌ రాజవంశాన్ని ప్రతిబింబించేలా ఎంపిక చేయడం విశేషం. నార్వే ప్రధానికి సిక్కింకు చెందిన హిమాలయ ఆర్కిడ్‌ పుష్పాలతో తయారైన ప్రత్యేక కళాఖండాన్ని బహూకరించారు. స్వీడన్‌ యువరాణికి మధ్యప్రదేశ్‌ గోండ్‌ పెయింటింగ్‌ను బహూకరించడం గిరిజన కళలకు అంతర్జాతీయ గుర్తింపునిచ్చే ప్రయత్నంగా భావిస్తున్నారు.

యూఏఈ అధ్యక్షుడికి గుజరాత్ కేసరి మామిడి పండ్లు!

యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు గుజరాత్‌కు చెందిన భౌగోళిక గుర్తింపు ఉన్న ప్రసిద్ధ కేసరి మామిడి పండ్లను, మేఘాలయ పైనాపిల్స్‌ను మోదీ రుచి చూపించారు. దాంతో పాటు గుజరాత్ కచ్ ప్రాంతానికి చెందిన అరుదైన రోగన్ పెయింటింగ్ ‘ట్రీ ఆఫ్ లైఫ్’ ను బహుమతిగా ఇచ్చారు. భూమిలో వేళ్లుండి, ఆకాశంలోకి కొమ్మలు చాచే ఈ చెట్టు సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే ప్రగతి వైపు దూసుకెళ్లే యూఏఈ విధానాన్ని సూచిస్తుంది. అలాగే యూఏఈ రాజమాతకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ బాక్స్, మహేశ్వరి సిల్క్ వస్త్రం, మణిపూర్‌కు చెందిన పోషక విలువలున్న ‘చాక్ హావో’ నల్ల బియ్యాన్ని అందించారు.

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో ఇచ్చే బహుమతుల వెనుక ఒక బలమైన పరిశోధన ఉంటుంది. ఎదుటి దేశపు సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు లేదా వారి చరిత్రకు సరితూగేలా భారతీయ హస్తకళలను ఎంపిక చేయడం ద్వారా.. భారతదేశం అంతర్జాతీయంగా తన గౌరవాన్ని, బంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇది కేవలం బహుమతుల మార్పిడి కాదు.. సరిహద్దులు దాటిన కళల కలయిక అని చెప్పవచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story