Nepal Floods: సెప్టెంబర్ 1న అత్యంత ఘోర ప్రమాదం? నేపాల్‌ను భయపెడుతున్న మరో ఉప్పెన

Nepal Floods: నేపాల్ దేశం తన చరిత్రలోనే కనీవినీ ఎరుగని అతిపెద్ద జలప్రళయాన్ని అనుభవిస్తోంది.

CR Reddy
Published on: 29 Aug 2026 6:58 AM IST
Nepal Floods
X

Nepal Floods 

Nepal Floods: నేపాల్ దేశం తన చరిత్రలోనే కనీవినీ ఎరుగని అతిపెద్ద జలప్రళయాన్ని అనుభవిస్తోంది. కొండచరియలు విరిగిపడి, నదులు ఉప్పొంగడంతో ఇప్పటివరకు 550 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 1500 మంది జాడ లేకుండా పోయారు. దీనికి తోడు చైనా సరిహద్దులోని మరో మంచు సరస్సు పగలడానికి సిద్ధంగా ఉండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆగస్టు 26న నేపాల్ ఉత్తర సరిహద్దులో ఊహించని విపత్తు విరుచుకుపడింది. సముద్ర మట్టానికి దాదాపు 5,200 మీటర్ల ఎత్తున ఉన్న భారీ హిమానీనదం ఒక్కసారిగా తెగిపడింది. 1,200 మీటర్ల లోతున ఉన్న లోయలోకి టన్నుల కొద్దీ రాళ్లు, మట్టి, మంచుతో కూడిన ప్రవాహం విరుచుకుపడింది. ఈ రాళ్ల దాడికి రసువా జిల్లాలోని పక్కా భవనాలు కూడా పిండిపిండిగా మారిపోయాయి. ప్రవాహ ఉద్ధృతికి త్రిశూలి నది నీటి మట్టం కేవలం అర్ధగంట వ్యవధిలోనే ఏకంగా 9 మీటర్ల ఎత్తుకు పెరిగి సర్వస్వం తుడిచిపెట్టుకుపోయింది.

మళ్లీ మోగుతున్న డేంజర్ బెల్స్

ఒక విపత్తు ముగియక ముందే నేపాల్-టిబెట్ సరిహద్దు వద్ద మరొక కొత్త గండం పొంచి ఉందనే సమాచారం వణుకు పుట్టిస్తోంది. షుఓకెన్-పోఇక్ త్సాంగ్పో నదుల సంగమం వద్ద ఏర్పడిన తాత్కాలిక మంచు సరస్సు పాక్షికంగా పగిలినట్లు చైనా గుర్తించింది. చైనా ఈ ప్రాంతంలో లెవెల్ 4 హెచ్చరికలు జారీ చేసింది. ఈ సరస్సు నుంచి పెద్ద మొత్తంలో నీరు కిందికి వస్తే భోటేకోశి నది మళ్లీ ఉగ్రరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రమాదాన్ని గ్రహించిన రసువా జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్‌ను 90 నిమిషాల పాటు నిలిపివేసి, నదీ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ఉప్పెనలా మారుతున్న 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు

చైనా ఇంజనీరింగ్ బృందాలు నిర్వహించిన వైమానిక సర్వే 3D మోడలింగ్ వివరాలు ఒళ్లు గగుర్పాటు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సరస్సు 150 మీటర్ల పొడవు, 50 మీటర్ల లోతు కలిగి ఉంది. గురువారం వరకు 20 లక్షల క్యూబిక్ మీటర్లుగా ఉన్న నీటి పరిమాణం శుక్రవారానికి 25 లక్షల క్యూబిక్ మీటర్లకు చేరింది. రాబోయే మూడు రోజుల్లో ఇది 50 లక్షల క్యూబిక్ మీటర్లకు చేరుతుందని అంచనా. అంటే దాదాపు 1,200 ఒలింపిక్ స్విమ్మింగ్ పూళ్లలోని నీరు ఒక్కసారిగా కొండల పైనుంచి కిందకు దూకితే జరిగే వినాశనాన్ని ఊహించడం కూడా కష్టమే. సెప్టెంబర్ 1 నాటికి ఈ సరస్సు పూర్తిగా పగిలిపోయే ప్రమాదం ఉంది.

శవాల దిబ్బగా మారిన ఆసుపత్రులు

ఇప్పటివరకు లభించిన గణాంకాల ప్రకారం 550 మందికి పైగా మృతదేహాలను వెలికితీశారు. ఒక్క చిత్వాన్ ప్రాంతం నుంచే 190కి పైగా శవాలను గుర్తించారు. ఆసుపత్రులలో శవాలను ఉంచడానికి స్థలం లేని పరిస్థితి నెలకొంది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా దెబ్బతినడంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. సైంటిస్టుల విశ్లేషణ ప్రకారం గ్లోబల్ వార్మింగ్ కారణముగా హిమాలయాల్లో గత 30 ఏళ్లలో మూడో వంతు మంచు కరిగిపోయింది. కరుగుతున్న మంచు వల్ల పర్వతాల పట్టు సడలి ఇటువంటి ఘోర విపత్తులు సంభవిస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story