Kim Jong Un : కొత్త న్యూక్లియర్ ఫ్యాక్టరీని తెరిచిన కిమ్.. గజగజ వణుకుతున్న ప్రపంచ దేశాలు
Kim Jong Un : ఉత్తర కొరియా సరికొత్త న్యూక్లియర్ ఫ్యాక్టరీని ప్రారంభించి ప్రపంచ దేశాలకు గట్టి హెచ్చరికలు పంపింది. మిసైళ్ల ఉత్పత్తిని రెండున్నర రెట్లు పెంచాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు.
Kim Jong Un
Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచ దేశాలకు మరోసారి గట్టి హెచ్చరికలు పంపారు. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సరికొత్త న్యూక్లియర్ ఫ్యాక్టరీని ప్రపంచానికి పరిచయం చేశారు. జూన్ 3వ తేదీన ఈ కొత్త న్యూక్లియర్ మెటీరియల్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ఆయన, తమ యురేనియం సంవర్ధక సామర్థ్యాన్ని బాహాటంగానే ప్రదర్శించారు. అమెరికా, దాని మిత్రదేశాల నుంచి పెరుగుతున్న ముప్పుకు సమాధానంగానే తమ అణ్వాయుధాల నిల్వలను శరవేగంగా పెంచుకోవాలని కిమ్ తన సైన్యానికి, శాస్త్రవేత్తలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా అణు కార్యక్రమాల్లో దూకుడు చాలా పెరిగింది. స్వయంగా కిమ్ జోంగ్ ఉన్ యురేనియం ఎన్రిచ్మెంట్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి పనులను పర్యవేక్షించారు. ఆ తర్వాత కీలకమైన మిసైల్ తయారీ కేంద్రానికి వెళ్లిన ఆయన, రాబోయే ఐదేళ్లలో క్షిపణుల ఉత్పత్తిని ఏకంగా రెండున్నర రెట్లు పెంచాలని అక్కడి అధికారులను ఆదేశించారు. శాంతి చర్చలు, అణ్వాయుధాల నిర్మూలన లాంటి ప్రతిపాదనలను పక్కనబెట్టి, అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచుకోవడమే ఏకైక లక్ష్యంగా కిమ్ సర్కార్ ముందుకు సాగుతోంది.
ఉత్తర కొరియా అధికార వర్గాల్లో కిమ్ జోంగ్ ఉన్ తర్వాత అత్యంత పవర్‌ఫుల్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలను వదులుకోవాలంటూ అమెరికా, పశ్చిమ దేశాలు చేస్తున్న డిమాండ్లను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. తమ దేశం ఇప్పటికే ఒక శాశ్వత అణుశక్తిగా అవతరించిందని, ఈ హోదాను ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. ఇకపై అణ్వాయుధాల నిర్మూలన అనే అంశంపై చర్చల ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
భూమిపైనే కాకుండా సముద్ర మార్గంలో కూడా ఉత్తర కొరియా తన సైనిక పటిష్టతను పెంచుకుంటోంది. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు-ఎ తో కలిసి సరికొత్త కాంగ్ కోన్ డిస్ట్రాయర్ యుద్ధనౌకను సందర్శించారు. అక్కడ యుద్ధనౌక కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించడంతో పాటు, సముద్రంలో జరిగే పరీక్షలను, ఆయుధ వ్యవస్థల పనితీరును దగ్గరుండి సమీక్షించారు. సైన్యాన్ని అన్ని రకాలుగా ఆధునీకరించడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు కొరియా మీడియా వెల్లడించింది.
అయితే, ఉత్తర కొరియా ఇంత సడన్‌గా అణు ప్రదర్శన చేయడం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. 2019 తర్వాత మొదటిసారిగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ త్వరలోనే ఉత్తర కొరియా రాజధానిలో పర్యటించనున్నారు. చైనా తమకు అతిపెద్ద ఆర్థిక, రాజకీయ భాగస్వామి అయినప్పటికీ.. తమ అణు విధానంలో ఎవరి జోక్యాన్ని సహించబోమని, తాము ఎవరికీ లొంగి ఉండే ప్రసక్తే లేదని చైనాకు కూడా ముందస్తుగా ఒక సిగ్నల్ ఇవ్వడానికే కిమ్ ఈ పర్యటనలు, ప్రకటనలు చేశారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒకప్పుడు అంటే 2018, 2019 కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య చారిత్రాత్మక చర్చలు జరిగాయి. ఆ సమయంలో ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాలను నియంత్రించుకుంటుందని ప్రపంచం ఆశించింది. కానీ ఆ చర్చలు మధ్యలోనే ఆగిపోయి, ఒప్పందాలు కుదరలేదు. ఇప్పుడు కిమ్ సోదరి చేసిన తాజా ప్రకటనతో డెన్యూక్లియరైజేషన్ అనే అధ్యాయం పూర్తిగా ముగిసిపోయిందని, ఉత్తర కొరియా ఇకపై ప్రపంచంతో తన సొంత నిబంధనల ప్రకారమే వ్యవహరించనుందని స్పష్టమవుతోంది.




