Benjamin Netanyahu : ఇకనైనా అణు ప్రోగ్రాంకు స్వస్తి చెప్పాలి.. ఇరాన్‎కు వార్నింగ్ ఇచ్చిన నెతన్యాహు

Benjamin Netanyahu : అమెరికా పర్యటనకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు.

CR Reddy
Published on: 27 July 2026 6:19 AM IST
Benjamin Netanyahu
X

Benjamin Netanyahu 

Benjamin Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దౌత్యపరమైన ఒప్పందాలు కుదిరినా లేకపోయినా ఇరాన్ తన అణు ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం వాషింగ్టన్‌లో యుఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌తో కీలక సమావేశం కానున్న నేపథ్యంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ పాలనలో రాజకీయ మార్పులు రావడం లేదా అణు ప్రయోగాలను పూర్తిగా స్వస్తి చెప్పి ప్రాంతీయ విధానాలను మార్చుకోవడం ద్వారానే ఈ యుద్ధానికి ముగింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా తాత్కాలిక బ్రేక్

మరోవైపు ఇరాన్‌పై సైనిక చర్యలకు అమెరికా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి దౌత్య మార్గానికి అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో యుఎస్ రాయబారి మైక్ వాల్ట్జ్ స్పందిస్తూ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన చర్చలకు సమయం ఇచ్చేందుకే వైమానిక దాడులను నిలిపివేశారని తెలిపారు. చర్చలు అన్ని స్థాయిలలో సాగుతున్నాయని, ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రెసిడెంట్ వద్ద అన్ని రకాల సైనిక ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయని కూడా స్పష్టం చేశారు.

హోర్ముజ్‌లో ట్యాంకర్ పేలుడు

అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాలను ఎదుర్కొనేందుకు ఇరాన్ సైతం సిద్ధమవుతోంది. నెతన్యాహు యుఎస్ పర్యటనకు ముందే ఇరాన్ తన వైమానిక రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకుంది. హోర్ముజ్ జలసంధిలో, ఇరాన్‌ను బలహీనపరచడంలో అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైందని ఇరాన్ సైనిక ప్రతినిధి మహమ్మద్ అక్రమినియా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇరాన్ కేటాయించిన సముద్ర మార్గం నుంచి దారితప్పిన ఒక ఆయిల్ ట్యాంకర్, నావికా మైన్ ఢీకొని పేలిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. తాము సూచించిన మార్గాల్లో కాకుండా వేరే మార్గాల్లో వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ ముందే హెచ్చరించడం గమనార్హం.

ఒమన్ మధ్యవర్తిత్వం, పోప్ శాంతి పిలుపు

ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని పునరుద్ధరించేందుకు ఇరాన్, ఒమన్ దేశాల మధ్య చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. ఒమన్ అధికారులు టెహ్రాన్ సందర్శించి చర్చలు జరుపుతున్నారు. ఈ పరిణామాల మధ్య వాటికన్ సిటీ నుంచి పోప్ లియో XIV మిడిల్ ఈస్ట్‌లో శాంతి నెలకొనాలని పిలుపునిచ్చారు. సైనిక చర్యల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగి సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాగునీరు, విద్యుత్ కొరత తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు తక్షణమే దాడులు ఆపి, దౌత్య మార్గంలో చర్చల ద్వారా శాశ్వత శాంతిని సాధించాలని పోప్ అభ్యర్థించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story