NATO: నాటోకు అగ్నిపరీక్షః ఒకవైపు హోర్ముజ్ మరోవైపు ఉక్రెయిన్
నాటో ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. స్వీడన్‌లోని హెల్సింగ్‌బోర్గ్ నగరంలో మే 21న ప్రారంభమైన నాటో విదేశాంగ మంత్రుల రెండు రోజుల సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
NATO: నాటో ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. స్వీడన్‌లోని హెల్సింగ్‌బోర్గ్ నగరంలో మే 21న ప్రారంభమైన నాటో విదేశాంగ మంత్రుల రెండు రోజుల సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంకారా శిఖరాగ్ర సదస్సుకు సన్నద్ధమవ్వడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ, ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ముదురుతున్న హోర్ముజ్ జలసంధి సంక్షోభం ఈ చర్చలను శాసిస్తున్నాయి. నాటో కూటమి ప్రయాణం సరిగా సాగుతుందా లేక ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయా అన్నది తెలియాలి.
నాటో సభ్యదేశాలపై డోనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి
ఈ సమావేశానికి ముందే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడులు చేయడానికి తమ సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు స్పెయిన్ వంటి కొన్ని నాటో సభ్యదేశాలు నిరాకరించడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు సైనిక స్థావరాలను ఇవ్వనప్పుడు, మీరు నాటో కూటమిలో ఎందుకు కొనసాగుతున్నారు? అని రూబియో బహిరంగంగానే ప్రశ్నించారు. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న సైనిక పోరాటంలోనూ, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిని రక్షించడంలోనూ నాటో దేశాలు అమెరికాకు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదని ట్రంప్ భావిస్తున్నారు. ఈ కారణంగానే గతంలో ఆయన నాటో కూటమి నుండి వైదొలుగుతామనే హెచ్చరికలు కూడా చేశారు. చాలా రోజులుగా ట్రంప్ ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. అయితే, నాటో సభ్యదేశాలు ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. కానీ, ఇప్పుడు ఇరాన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభాన్ని తీసుకొస్తున్న తరుణంలో కీలక నిర్ణయాలు తీసుకోవలసి వస్తోంది.
రక్షణ బడ్జెట్ పెంపు - ఉక్రెయిన్‌కు మద్దతు
మరోవైపు, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2035 నాటికి నాటో సభ్యదేశాలన్నీ తమ జీడీపీలో 5 శాతాన్ని రక్షణ బడ్జెట్ కోసం కేటాయించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. ఈ సమావేశంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా పాల్గొని మాట్లాడారు. రష్యా దూకుడును అడ్డుకోవడానికి ఉక్రెయిన్‌కు దీర్ఘకాలికంగా, స్థిరంగా ఆయుధాలు, ఆర్థిక సహాయాన్ని ఎలా అందించాలనే దానిపై నాటో దేశాలు సుదీర్ఘంగా చర్చించాయి. ఒకవైపు ఐరోపాలో రష్యా ముప్పు, మరోవైపు మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఉద్రిక్తతల మధ్య నలిగిపోతున్న నాటో కూటమికి ఈ సమయం నిజంగానే ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారింది. మరి ఈ అగ్నిపరీక్షలో నాటో ఎలా నెగ్గుతుందో చూడాలి. నాటోపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలతో కూటమి బీటలు వారే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కూటమి నుంచి అమెరికా వైదొలిగితే కూటమికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నదానిపై కూడా చర్చిస్తున్నారు. కూటమిలో ఉంటూనే గ్రీన్‌లాండ్‌పై అమెరికా కన్నేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.




