Benjamin Netanyahu : మృత్యువు అంచున నెతన్యాహు? అడుగు బయటపెడితే ఇరాన్ బాంబుల వర్షం తప్పదా?
Benjamin Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇరాన్ ఏజెంట్ల దాడుల భయంతో కోర్టు విచారణ వాయిదా వేయాలని నిఘా సంస్థ షిన్ బెట్ సంచలన నివేదిక వెల్లడించింది.
Benjamin Netanyahu
Benjamin Netanyahu :ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహుకు ఇప్పుడు కష్టాలు రెట్టింపయ్యాయి. ఒకవైపు ఇరాన్‌తో యుద్ధ వాతావరణం, మరోవైపు సొంత దేశంలోనే ఎదుర్కొంటున్న అవినీతి కేసులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ ఇజ్రాయెల్ భద్రతా సంస్థ ఇచ్చిన నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. కోర్టు గడప తొక్కకుండా ఉండేందుకే ప్రధాని ఈ ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్ అధినేత డేవిడ్ జిని సంచలన ప్రకటన చేశారు. ప్రధాని నెతన్యాహు ప్రస్తుతం ఎదుర్కొంటున్న నేర విచారణలో భాగంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం ఏమాత్రం క్షేమకరం కాదని ఆయన కోర్టు అధికారులకు తెలిపారు. వచ్చే వారం ఈ విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉందని నిఘా సంస్థ హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ఇరాన్ ఏజెంట్లు నెతన్యాహును లక్ష్యంగా చేసుకున్నారని, ఆయన బహిరంగంగా కనిపించే ప్రదేశాల్లో దాడులు జరిగే ప్రమాదం ఉందని షిన్ బెట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
విచారణ వాయిదాకు ఎత్తుగడలేనా?
స్థానిక ఛానల్ 13 నివేదిక ప్రకారం.. నెతన్యాహుపై జరుగుతున్న విచారణను కనీసం రెండు వారాల పాటు వాయిదా వేయాలని జిని కోర్టును కోరారు. ప్రధాని పర్యటనలు లేదా కోర్టు హాజరు వంటి సమాచారం బయటకు తెలిస్తే, అది ఇరాన్ ఏజెంట్లకు ఒక అవకాశంగా మారుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే, దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెతన్యాహుకు అత్యంత సన్నిహితుడైన జినిని ఆయనే నియమించుకున్నారని, అందుకే ప్రధానిని కేసుల నుంచి తప్పించేందుకు ఇలాంటి సాకులు చెబుతున్నారని ప్రతిపక్షాలు, కొన్ని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.
నిఘా సంస్థ మాజీ చీఫ్ భిన్నమైన వాదన
షిన్ బెట్ మాజీ అధినేత రోనెన్ బార్ గతంలో నెతన్యాహుకు వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేశారు. గత ఏడాది కూడా భద్రతా కారణాలతో సాక్ష్యం రద్దు చేయాలని ప్రధాని కోరినప్పుడు, భద్రతకు ఎలాంటి ఢోకా లేదని, ప్రధాని కోర్టుకు రావచ్చని బార్ తేల్చి చెప్పారు. ఇప్పుడు కొత్తగా నియమితులైన జిని మాత్రం ప్రధానికి వత్తాసు పలుకుతూ విచారణకు అడ్డుపడుతున్నారని నిఘా బృందాలు మండిపడుతున్నాయి. గత నెల రోజుల క్రితం ఉన్న భద్రతా పరిస్థితికి, ఇప్పటికీ పెద్ద తేడా లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
అవినీతి కేసుల పరంపర
ప్రధాని పదవిలో ఉండి అవినీతి కేసులను ఎదుర్కొంటున్న మొదటి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. 2019లో ఆయనపై లంచం తీసుకోవడం, మోసం చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. 2020లో ప్రారంభమైన ఈ కేసు విచారణలో దోషిగా తేలితే ఆయన జైలుకు వెళ్లడం ఖాయం. అయితే, ప్రధానిగా తన బాధ్యతలను అడ్డుపెట్టుకుని విచారణను నిరంతరం వాయిదా వేస్తూ వస్తున్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు నేతలు నెతన్యాహును క్షమించాలని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.




