Russia Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధానికి నార్త్ కొరియా సై...రష్యాలోకి ఎంట్రీ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోకి ఉత్తర కొరియా మరిన్ని సైనికులను పంపే అవకాశం ఉందా? ఇప్పటికే జరిగిన భారీ ప్రాణనష్టం, కిమ్ వ్యూహం, రష్యాతో సైనిక ఒప్పందాల గురించి తెలుసుకుందాం.
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోకి ఉత్తర కొరియా సైనికులు మరోసారి భారీగా అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రష్యా తరఫున పోరాడిన ఉత్తర కొరియా బలగాలు భారీగా ప్రాణనష్టం చవిచూశాయి. అయినప్పటికీ మరిన్ని సైనికులను పంపేందుకు ప్యాంగ్యాంగ్ సిద్ధమవుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ చేసిన హెచ్చరికలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. గతంలో అంచనా వేసిన 30 వేల మందికి బదులుగా ఇప్పుడు 50 వేల వరకు ఉత్తర కొరియా సైనికులు రష్యాకు చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే భారీగా ప్రాణనష్టం
2024 చివర్లో రష్యాలోని కుర్స్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ దళాలు దాడి చేసిన సమయంలో వాటిని ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా సైనికులను రష్యా తరఫున రంగంలోకి దించారు. మొత్తం 13 వేల మంది వరకు పంపినట్లు అంచనాలు ఉండగా.. వారిలో సుమారు 3 వేల మంది యుద్ధంలో మరణించినట్లు ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రారంభంలో భారీ నష్టాలను చవిచూసినప్పటికీ, క్రమంగా ఆధునిక డ్రోన్ యుద్ధ పద్ధతులకు అలవాటు పడిన ఉత్తర కొరియా దళాలు రష్యా సైన్యంతో కలిసి కుర్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ బలగాలను వెనక్కి నెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే ప్రస్తుతం కుర్స్క్‌లో ఉన్న ఉత్తర కొరియా సైనికుల పరిస్థితి ఏమిటన్నది మరో ప్రశ్న. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగం HUR ప్రకారం సుమారు 8,500 మంది ఉత్తర కొరియా సైనికులు ఇంకా రష్యా భూభాగంలోనే ఉన్నారు. వీరిని నాలుగు బ్రిగేడ్లుగా విభజించి, కుర్స్క్ ప్రాంతంలోని రష్యా సరిహద్దును కాపాడే బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం వారు చురుకైన యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు ఆధారాలు లేవని HUR పేర్కొంది.
కిమ్‌కు ఇదే తొలి పెద్ద విదేశీ యుద్ధ ప్రయోగం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు ఇది అత్యంత కీలకమైన సైనిక ప్రయోగంగా మారింది. విదేశీ గడ్డపై ఇంత పెద్ద సంఖ్యలో ఉత్తర కొరియా సైనిక బలగాలను పంపడం ఆ దేశ చరిత్రలో అరుదైన విషయం. 1973లో ఇజ్రాయెల్-ఈజిప్ట్ యుద్ధ సమయంలో సుమారు 1,500 మంది సైనికులు, శిక్షకులను ఈజిప్ట్‌కు పంపిన ఉత్తర కొరియా.. 1960ల చివర్లో వియత్నాం యుద్ధంలో అమెరికాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సుమారు 87 మంది పైలట్లను పంపినట్లు రికార్డులు ఉన్నాయి. అయితే కుర్స్క్‌కు పంపిన బలగాల పరిమాణం వాటన్నింటికంటే చాలా ఎక్కువ. ఈ అనుభవం ఉత్తర కొరియాకు ఒకరకంగా సైనిక శిక్షణగా మారింది. ముఖ్యంగా డ్రోన్లు, ఆధునిక నిఘా వ్యవస్థలు, వేగంగా మారుతున్న యుద్ధ వ్యూహాలను ప్రత్యక్షంగా ఎదుర్కొనే అవకాశం ఆ దేశ సైనికులకు లభించింది. ప్రారంభంలో భారీ నష్టాలు ఎదురైనా.. యుద్ధ అనుభవంతో వారి వ్యూహాల్లో మార్పులు వచ్చినట్లు నిపుణుల విశ్లేషణ.
ఆర్థిక ప్రయోజనమే అసలు కారణమా?
