Earthquake: వరదల తర్వాత భూకంపం.. నేపాల్‎ను కోలుకోలేని దెబ్బతీసిన ప్రకృతి

Earthquake: ఇప్పటికే కుండపోత వర్షాలు, భయంకరమైన వరదలతో 157 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, తాజాగా బుధవారం రాత్రి 5.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రజలను మరింత తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

CR Reddy
Published on: 27 Aug 2026 6:48 AM IST
nepal earthquake
X

nepal earthquake

Earthquake: హిమాలయ దేశమైన నేపాల్‌ను ఒకవైపు ఆకస్మిక వరదలు ముంచెత్తుతుండగా, మరోవైపు భూప్రకంపనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదికల ప్రకారం భూమి లోపల సంభవించిన మార్పులు, కొండచరియలు విరిగిపడిన తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. కొండచరియలు విరిగిపడటానికి ముందు సంభవించిన చిన్నపాటి ప్రకంపనలే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. భయంకరమైన వరదల తాకిడికి కొండచరియలు విరిగిపడి ఇళ్లు, రహదారులు కొట్టుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు.

టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఉప్పొంగి వచ్చిన వరద ప్రవాహంలో వేలాది మంది ప్రజలు కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతోంది. ప్రధానంగా రసువా జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఈ ప్రాంతంలో సందర్శనకు వచ్చిన దాదాపు 400 మందికి పైగా పర్యాటకులు ఆచూకీ లేకుండా పోయారు. వారిలో 300 మందికి పైగా విదేశీయులు కాగా, అందులో 105 మంది భారతీయ పౌరులు ఉన్నట్లు సమాచారం అందుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరద ఉధృతికి అనేక గ్రామాలు మ్యాప్‌లోనే లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి.

వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రసువా, నువాకోట్, సింధుపాల్‌చోక్, చిత్వాన్ లాంటి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు 10 నుంచి 12 జిల్లాలకు బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో ఎక్కడ చూసినా శవాల దిబ్బలు, విరిగిన శిథిలాలే కనిపిస్తున్నాయి. మట్టిదిబ్బల కింద ఎంతమంది చిక్కుకున్నారో తెలియక స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

విపత్తు తీవ్రత ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలు చేపట్టడం సవాలుగా మారింది. నిటారైన కొండ ప్రాంతాలు, తెగిపోయిన రహదారుల కారణంగా సైన్యం నేలమార్గంలో వెళ్లలేకపోతోంది. అయినా సరే నేపాల్ సైన్యం, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేశాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 12 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఈ ఆపద సమయంలో పొరుగున ఉన్న భారతదేశం కూడా నేపాల్‌కి సహాయంగా సైనిక బలగాలను, రెస్క్యూ హెలికాప్టర్లను పంపించి మానవత్వాన్ని చాటుకుంది. వరదలు, భూకంపం ధాటికి నేపాల్ అస్తవ్యస్తంగా మారింది. గల్లంతైన భారతీయ పర్యాటకులు సురక్షితంగా తిరిగొస్తారని వారి కుటుంబసభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాబోయే గంటలు బాధితుల ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలకమని రెస్క్యూ బృందాలు వెల్లడిస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story