NASA Permanent Moon Base: చంద్రుడిపై శాశ్వత స్థావరాలు ఏర్పాటు దిశగా అడుగులు...కల సాకారమౌతుందా?

చంద్రునిపై మనుషులు నివసించేలా శాశ్వత బేస్ క్యాంప్‌ల ఏర్పాటుకు నాసా సంచలన ప్రణాళికను సిద్దం చేసింది. చైనాతో తీవ్ర పోటీ మధ్య 2032 నాటికి లక్ష్యాన్ని చేరుకునేలా ముమ్మరంగా అడుగులు వేస్తున్నది.

Balachander
Published on: 27 May 2026 12:30 PM IST
NASA Permanent Moon Base: చంద్రుడిపై శాశ్వత స్థావరాలు ఏర్పాటు దిశగా అడుగులు...కల సాకారమౌతుందా?
X

NASA Permanent Moon Base: సైంటిఫిక్‌ సినిమాల్లో మనం చంద్రుడిపైన, అంగారకుడిపై స్థావరాలు ఏర్పాటు చేసిట్టుగా చూస్తుంటాం. కానీ, నిజ జీవితంలో కూడా ఇలాంటివి సాధ్యం చేసేందుకు నాసా సిద్దమౌతున్నది. కేవలం చంద్రుడిపైకి వెళ్లి రావడం మాత్రమే కాదు, అక్కడ శాశ్వతంగా మనుషులు నివసించేలా ఒక కాలనీని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం రోబోటిక్ ల్యాండర్లు, ఎగిరే డ్రోన్లు, ప్రత్యేక వాహనాల వివరాలను నాసా అధికారికంగా విడుదల చేసింది. ట్రంప్‌ తన అధికారం పూర్తయ్యేలోగా అమెరికన్‌ వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. ఈ రేసులో చైనా కూడా దూసుకుపోతుండటంతో స్పేస్ సైన్స్‌ కాస్త స్పేస్‌ పాలిటిక్స్‌గా మారిపోయింది.

రేసులో ముందుండాలని నాసా భారీ వ్యూహం

చంద్రునిపై పట్టు సాధించేందుకు నాసా ఏకంగా 20 బిలియన్ డాలర్ల అంటే సుమారు 1.6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ‘ఇగ్నిషన్ మూన్ బేస్’ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. 2032 నాటికి చంద్రుని దక్షిణ ధ్రువంపై అణు, సౌరశక్తితో నడిచే శాశ్వత స్థావరాన్ని నిర్మించడం దీని ప్రధాన ఉద్దేశం. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఒరిజిన్’, ‘ఆస్ట్రోబోటిక్’, ‘ఇంటూయిటివ్ మెషీన్స్’ వంటి దిగ్గజ ప్రైవేట్ కంపెనీలకు నాసా ఈ యంత్రాల తయారీ కాంట్రాక్టులను అప్పగించింది.

ఇక ఈ మూన్‌ బేస్‌ ప్రాజెక్ట్‌ మూడు దశల్లో జరగనుంది. మొదటిదశ కాలంలో 25 లాంచ్‌ వాహనాల ద్వారా సుమారు నాలుగు మెట్రిక్‌ టన్నుల కార్గోను, రోబోటిక్‌ ల్యాండర్లను చంద్రుడిపైకి పంపనున్నారు. ఈ పరికరాలు ఉపరితాలన్ని పూర్తిగా మ్యాపింగ్‌ చేస్తాయి. ఇక రెండో దశలో మనుషులు మనుగడ సాగించడానికి అవసరమైన ఫిషన్‌ రియాక్టర్లు, సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. మూడోదశలో అంటే 2032నాటికి వ్యోమగాములు దీర్ఘకాలం నివసించేందుకు అనువుగా ఉండే సెమీ పర్మినెంట్‌ గృహాలను చంద్రుడిపై ఏర్పాటు చేస్తారు.

చైనా ముప్పు... అమెరికా కల నెరవేరేనా?

నాసా ఇంత వేగంగా అడుగులు వేయడానికి ప్రధాన కారణం చైనా నుంచి వస్తున్న పోటీయే. చైనా ఇప్పటికే తన ‘షెంజౌ-23’ నౌక ద్వారా వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపింది. అంతేకాదు, 2030 నాటికే చంద్రుడిపై మనుషులను దించాలని చైనా టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే, అమెరికా టైమ్‌లైన్‌ ప్రకారం, పనులు జరగడం అంత సులువైన విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన ‘స్టార్‌షిప్ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్’ నిర్మించే బాధ్యతను ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ తీసుకుంది. కానీ, ఈ సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడం, పలు ఆలస్యాలు జరగడం నాసాకు పెద్ద మైనస్‌గా మారింది.

నాసా కంటే ముందే చైనా చంద్రుడిపై అడుగుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని లూనార్ సైంటిస్ట్ డాక్టర్ సిమియన్ బార్బర్ అభిప్రాయపడ్డారు. చంద్రుని దక్షిణ ధ్రువంలో మంచు రూపంలోని నీటిని తాగడానికి, ఆక్సిజన్, రాకెట్ ఇంధన తయారీకి వాడుకోవచ్చనేది శాస్త్రవేత్తల ఆలోచన. మరి ఈ అంతరిక్ష యుద్ధంలో అమెరికా గెలుస్తుందా లేదా చైనా బావుటా ఎగురవేస్తుందో చూడాలి. వాణిజ్యంతో పాటు సైంటిఫిక్‌ రంగంలోనూ ఈ రెండు దేశాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story