Balendra Shah: నేపాల్ ప్రధాని భారత్ టూర్.. బాగ్డోగ్రాపై క్లారిటీ.!
Balendra Shah: నేపాల్‌లోని బాగ్డోగ్రా ఎంట్రీ పాయింట్‌ను మిలిటరీ విమానాలు వాడుకునేలా భారత్ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని ఏఎన్ఐ వార్తా సంస్థకు వర్గాలు తెలిపాయి.
Balendra Shah: నేపాల్ ప్రధాని భారత్ టూర్.. బాగ్డోగ్రాపై క్లారిటీ.!
Balendra Shah: నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా భారత్ పర్యటనకు ముందు వచ్చిన వార్తలపై వర్గాలు స్పష్టత ఇచ్చాయి. నేపాల్‌లోని బాగ్డోగ్రా ఎంట్రీ పాయింట్‌ను మిలిటరీ విమానాలు వాడుకునేలా భారత్ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని ఏఎన్ఐ వార్తా సంస్థకు వర్గాలు తెలిపాయి. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశాయి. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా ఎయిర్‌పోర్టుకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే పౌర విమానాల కోసం నేపాల్ గగనతలాన్ని ఉపయోగించుకునే అంశంపై వార్తలు రాగా, మిలిటరీ విమానాలకు సంబంధించిన కథనాలను ఆ వర్గాలు ప్రత్యేకంగా ఖండించాయి.
మోదీతో భేటీ.. ఢిల్లీ పర్యటన వివరాలు
నేపాల్ ప్రధానిగా బలేంద్ర షా తొలిసారిగా ఆదివారం రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు రానున్నారు. సోమవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. చర్చల తర్వాత ఇద్దరు నేతలు కలిసి పలు ఇంధన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసి మార్చుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బలేంద్ర షా రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పిస్తారు. వాణిజ్య, ఆర్థిక బంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో జరిగే నేపాల్-ఇండియా బిజినెస్ ఫోరమ్‌లోనూ ఆయన పాల్గొంటారు.
జనక్‌పుర్ ధామ్ నుంచి అయోధ్యకు కొత్త వీక్లీ ట్రైన్
ఇరు దేశాల మధ్య ప్రయాణ సౌకర్యాన్ని పెంచేలా నేపాల్‌లోని జనక్‌పుర్ ధామ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య కాంట్తో కలుపుతూ కొత్త వీక్లీ ట్రైన్ నడవనుంది. సుమారు 604 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ సర్వీసు వల్ల బిహార్, యూపీ ప్రయాణికులకు మరో ప్రయాణ మార్గం అందుబాటులోకి వస్తుంది. జనక్‌పుర్ ధామ్ నుంచి బయలుదేరే ఈ రైలు జయనగర్, మధుబని, శిషో, సీతామర్హి, రక్సౌల్, నర్కటియాగంజ్, గోరఖ్‌పూర్, బస్తీ, మన్కాపూర్, అయోధ్య ధామ్ స్టేషన్ల మీదుగా అయోధ్య కాంట్ చేరుకుంటుంది. ప్రధాన పుణ్యక్షేత్రాలైన జనక్‌పుర్, అయోధ్యను ఈ రైలు అనుసంధానిస్తుంది.
భారత్-నేపాల్ సంబంధాలు.. కొత్త ఊపు
భారత్, నేపాల్ మధ్య 1,751 కిలోమీటర్ల ఓపెన్ బార్డర్ ఉండటంతో పాటు తరతరాలుగా సాంస్కృతిక, కుటుంబ బంధాలు కొనసాగుతున్నాయి. 1950 నాటి శాంతి, మైత్రీ ఒప్పందం ఈ సంబంధాలకు పునాదిగా నిలుస్తోంది. ఉపాధి, కుటుంబ అనుబంధాలను సూచించే రోటీ-బేటీ కా రిష్తా అనే మాట ఇరువైపులా ప్రజల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను ప్రతిబింబిస్తుంది. నేపాల్ కొత్త నాయకత్వం కింద వాణిజ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ రంగాల్లో మరింత దగ్గరగా పనిచేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. షా పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు వస్తుందని, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంచుకునే మార్గాలను సమీక్షించుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.




