Nepal Floods: ఆపదలో నేపాల్‌కు అండగా ఇండియా.. 57.5 టన్నుల సామాగ్రితో పాటు 108 సేఫ్

Nepal Floods: వందలాది మంది భారతీయుల ప్రాణాలను కాపాడేందుకు ఇండియన్ ఆర్మీ, వైమానిక దళం క్షేత్రస్థాయిలో బిగ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

CR Reddy
Published on: 30 Aug 2026 6:10 AM IST
Nepal Floods
X

Nepal Floods

Nepal Floods: నేపాల్‌ను అతలాకుతలం చేసిన వరదల విపత్తులో పొరుగు దేశానికి భారత్ కొండంత అండగా నిలిచింది. వందలాది మంది భారతీయుల ప్రాణాలను కాపాడేందుకు ఇండియన్ ఆర్మీ, వైమానిక దళం క్షేత్రస్థాయిలో బిగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇప్పటివరకు 108 మంది భారత పౌరులను రక్షించడంతో పాటు ఏకంగా 57.5 టన్నుల సహాయ సామాగ్రిని అందించాయి. ఆగస్టు 26న నేపాల్‌లోని భోటే కోసి ప్రాంతంలో సంభవించిన ఘోర మెరుపు వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రోడ్లు, వంతెనలు, ఇళ్లు కొట్టుకుపోయి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్తు సమాచారం తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం వేగంగా స్పందించింది. వరదల్లో చిక్కుకున్న 108 మంది భారత పౌరులను సురక్షితంగా రక్షించింది. జాడ తెలియకుండా పోయిన మరో 50 మంది భారతీయులను గుర్తించి తిరిగి సంబంధాలు పునరుద్ధరించింది. ఈ జలప్రళయం తీవ్రత చైనా వైపు కూడా ఉండటంతో గత రెండు రోజుల్లో 598 మంది భారత పౌరులు చైనా సరిహద్దుల ద్వారా నేపాల్‌కు సురక్షితంగా చేరుకున్నారు.

వాయుసేన విమానాల్లో సాయం

ఈ దారుణ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోన్లో మాట్లాడి సానుభూతి తెలిపారు. కష్టకాలంలో సోదర దేశానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ కూడా అక్కడి విదేశాంగ అధికార బృందంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. గగనతలం ద్వారా బాధితులను ఆదుకునేందుకు భారత వైమానిక దళం విమానాలు రంగంలోకి దిగాయి. సీ-130జే హెర్క్యులస్, సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు మూడు విడతల్లో టెంట్లు, దుప్పట్లు, మందులు, తాగునీరు, జనరేటర్లు కలిపి 57.5 టన్నుల సామాగ్రిని కాఠ్‌మాండూకు చేరవేశాయి.

సొరంగాల్లో రక్షణకు ఆర్మీ స్పెషల్ టీమ్స్

వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత సైన్యం ప్రత్యేక బృందాలను పంపింది. ప్రమాదకర సొరంగాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు నిపుణులైన 13 మంది ఆర్మీ టన్నెల్ రెస్క్యూ బృందం, వైద్య బృందాలు నేపాల్ చేరాయి. కాఠ్మాండూ, బీజింగ్ భారత రాయబార కార్యాలయాల్లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ వరదల్లో మరణించిన వారి దేహాలను గుర్తించడానికి 19 మంది సభ్యులతో కూడిన 6 ఫోరెన్సిక్ టీమ్‌లను భారత్ పంపింది. డిఎన్‌ఏ నమూనాల ఆధారంగా మృతులను గుర్తించడంలో వీరు సహాయపడనున్నారు.

వంతెనల పునర్నిర్మాణానికి బైలీ బ్రిడ్జ్‌లు

వరద ధాటికి కొట్టుకుపోయిన కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు భారత్ బైలీ బ్రిడ్జ్ టెక్నాలజీ పరికరాలను సరిహద్దులు దాటించింది. తెగిపోయిన రహదారులపై ఈ తాత్కాలిక ఇనుప వంతెనలను నిర్మించి రాకపోకలను సాఫీగా మార్చేందుకు సాంకేతిక బృందాలు శ్రమిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా పంపేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సాంస్కృతిక బంధంతో పొరుగు దేశం ఆపదలో ఉన్నప్పుడు భారత్ తోబుట్టువులా నిలబడి తన మానవత్వాన్ని చాటుకుంటోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story