Nepal Floods : 900 దాటిన నేపాల్ వరద మృతుల సంఖ్య.. పేరుకుపోతున్న మృతదేహాలు
Nepal Floods : నేపాల్‌ను అతలాకుతలం చేసిన భయానక వరదల ధాటికి మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వివిధ జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో..
nepal floods
Nepal Floods : నేపాల్‌ను అతలాకుతలం చేసిన భయానక వరదల ధాటికి మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వివిధ జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో కొట్టుకొచ్చిన శవాలు బయటపడుతుండటంతో శవాల దిబ్బలు పేరుకుపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ జలప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏకంగా 903కి చేరినట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDRRMA) సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.
చిత్వాన్ జిల్లాలోనే అత్యధిక శవాలు.. డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరించి దహన సంస్కారాలు..
ఈ విపత్తులో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దక్షిన చిత్వాన్ జిల్లాలోనే అత్యధికంగా 272 మృతదేహాలు లభ్యమయ్యాయి. లభ్యమైన శవాల సంఖ్య భారీగా ఉండటంతో వాటిని మేనేజ్ చేయడం స్థానిక అధికారులకు పెద్ద సవాలుగా మారింది. జిల్లాలో వ్యాధులు ప్ర వ్యాపించకుండా ఉండేందుకు కాళీ గండకి, త్రిశూలి నదుల సంగమ ప్రాంతమైన దేవ్ ఘాట్ వద్ద మెజారిటీ మృతదేహాలకు అధికారులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే భవిష్యత్తులో ఐడెంటిఫికేషన్ కోసం ప్రతీ డీఎన్‌ఏ (DNA) శాంపిల్స్‌ను సేకరించినట్లు జిల్లా పరిపాలనాధికారులు తెలిపారు. గుర్తింపు లేని మిగతా శవాలను వివిధ జిల్లాల్లోని 21 హాస్పిటళ్లలో భద్రపరిచామని, బంధువులు వచ్చి చెక్ చేసుకోవాలని NDRRMA కోరింది.
ఇంకా 4,000 మందికి పైగా గల్లంతు..
ఈ వరదల వల్ల 592 మంది విదేశీయులతో సహా మొత్తం 4,247 మంది ఇంకా అడ్రస్ లేకుండా పోయారు. భోటేకోషి, త్రిశూలి నదీ తీర ప్రాంతాల్లోని వివిధ హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 933 మంది వర్కర్లు కూడా కాంటాక్ట్‌లోకి రావడం లేదు. వేర్వేరు ప్రాజెక్టులకు చెందిన టన్నెళ్లలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ఇండియా , చైనా టెక్నికల్ టీమ్స్ హెల్ప్‌తో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. నేపాల్-చైనా బోర్డర్ ఏరియాలో విపత్తు సంభవించినప్పటి నుంచి నేపాల్ ఆర్మీ, పోలీస్ , శశస్త్ర సీమా బల్ సిబ్బంది కూడా సమాచారం లేకుండా పోయారు. ఇక ఈ ఘటనలో 267 మంది గాయపడగా, ట్రీట్‌మెంట్ తర్వాత 156 మంది డిశ్చార్జ్ అయ్యారు.
రంగంలోకి 20 వేల మందికి పైగా రెస్క్యూ సిబ్బంది..
నేపాల్ ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం 10,451 మందిని సురక్షితంగా రెస్క్యూ చేసింది. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లు, ఎయిర్ ఆపరేషన్స్ ద్వారా 252 మంది ఫారెనర్లు , 3,344 మంది స్థానికులను కాపాడింది. గ్రౌండ్ లెవెల్‌లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఏకంగా 20,819 మంది సెక్యూరిటీ సిబ్బందిని రంగంలోకి దించారు. ఇందులో 8,722 మంది నేపాల్ ఆర్మీ, 7,894 మంది పోలీసులు , 4,203 మంది ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నారు.




