Israel Vs USA: భారత్‌ను ఇరుకున పెట్టి అమెరికాకు షాకిచ్చిన నెతన్యాహు...ఏం జరగబోతున్నది?
జేడీ వాన్స్ వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘాటుగా స్పందిస్తూ భారత్‌ను కీలక మిత్రదేశంగా ప్రస్తావించారు. అమెరికా-ఇజ్రాయెల్ విభేదాలు, భారత్ పాత్ర, అంతర్జాతీయ దౌత్య పరిణామాలు ఎలా మారుతున్నాయో తెలుసుకుందాం.
Israel Vs USA: అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. అగ్రరాజ్యం అమెరికాకు, దాని చిరకాల మిత్రుడు ఇజ్రాయిల్‌కు మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇజ్రాయిల్‌పై చేసిన వ్యాఖ్యలకు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు గట్టిగా కౌంటర్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్‌కు అమెరికా ఒక్కటే అత్యంత మిత్రదేశం కాదని, భారత్ వంటి అండగా నిలిచే పెద్ద చేశాలు కూడా తమకు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమెరికా ఒక్కటే శక్తివంతమైన దేశంతో పాటు భారత్ మాటను కూడా ఇక్కడ ఇజ్రాయిల్ పేర్కొనడంతో అంతర్జాతీయంగా పలు చర్చలు జరుగుతున్నాయి. అమెరికాకు ప్రత్యామ్నాయంగా భారత్ ఎదుగుతోందని చెప్పండంతో పాటు, దౌత్యరంగంలో అమెరికాకు మించే విధంగా భారత్ ఉంటోందని కూడా అర్ధం చేసుకోవచ్చు.
అసలేం జరిగింది?
ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని, అలాగే లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడులను వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వ్యతిరేకించారు. అక్కడితో ఆగకుండా ఇజ్రాయిల్‌కు రక్షణ కల్పించే ఆయుధాల్లో మూడింట రెండొతులు అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ముతోనే తయారయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ఇబ్బందుల్లో పడకూడదు అంటే అమెరికాను కాదని ఇజ్రాయిల్ ఏమీ చేయకూడదని పేర్కొన్నారు. దీన్ని ఆయన ఓ హెచ్చరిక రూపంలో పేర్కనడంతో ఇజ్రాయిల్‌కు కోపం వచ్చింది. ఈ నేపథ్యంలోనే బెంజిమెన్ నెతన్యాహు ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు. తమకు మిత్ర దేశాల మద్దతు ఉందని, 140 కోట్ల జనాభా ఉన్న భారత్ మద్దతు తమకు సంపూర్ణంగా ఉందని పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఇరుకున పడ్డ భారత్? అమెరికాకు షాక్?
నెతన్యాహు నేరుగా భారత్ పేరును ప్రస్తావించడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఇటు అమెరికాతోనూ, అటు ఇజ్రాయెల్‌తోనూ సమానమైన వ్యూహాత్మక సంబంధాలు నడుపుతున్న భారత్‌ను, ఈ ఇద్దరి లొల్లిలోకి లాగినట్లయింది. అమెరికాను హెచ్చరించడానికి 140 కోట్ల జనాభా గల దేశాన్ని ఇజ్రాయెల్ ఒక రక్షణ కవచంగా వాడుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీరూట్ లాంటి పౌర నివాసాలపై ఇజ్రాయెల్ జరిపే దాడుల వల్ల ఇరాన్-అమెరికా శాంతి చర్చలు దెబ్బతింటున్నాయని వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజ్బుల్లా ఉగ్రవాదుల నుంచి రక్షణ కోసం లెబనాన్ సరిహద్దులోని క్రైస్తవ గ్రామాలే తమను ఇజ్రాయెల్‌లో విలీనం చేసుకోవాలని కోరుతున్నాయని నెతన్యాహు సరికొత్త లైన్ తెరపైకి తెచ్చారు. ట్రంప్ తనకూ మంచి మిత్రుడేనని నెతన్యాహు చెబుతున్నప్పటికీ, వాన్స్ చేసిన వ్యాఖ్యలు మాత్రం వాషింగ్టన్, టెల్ అవీవ్ మధ్య లోతైన విభేదాలను స్పష్టం చేస్తున్నాయి. మిత్రదేశాల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో భారత్ ఏ రకమైన దౌత్య నీతిని అవలంబిస్తుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.




