Israel Iran War : ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‎కు నెతన్యాహు వార్నింగ్.. ముజ్తబా ఖమేనీకి కూడా ప్రాణ గండమే

Israel Iran War : ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీని కూడా వదలబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. అమెరికాతో కలిసి చేస్తున్న దాడులు అంచనాలకు మించి సక్సెస్ అవుతున్నాయని ఆయన ప్రకటించారు.

CR Reddy
Published on: 13 March 2026 8:18 AM IST
Israel Iran War
X

Netanyahu Warns Irans New Leader  

Israel Iran War : మధ్యప్రాచ్యంలో ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దేశాలు సాగిస్తున్న యుద్ధం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఇరాన్ అగ్రనేత అయాతుల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఇరాన్ పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు, కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీకి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని నియంతృత్వ పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని, అమెరికాతో కలిసి సాగిస్తున్న ఈ ఉమ్మడి సైనిక చర్య అంచనాలకు మించి విజయవంతమవుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ముజ్తబా ఖమేనీ, హిజ్బుల్లా కొత్త చీఫ్ నయీమ్ కాసిమ్‌లను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు నెతన్యాహు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "ఏ ఉగ్రవాద సంస్థ నాయకుడికి కూడా నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వను" అని వ్యాఖ్యానించడం ద్వారా వారిని కూడా మట్టుబెడతామని పరోక్షంగా హెచ్చరించారు. ఇజ్రాయెల్ చేపట్టిన రోరింగ్ లయన్(Roaring Lion), అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury) కలిసి ఇరాన్ అణు సామర్థ్యాన్ని, మిసైల్ వ్యవస్థను తుత్తునియలు చేస్తున్నాయని ఆయన వివరించారు.

ఇరాన్ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు మాట్లాడుతూ, స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సమయం దగ్గరలోనే ఉందని పిలుపునిచ్చారు. "మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ అణచివేతను ఎదిరించి వీధుల్లోకి రావాల్సింది మీరే. స్వేచ్ఛ అనేది మీ చేతుల్లోనే ఉంది" అని ఆయన అన్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, బాసిజ్ బలగాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతాయని, ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేయడానికి అవసరమైన అనుకూల పరిస్థితులను తాము కల్పిస్తామని స్పష్టం చేశారు. అయితే అధికార మార్పిడి కోసం నేరుగా భూతలంపై బలగాలను దింపే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న సంబంధాల గురించి నెతన్యాహు గొప్పగా చెప్పుకొచ్చారు. "గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని మధ్య లేనంత బలమైన బంధం మా మధ్య ఉంది. మేము దాదాపు ప్రతిరోజూ మాట్లాడుకుంటాము, సలహాలు ఇచ్చుకుంటాము మరియు ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటాము" అని తెలిపారు. ఈ యుద్ధం తర్వాత ఇరాన్, మధ్యప్రాచ్యం, ఇజ్రాయెల్ మునుపటిలా ఉండవని, భవిష్యత్ తరాల కోసం తాము ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని నెతన్యాహు ఉద్ఘాటించారు. ఈ పోరాటంలో మరిన్ని సర్ప్రైజ్ అటాక్స్ ఉంటాయని ఆయన హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

CR Reddy

CR Reddy

Next Story