Nvidia China Spy Controversy: ఎన్వీడియా స్పై కలకలం...ట్రంప్ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి
ఎన్విడియా చిప్స్ చైనాకు చేరాయన్న ఆరోపణలపై అమెరికా డెమోక్రటిక్ సెనేటర్లు ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కీలక రికార్డులను భద్రపరచాలని, జాతీయ భద్రతపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Nvidia China Spy Controversy: అమెరికా తయారీకి చెందిన అత్యాధునిక ఏఐ చిప్స్ చైనాకు చేరుతున్నాయన్న అనుమానాలు ఇప్పుడు వాషింగ్టన్‌లో రాజకీయ, భద్రతాపరమైన చర్చకు దారితీశాయి. ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్వీడియా, దాని సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన వ్యవహారాలపై అమెరికా ప్రభుత్వాన్ని ఇద్దరు డెమోక్రటిక్ సెనేటర్లు వివరణ కోరారు. ఈ వ్యవహారంలో అధికారుల మధ్య జరిగిన సమాచార మార్పిడి, ఎగుమతి నియంత్రణల అమలు, జాతీయ భద్రతకు సంబంధించిన పత్రాలను భద్రపరచాలని వారు కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మెగాస్పీడ్ చుట్టూ అనుమానాలు
ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థ. 2024 జూన్ నుంచి ఈ కంపెనీ 4.8 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎన్వీడియా ఏఐ చిప్స్‌ను కొనుగోలు చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ చిప్స్‌లో కొంత భాగం అమెరికా ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించి చైనాకు తరలించారా అనే కోణంలో అమెరికా న్యాయశాఖ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు ఈ సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు తుది నిర్ధారణ వెలువడలేదు. మెగాస్పీడ్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆలిస్ హువాంగ్ అనే మహిళ పేరు కూడా ఈ వ్యవహారంలో ప్రస్తావనకు వచ్చింది. ఆమెకు చైనా నిఘా వ్యవస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలను అమెరికా భద్రతా వర్గాలు పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో ఆమెకు వ్యక్తిగత సంబంధం ఉందన్న కథనాలు ఈ వివాదాన్ని మరింత విస్తరించాయి. అయితే ఆమెపై వచ్చిన ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. మరోవైపు, మెగాస్పీడ్‌పై వాణిజ్య శాఖ చేపట్టిన దర్యాప్తులో ఎన్వీడియా ప్రతినిధులతో సంప్రదింపుల తర్వాత మార్పులు జరిగాయన్న నివేదికలు కూడా సెనేటర్ల దృష్టికి వచ్చాయి. ఈ పరిణామాలపై ప్రభుత్వ అధికారులు ఏం తెలుసుకున్నారు? దర్యాప్తు సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? అనే అంశాలకు సంబంధించిన ఆధారాలను వారు కోరుతున్నారు.
నవంబర్ 17లోగా సమాధానం కోరిన సెనేటర్లు
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్, వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్‌కు నవంబర్ 11న పంపిన లేఖలో కీలక పత్రాలు, ఈమెయిల్స్, అధికారిక సంభాషణలను భద్రపరచాలని వారెన్, కూన్స్ కోరారు. నవంబర్ 17లోగా దీనిపై లిఖితపూర్వక ధ్రువీకరణ ఇవ్వాలని, జాతీయ భద్రతకు ఎదురైన ముప్పుపై కాంగ్రెస్‌కు వివరించాలని విజ్ఞప్తి చేశారు.
అమెరికా ఎగుమతి విధానానికి పరీక్ష
అత్యాధునిక ఏఐ చిప్స్ కేవలం వ్యాపార ఉత్పత్తులు మాత్రమే కాదు. సైనిక పరిశోధన, సైబర్ భద్రత, నిఘా వ్యవస్థలు, సాంకేతిక పోటీలోనూ వీటికి కీలక పాత్ర ఉంది. అందుకే చైనాకు వీటి సరఫరాపై అమెరికా ఆంక్షలు విధిస్తోంది. అయితే ఇతర దేశాల కంపెనీల ద్వారా లేదా విదేశాల్లోని డేటా సెంటర్ల ద్వారా చైనా సంస్థలు ఈ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పొందే అవకాశాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఎన్వీడియా తప్పు చేసిందా లేదా అన్నదానికే పరిమితం కావడం లేదు. ఎగుమతి నియంత్రణలను అమలు చేయాల్సిన ప్రభుత్వ విభాగాలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాయా? భద్రతాపరమైన హెచ్చరికలు వచ్చినప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకున్నారా? అన్నది కీలకంగా మారింది. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే అమెరికా ఏఐ చిప్ ఎగుమతి విధానంపై తదుపరి చర్చను ప్రభావితం చేయనున్నాయి.