ఉత్తర కొరియా ఇంత భారీ ప్రమాదాన్ని ఎందుకు స్వీకరిస్తోందన్న ప్రశ్నకు ఆర్థిక ప్రయోజనం ఒక ప్రధాన సమాధానంగా కనిపిస్తోంది. రష్యాకు ఆయుధాల సరఫరా, సైనికుల పంపిణీ ద్వారా ఉత్తర కొరియాకు దాదాపు 10 బిలియన్ డాలర్ల వరకు ఆదాయం వచ్చి ఉండొచ్చని దక్షిణ కొరియా పరిశోధకుల అంచనా. ఉత్తర కొరియా వార్షిక జీడీపీ సుమారు 30 బిలియన్ డాలర్లుగా ఉన్న నేపథ్యంలో ఇది చాలా పెద్ద మొత్తం. అంటే రెండున్నరేళ్ల వ్యవధిలో ఒక ఏడాది జీడీపీలో దాదాపు మూడో వంతుకు సమానమైన ఆదాయం ఈ సహకారం ద్వారా వచ్చినట్లవుతుంది. దీనికి ప్రతిగా ప్యాంగ్యాంగ్‌కు ఆహారం, చమురు, విదేశీ కరెన్సీతో పాటు సైనిక సహకారం కూడా లభిస్తోంది. ముఖ్యంగా చైనాపైనే ఆధారపడిన ఉత్తర కొరియాకు రష్యాతో సంబంధాలు కొత్త వ్యూహాత్మక మార్గాన్ని తెరిచాయి. కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు చైనా, రష్యా రెండింటితోనూ సంబంధాలను ఉపయోగించుకునే స్థితికి చేరుకున్నారు. ఇది తూర్పు ఆసియా రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పుగా నిపుణులు భావిస్తున్నారు.
సైనికులకు యుద్ధం.. కిమ్‌కు వ్యూహాత్మక లాభం
కుర్స్క్ యుద్ధంలో ఉత్తర కొరియా సైనికుల పోరాటం మాత్రం తీవ్రమైనది. కొన్ని సందర్భాల్లో పెద్ద సంఖ్యలో సైనికులు వరుసగా దాడులకు పంపబడ్డారని ఉక్రెయిన్ సైనికులు చెబుతున్నారు. కమ్యూనికేషన్‌లో సమస్యలు, తగిన రక్షణ సామగ్రి కొరత కూడా కనిపించిందని వారి వాదన. హెల్మెట్లు, బాడీ ఆర్మర్, చలికాల దుస్తులు వంటి పరికరాలు కూడా కొంతమంది సైనికుల వద్ద తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఉత్తర కొరియా అధికారికంగా మరణాల సంఖ్యను వెల్లడించకపోయినా.. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం సుమారు 3 వేల మంది మరణించగా, మరో 1,500 మంది గాయపడ్డారు. మరో విశ్లేషణలో స్మారక ప్రదేశంలోని వివరాల ఆధారంగా సుమారు 2,300 మంది మరణించినట్లు అంచనా వేశారు.
రష్యాకు కూడా ఉత్తర కొరియా అవసరమే
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఉంది. రష్యాకు ప్రస్తుతం సైనికుల కొరత తీవ్రంగా ఉంది. యుద్ధం ప్రారంభమై నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్న సమయంలో.. ప్రతి నెలా కొత్తగా నియమించుకోగల సైనికుల కంటే సుమారు 6 వేల మంది ఎక్కువగా నష్టపోతున్నట్లు పాశ్చాత్య, ఉక్రెయిన్ నిఘా సంస్థల అంచనాలు చెబుతున్నాయి. అందుకే రష్యా కొలంబియా, కెన్యా, కామెరూన్ వంటి దేశాల నుంచి వచ్చిన విదేశీ యోధులతో పాటు ఉత్తర కొరియా సైనికులపైనా ఆధారపడుతోంది. అందుకే రష్యా-ఉత్తర కొరియా సంబంధం కేవలం తాత్కాలిక సైనిక ఒప్పందంగా కనిపించడం లేదు. ఒకవైపు రష్యాకు అవసరమైన మానవ వనరులు లభిస్తున్నాయి. మరోవైపు ఉత్తర కొరియాకు డబ్బు, ఇంధనం, ఆయుధ సాంకేతికత, ఆధునిక యుద్ధ అనుభవం దక్కుతున్నాయి.
ఇక ఉత్తర కొరియా కొత్త బలగాలను పంపితే.. ఈ భాగస్వామ్యం మరింత లోతుగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో వారు ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల్లో నేరుగా యుద్ధంలో పాల్గొంటే దక్షిణ కొరియాపై కూడా ఒత్తిడి పెరగొచ్చు. అందుకే ఉత్తర కొరియా సైనికుల కొత్త ప్రవేశం కేవలం రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికే సంబంధించిన విషయం కాదు.. ఆసియా భద్రతా సమీకరణాలపై కూడా ప్రభావం చూపించే పరిణామంగా మారుతోంది.




