Nepal Floods: నేపాల్‌ వరదల్లో 1100 దాటిన మృతులు.. 166 మంది భారతీయులను కాపాడిన ఎయిర్‌ఫోర్స్

Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన విధ్వంసానికి పిట్టల్లా జనాలు రాలిపోతున్నారు.

CR Reddy
Published on: 3 Sept 2026 7:34 AM IST
Nepal Floods
X

Nepal Floods

Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన విధ్వంసానికి పిట్టల్లా జనాలు రాలిపోతున్నారు. ఈ జలప్రళయంలో మృతుల సంఖ్య ఏకంగా 1,100 దాటింది. అక్కడ చిక్కుకున్న 166 మంది భారతీయులను మన దళాలు సురక్షితంగా కాపాడగా, చైనా వైపు కైలాస మానససరోవర యాత్రలో ఉన్న మరో 410 మంది భారతీయులు క్షేమంగా బయటపడ్డారు. టిబెట్ సరిహద్దుల్లోని హిమపాతం లేండే ఖోలా నది ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఆనకట్ట తెగిపోయింది. దాంతో భోటేకోశి, త్రిశూలి నదులు ఉప్పొంగి మానవ ఆవాసాలను నిమిషాల వ్యవధిలో ముంచెత్తాయి. ఇప్పటివరకు 1,114 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. దాదాపు 3,916 మంది జాడ తెలియకుండా పోవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. నేపాల్ ప్రధాని బలేంద్ర షా ఈ ఘోర విపత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ వాతావరణ మార్పులే ఈ విధ్వంసానికి కారణమని వ్యాఖ్యానించారు.

భారత వైమానిక దళం భారీ రెస్క్యూ ఆపరేషన్

పొరుగు దేశంలో విపత్తు సంభవించిన మరుక్షణమే భారత్ అత్యవసర సహాయక చర్యలు చేపట్టింది. భారత వైమానిక దళానికి చెందిన విమానాలు ఇప్పటికే 74 టన్నుల సహాయక సామగ్రిని నేపాల్ రాజధాని ఖాట్మండుకు చేరవేసాయి. ఇందులో యాంటీబయాటిక్స్, సర్జికల్ వస్తువులు, అత్యవసర మందులతో కూడిన 5.5 టన్నుల మెడికల్ కిట్లు ఉన్నాయి. ఇండియన్ అంబాసిడర్ నవీన్ శ్రీవాస్తవ ఈ సహాయక సామాగ్రిని నేపాల్ ప్రభుత్వానికి స్వయంగా అందించారు.

టన్నెల్‌లో ఛేదించుకుంటూ సాగుతున్న సెర్చ్ ఆపరేషన్

చిలిమే ప్రాంతంలోని టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. త్రిశూలి నుంచి శ్యాబ్రుబేసికి కేంద్రస్థానాన్ని మార్చుకుని పని వేగవంతం చేశారు. కొండచరియలు విరిగిపడి పేరుకుపోయిన బురదను తొలిచి దాదాపు 100 మీటర్ల మేర సొరంగంలోకి ముందడుగు వేశారు. తవ్వకపు యంత్రాలు లోపలికి తీసుకెళ్లేందుకు వీలుగా తాత్కాలిక రహదారి మార్గాన్ని సుగమం చేస్తున్నారు.

డీఎన్‌ఏ విశ్లేషణలో భారత ఫోరెన్సిక్ బృందం

సహాయక చర్యలతో పాటు మృతదేహాల గుర్తింపు ప్రక్రియలో నేపాల్ అధికారులకు మన శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారు. భారత్ నుంచి వెళ్లిన ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం ఖాట్మండులోని రెండు ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ శాంపిళ్లను పరీక్షించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి టిబెట్ పరిసరాల్లో చిక్కుకున్న 410 మంది భారతీయ యాత్రికులు బుధవారం చైనా నుంచి సురక్షితంగా స్వదేశానికి ప్రయాణమయ్యారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story