North Korea: ఉత్తర కొరియా మరో సంచలనం.. సబ్మెరైన్ నుంచి పవర్ ఫుల్ క్రూయిజ్ క్షిపణుల ప్రయోగం
North Korea: ఉత్తర కొరియా మరోసారి సంచలన ప్రయోగానికి తెరలేపింది. సబ్మెరైన్ల ద్వారా ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది.
North Korea
North Korea: అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా తన సైనిక శక్తిని మరింత పెంచుకునే పనిలో పడింది. తాజాగా ఆ దేశం సబ్మెరైన్ల (జలాంతర్గాములు) ద్వారా ప్రయోగించగల ప్రత్యేక క్రూయిజ్ క్షిపణుల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. దేశ తూర్పు సముద్ర తీర ప్రాంతంలో బుధవారం ఈ పరీక్షలు జరిగాయని ఆ దేశ ప్రభుత్వ మీడియా స్పష్టం చేసింది. ఈ సరికొత్త ఆయుధాలు అణు వార్హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని సమాచారం. ఈ పరిణామంతో కొరియా ద్వీపకల్పంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అండర్వాటర్ కాంబాట్ సిస్టమ్ పరీక్షే ప్రధాన లక్ష్యం
ఈ క్షిపణి ప్రయోగాల ద్వారా దేశం అండర్వాటర్ కాంబాట్ సిస్టమ్ సామర్థ్యాన్ని, సన్నద్ధతను పరీక్షించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. నావికాదళం వ్యూహాత్మక మిషన్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు, అణు నిరోధక శక్తి విశ్వసనీయతను చాటిచెప్పేందుకు ఈ ప్రయోగం దోహదపడిందని పేర్కొంది. అయితే క్షిపణులను నిజమైన సబ్మెరైన్ నుంచి ప్రయోగించారా లేక నీటి అడుగున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లాట్ఫాం నుంచి పరీక్షించారా అనే విషయంపై స్పష్టత రాలేదు. సెప్టెంబర్ 20, అక్టోబర్ 3 తేదీల్లోనూ హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్లను పరీక్షించిన ఉత్తర కొరియా, వరుసగా ఆయుధ ప్రదర్శనలతో పొరుగు దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.
దక్షిణ కొరియాను శత్రువుగా ప్రకటిస్తూ దూకుడు
అమెరికా అలాగే దక్షిణ కొరియాతో దౌత్యపరమైన చర్చలకు ఎప్పుడో స్వస్తి పలికిన కిమ్ జోంగ్ ఉన్ సర్కార్, పొరుగు దేశాన్ని తన పక్కా శత్రువుగా ప్రకటించింది. ఇటీవల కాలంలో వరుసగా లైవ్-ఫైర్ డ్రిల్స్ నిర్వహించడంతో పాటు కొత్త యుద్ధనౌకలను సైతం సైన్యంలోకి చేర్చుకున్నారు. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా చేస్తున్న శాంతి ప్రయత్నాలు లేదా చర్చల ప్రతిపాదనలను కిమ్ పూర్తిగా తిరస్కరించారు. అమెరికా తన శత్రుపూరిత విధానాన్ని మార్చుకోవాలని, ఉత్తర కొరియా అణు ఆయుధాలను వదులుకోవాలనే షరతును ఎత్తివేయాలని ఆ దేశం డిమాండ్ చేస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ చర్చల ఆఫర్కు నో
గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన చర్చలు 2019లో ఎలాంటి ఫలితం లేకుండా నిలిచిపోయిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ చర్చలు పునఃప్రారంభించాలని చేసిన అభ్యర్థనలను కిమ్ జోంగ్ ఉన్ తేలికగా కొట్టిపారేశారు. వాషింగ్టన్ అనుసరిస్తున్న కఠిన వైఖరిలో మార్పు వచ్చే వరకు ఎలాంటి చర్చలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. దక్షిణ కొరియా, జపాన్ దేశాల క్షిపణి రక్షణ వ్యవస్థలను సులభంగా ఛేదించగల ఆయుధాలను సమకూర్చుకోవడమే లక్ష్యంగా ఉత్తర కొరియా ముందుకు సాగుతోంది.




