Euthanasia : చరిత్రలోనే మొదటిసారి.. 12 ఏళ్లలోపు చిన్నారికి కారుణ్య మరణం ప్రసాదించిన నెదర్లాండ్స్
Euthanasia : నెదర్లాండ్స్‌లో 2024 చట్ట సవరణ తర్వాత మొదటిసారిగా 12 ఏళ్లలోపు చిన్నారికి చట్టబద్ధంగా కారుణ్యమరణం ఇచ్చారు. లైలాజ్ వ్యాధులతో బాధపడే పిల్లల కోసమే ఈ సరికొత్త నిబంధనలు తెచ్చారు.
Euthanasia
Euthanasia : అంతర్జాతీయంగా మెడికల్, లీగల్ రంగాల్లో పెద్ద చర్చకు దారితీసే ఒక విచిత్రమైన ఘటన నెదర్లాండ్స్‌లో చోటుచేసుకుంది. అక్కడ చట్టబద్ధంగా 12 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న ఒక చిన్నారికి కారుణ్య మరణం కల్పించారు. నెదర్లాండ్స్ ఆరోగ్య శాఖ మంత్రి సోఫీ హెర్మన్స్ పార్లమెంట్‌లో ప్రభుత్వం తరఫున వార్షిక నివేదికను సమర్పిస్తున్న సమయంలో ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ, కోలుకునే అవకాశం ఏమాత్రం లేని ఆ చిన్నారి గత ఏడాది కారుణ్యమరణం ద్వారా శాశ్వత నిద్రలోకి జారుకున్నట్లు తెలిపారు. అయితే సదరు చిన్నారి ప్రైవసీని కాపాడేందుకు ఆమె వయస్సు, లింగం లేదా వ్యాధికి సంబంధించిన ఎలాంటి వ్యక్తిగత వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు.
2024 లో మారిన చట్టం.. పిల్లలకు దొరికిన హక్కు
నెదర్లాండ్స్ ప్రభుత్వం 2024 లో తమ దేశ ఇచ్ఛామరణ చట్టంలో కొన్ని కీలక సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కారుణ్య మరణాన్ని ఎంచుకునే హక్కును కల్పించారు. అయితే ఈ అనుమతి కేవలం తీవ్రమైన వైద్య కారణాలు ఉన్నప్పుడే లభిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరో ఒక వ్యక్తి మానసికంగా కృంగిపోయి, జీవితంపై విరక్తి చెంది ఇక బతకాలని లేదు అని అనుకుంటే మాత్రం ఈ చట్టం కింద కారుణ్యమరణానికి ఎలాంటి అనుమతి లభించదని నెదర్లాండ్స్ పాలకులు ఖచ్చితమైన లైన్ గీశారు.
డాక్టర్లు పాటించాల్సిన కఠినమైన రూల్స్
ఒక రోగికి కారుణ్యమరణం ఇవ్వడానికి ముందు అక్కడి వైద్యులు చాలా కఠినమైన చట్టపరమైన నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. రోగి అనుభవిస్తున్న నరకయాతన, నొప్పి ఏమాత్రం భరించలేనిదిగా ఉండాలి, అలాగే భవిష్యత్తులో ఆ వ్యాధి నయమయ్యే అవకాశం సున్నా శాతం ఉండాలి. వీటన్నింటితో పాటు సదరు వ్యాధి గురించి, దాని తీవ్రత గురించి పేరెంట్స్ కు పూర్తి సమాచారం అందించి ఉండాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెడికల్ టెక్నాలజీలో ఆ రోగి ప్రాణాలు కాపాడేందుకు లేదా నొప్పి తగ్గించేందుకు ఎలాంటి ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలు లేవని నిర్ధారించుకోవాలి. ఈ ప్రక్రియ చేపట్టే డాక్టర్ కాకుండా మరొక ఇండిపెండెంట్ డాక్టర్ నుంచి కూడా లిఖితపూర్వక అభిప్రాయాన్ని సేకరించడం తప్పనిసరి.
మొత్తం ప్రక్రియపై ప్రభుత్వ లీగల్ స్క్రీనింగ్
ఆరోగ్య మంత్రి సోఫీ హెర్మన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చిన్నారికి కారుణ్యమరణం ప్రసాదించిన కేసును ఇప్పుడు ప్రభుత్వ న్యాయవాదులు లీగల్ గా పరిశీలిస్తున్నారు. కారుణ్య మరణాన్ని అమలు చేసిన సదరు వైద్యుడు చట్టంలో పేర్కొన్న అన్ని నిబంధనలను, గైడ్‌లైన్స్‌ను పక్కాగా పాటించాడా లేదా అనే కోణంలో ఈ విచారణ సాగుతుంది. ఒకవేళ ఏ డాక్టర్ అయినా చట్ట పరిధిని దాటి, నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా కారుణ్యమరణం ఇస్తే.. నెదర్లాండ్స్ చట్టాల ప్రకారం వారికి గరిష్టంగా 12 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశం ఉంది.
గతంలో ఉన్న నిబంధనలు ఏంటి?
ఈ సరికొత్త చట్ట సవరణకు ముందు నెదర్లాండ్స్‌లో ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న శిశువులకు, అలాగే 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలకు మాత్రమే కారుణ్యమరణం పొందే హక్కు ఉండేది. కానీ మధ్యలో ఉండే 1 నుంచి 12 ఏళ్ల పిల్లలకు ఈ సదుపాయం ఉండేది కాదు. అలాంటి పిల్లలకు కేవలం నొప్పి తెలియకుండా ఉండే కేర్ మాత్రమే అందించేవారు లేదా వారు సహజంగా మరణించే వరకు ఎదురుచూడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు కారుణ్యమరణం ఇవ్వాలంటే తల్లిదండ్రుల సంతకం ఖచ్చితంగా కావాలి. అదే 16 లేదా 17 ఏళ్ల వయసు ఉన్న యువత తమ అంతిమ నిర్ణయాన్ని స్వయంగా తీసుకోవచ్చు, అయితే ఆ ప్రక్రియలో వారి పేరెంట్స్ భాగస్వామ్యం వహిస్తారు.
ప్రపంచంలోనే తొలి దేశంగా నెదర్లాండ్స్ రికార్డ్
ప్రపంచవ్యాప్తంగా కారుణ్యమరణం చట్టబద్ధం చేసిన మొట్టమొదటి దేశంగా నెదర్లాండ్స్ చరిత్రకెక్కింది. 2002 లోనే ఈ దేశం కారుణ్య మరణానికి లీగల్ హోదా కల్పించింది. ఇక్కడ జరిగే ప్రతి కారుణ్యమరణ కేసును ఒక ప్రత్యేక వైద్య సమీక్షా కమిటీ నిశితంగా పరిశీలిస్తుంది. నెదర్లాండ్స్ తర్వాత పొరుగు దేశమైన బెల్జియం కూడా 2014 లోనే అన్ని వయసుల పిల్లలకు కారుణ్యమరణాన్ని అనుమతిస్తూ చట్టం చేసి ప్రపంచాన్ని ఆకర్షించింది. నెదర్లాండ్స్ ప్రభుత్వం అంచనా ప్రకారం.. వారి దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 నుంచి 10 మంది పిల్లలు ఇటువంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడి ఈ చట్టాన్ని ఉపయోగించుకునే పరిస్థితి రావచ్చు.




