Couple Fight: భర్తపై కోపంతో కోటిన్నరను రోడ్డుపై విసిరేసిన భార్య
Couple Fight: భార్యాభర్తల గొడవ నోట్ల వర్షానికి దారితీసింది! చైనాలో ఒక మహిళ కోపంతో తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి ఏకంగా రూ. 1.5 కోట్ల నోట్లను కిందకు విసిరేసింది.
Couple Fight
Angry Wife: కోపం మనిషిని ఏమైనా చేయిస్తుంది అంటారు.. కానీ ఈ మహిళ ఏకంగా కోటిన్నర రూపాయలను రోడ్డు పాలు చేసింది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. గాలిలో ఎగురుతున్న నోట్ల కట్టలను చూసి స్థానికులు పండగ చేసుకున్నారు.
అసలేం జరిగింది?
చైనాలోని శాంతౌ నగరం, స్టార్ లేక్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో నివసించే ఒక దంపతుల మధ్య శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ పెరిగి పెద్దది కావడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న భార్య, ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను బాల్కనీలోకి తెచ్చింది. ఏకంగా 2 మిలియన్ల హాంకాంగ్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ. 1.5 కోట్ల విలువైన 1,000 డాలర్ల నోట్ల కట్టలను గాలిలోకి విసిరేసింది.
రోడ్డుపై కరెన్సీ జాతర
ఆకాశం నుండి మబ్బుల నుంచి వర్షం కురిసినట్టుగా, వెయ్యి నోట్లు కురుస్తుంటే జనం ఊరుకుంటారా?..కింద పడుతున్న నోట్ల కట్టలను చూసిన బాటసారులు, స్థానికులు వాటిని ఏరుకోవడానికి పోటీ పడ్డారు. నోట్ల కోసం జనం ఎగబడటంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, తొక్కిసలాట జరిగినంత పనైంది. ఆవేశంలో ఉన్న ఆ మహిళ, కొన్ని నోట్లను ముక్కలు ముక్కలుగా చించి మరీ కిందకు విసిరేయడం విశేషం.
పోలీసుల ఎంట్రీ.. రిటర్న్ గిఫ్ట్
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఆ నోట్లు అసలైనవేనని ధృవీకరించిన పోలీసులు.. ఎవరైతే డబ్బులు ఏరుకున్నారో వారంతా వెంటనే పోలీసు స్టేషన్‌లో లేదా అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కు తిరిగి ఇచ్చేయాలని హుకుం జారీ చేశారు. భయంతో కొందరు ఇప్పటికే ఆ డబ్బును తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జీవితంలో సరైన భాగస్వామిని ఎంచుకోవడమే అతిపెద్ద ఫైనాన్షియల్ అడ్వైస్ అని ఇప్పుడర్థమైంది అని ఒకరు కామెంట్ చేయగా..ఇలాంటి గొడవలు మా ఇంటి పక్కన కూడా జరిగితే బాగుండు అని మరొకరు సరదాగా పేర్కొన్నారు. భార్యాభర్తలు గొడవ పడితే మధ్యలో జనాలకు లాభం రావడం అంటే ఇదేనేమో అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు.
కోపం వచ్చినప్పుడు వస్తువులను పగలగొట్టడం చూశాం కానీ, ఇలా ఏకంగా కోట్లు రోడ్డు పాలు చేయడం మాత్రం అరుదు. ఏది ఏమైనా, ఆ దంపతుల మధ్య గొడవ సద్దుమణిగిందో లేదో కానీ, ఆ ఏరియా జనాలకు మాత్రం ఆ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది.




