NASA Rover: రోవర్ కెమెరాకు ఏ ఫోన్ సాటిరాదు... ఈ ఫొటోలు చూడండి మీకే అర్థమౌతుంది
నాసా రోవర్ తీసిన అంగారకుడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 65 కిలోమీటర్ల పరిధిలోని చిత్రాలను రోవర్ తన కెమెరాలో అద్భుతంగా బంధించింది.
NASA Rover: ఎప్పటికైనా అంగారక గ్రహం మీద కాలుపెట్టాలని నాసా తహతహలాడుతున్నది. దీనికోసం నాసా చాలా ప్రయోగాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే కొన్నేళ్ల క్రితం మార్స్ మీదకు రోవర్‌ను పంపింది. ఈ రోవర్ మార్స్‌పై తిరుగుతూ ఫొటోలు తీస్తూ దానిని భూమిమీదకు పంపుతున్నది. తాజాగా ఈ రోవర్‌లో అమర్చిన కెమెరా తీసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మార్స్‌పై ఫాల్‌బ్రీన్ అనే ప్రాంతంలో తీసిన ఒక్క చిత్రం కోసం శాస్త్రవేత్తలు ఏకంగా 96 వేర్వేరు ఫొటోలను ఒకటిగా కలిపి చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం మనకు మార్కెట్లో లభించే ఏ స్మార్ట్‌ఫోన్ కెమెరా కూడా ఈ రోవర్ కెమెరా ముందు సాటిరాదు. దీనికి ఉదాహరణే ఈ ఫొటోలు.
అంగారకుడిపై రోవర్ సృష్టించిన అద్భుతం
రోవర్ సృష్టించిన అద్భుతమైన చిత్రాన్ని మనం పరిశీలించాలంటే పైన ఇచ్చిన ఫొటోను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఫొటోలో ఎడమవైపు చూస్తే చిన్న తెల్లటి వృత్తం కనిపిస్తుంది. ఇది కేవలం రెండు ఇంచుల పరిమాణం ఉన్న గుర్తు మాత్రమే. అయితే, రోవర్ డైమండ్ టిప్ ఉన్న ప్రత్యేకమైన పరికరంతో మే 22, 2025న అక్కడ ఉన్న రాయిపై ఉన్న దుమ్మును క్లీన్ చేసింది. దీని ఫొటోను ముందుగానే భూమిమీదకు పంపింది. ఇక రెండోది ఫొటో మధ్యభాగానికి కుడివైపున ఉన్న పెద్దరాయి. దీనిని శాస్త్రవేత్తలు ఫ్లోట్‌రాక్‌గా చెబుతున్నారు. ఈ రాక్‌ను చాలా చాకచక్యంతో రోవర్ కెమెరా ఫొటోలుగా చిత్రీకరించింది. ఇక ఫొటో మధ్యలో ఒక స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తుంది. రోవర్ దగ్గర ఉన్న లేతరంగు రాళ్లలో ఒలివిన్ అనే ఖనిజం ఉంది. ఈ రేఖకు కొద్ది దూరంలో ఉన్న నల్లటిరాళ్లు కొన్ని కోట్ల సంవత్సరాల నాటి పురాతనమైన మట్టితో కూడిన రాళ్లుగా గుర్తించారు. ఇక ఈ ఫొటోకు కుడివైపున చివరన పర్సవరెన్స్ రోవర్ చక్రాల గుర్తులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు 300 అడుగుల దూరం వరకు ప్రయాణించిన ఈ గుర్తులు అంతకు ముందు పరిశోధనలు చేసిన కెన్మోర్ అనే ప్రాంతవ వరకు వెళ్లి మాయమయ్యాయి.
ఫొటో విశిష్టత
ఈ ఫొటో విశిష్టత ఏంటంటే, సాధారణంగా దుమ్ముతో నిండి ఉండే అంగారకుడి ఆకాశం ఈ ఫొటో తీసిన సమయంలో చాలా ప్రశాంతంగా, స్పష్టంగా ఉంది. శాస్త్రవేత్తలు దీని కాంట్రాస్ట్‌ను కాస్త పెంచి మనకు స్పష్టమైన నీలిరంగు ఆకాశంలా చూపించారు కానీ, నిజానికి అక్కడ ఆకాశం ఎరుపు,నారింజ రంగులో ఉంటుంది. రోవర్‌లోని 'మాస్ట్‌క్యామ్-జెడ్' కెమెరా సహాయంతో తీసిన ఈ 360-డిగ్రీల చిత్రం ఏకంగా 65 కిలోమీటర్ల మేర ఉన్న అంగారక గ్రహ సరిహద్దులను మన కళ్ల ముందుకు తెచ్చింది. ల్యాండ్‌స్కేప్ ఎంత విశాలంగా ఉన్నా..మన ఫోన్లు కొంత దూరం వరకు మాత్రమే చిత్రాలను తీయగలుగుతాయి. కానీ, రోవర్ కెమెరా 65 కిలోమీటర్ల పరిధిలోని చిత్రాలను స్పష్టంగా తీయగలిగింది. ఇలాంటి అద్భుతమైన కెమెరా మన మొబైల్ ఫోన్లలోకి కూడా వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.




