ఎన్విడియా బాస్‌కు చైనా గూఢచారి గాలం? వెలుగులోకి కీలక విషయాలు
ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ ఇప్పుడు పెను వివాదం నెలకొంది. ఏకంగా 4.5 ట్రిలియన్ డాలర్ల విలువైన కంపెనీ
Nvidia CEO Jensen Huang
ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ ఇప్పుడు పెను వివాదం నెలకొంది. ఏకంగా 4.5 ట్రిలియన్ డాలర్ల విలువైన కంపెనీ అధినేత వ్యక్తిగత జీవితం, చైనా గూఢచర్య ఆరోపణలతో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. చైనాకు చెందిన ఆలిస్ హువాంగ్ అనే మహిళతో జెన్సన్‌కు వివాహేతర సంబంధం ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఆమె చైనా గూఢచార సంస్థ కోసం పనిచేసినట్లు ఆరోపణలు రావడం ఈ వ్యవహారాన్ని మరింత సంచలనంగా మార్చింది.
బార్‌లో మొదలైన పరిచయం
ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. 2024 జూన్‌లో తైవాన్‌లోని ఓ బార్‌లో జెన్సన్ హువాంగ్ పక్కన ఆలిస్ హువాంగ్ కనిపించారు. అక్కడ గిగాబైట్, నెట్‌థండర్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉన్నారు. ఆ సమయంలోనే ఆలిస్‌కు సంబంధం ఉన్న మెగాస్పీడ్ సంస్థ ఎన్విడియా నుంచి భారీగా ఏఐ చిప్స్ కొనుగోలు చేయడం ప్రారంభించింది. వీరిద్దరి పరిచయం ఎప్పుడు మొదలైంది? సంబంధం ఎంతకాలం కొనసాగింది? అన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు.
చైనా గూఢచర్యం.. అసలు ట్విస్ట్
ఆలిస్ హువాంగ్ చైనా స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ కోసం పనిచేస్తూ జెన్సన్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. చైనాకు అత్యాధునిక ఏఐ చిప్స్ విక్రయించే విషయంలో ఎన్విడియా నిర్ణయాలను ప్రభావితం చేయాలని ప్రయత్నించినట్లు కథనాలు పేర్కొన్నాయి. గత రెండేళ్లలో మెగాస్పీడ్ ఏకంగా 4.8 బిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా చిప్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
ట్రంప్ సైతం ఎంట్రీ
ఈ వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. జెన్సన్ హువాంగ్‌ను తాను నమ్మదగిన వ్యక్తిగా భావిస్తానని, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
ఎన్విడియాలో కలకలం
ప్రపంచ ఏఐ రంగంలో కీలక శక్తిగా ఎదిగిన ఎన్విడియా అధినేత చుట్టూ ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఇప్పటికే కంపెనీ బోర్డు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆరోపణలపై పూర్తి స్థాయి నిర్ధారణ, దర్యాప్తు తుది ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. దీంతో జెన్సన్ హువాంగ్ వివాదం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.




