UNHCR: ప్రపంచానికి వలస భయంః ప్రతీ 70 మందిలో ఒకరు... యుద్ధాలు, ఘర్షణలే కారణం

ప్రపంచానికి సరికొత్త భయం పట్టుకున్నది. 1951లో శరణార్థుల సంఖ్య 21 లక్షలు ఉండగా...ఇప్పుడు ఆ సంఖ్య 11.8 కోట్లకు చేరింది. ప్రపంచంలో ప్రతి 70 మందిలో ఒకరు నిరాశ్రయులైనట్టుగా గణాంకాలు చెబతున్నాయి.

Balachander
Published on: 11 Jun 2026 11:34 AM IST
UNHCR: ప్రపంచానికి వలస భయంః ప్రతీ 70 మందిలో ఒకరు... యుద్ధాలు, ఘర్షణలే కారణం
X

UNHCR: ప్రపంచానికి యుద్ధభయం పట్టుకున్నది. కొన్ని దేశాల్లో భీకరస్థాయిలో యుద్ధాలు జరుగుతుంటే మరికొన్ని దేశాల్లో అంతర్గత పోరాటాల భయం వెంటాడుతోంది. ఈ భయంతో సొంత ప్రాంతాలను వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనిపై ఐక్యారాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్‌ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి 70 మందిలో ఒకరు అంటే ఏకంగా 11.78 కోట్ల మంది తమ ఇళ్లను, సొంత ప్రాంతాలను బలవంతంగా వదిలి వలస వెళ్లాల్సి వచ్చింది. ఈ రిపోర్ట్‌ ప్రపంచాన్ని కలవరపెడుతున్నది. ఇలాంటి యుద్ధాలు, ఘర్షణలు ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో వలసల తీవ్రత మరింతగా ఉంటుందని హెచ్చరించింది.

సరికొత్త సంక్షోభాలు

గత పదేళ్లలో మొదటిసారిగా 2025లో వలసల సంఖ్య స్వల్పంగా నాలుగు శాతం తగ్గినప్పటికీ, ఇటీవలే ప్రారంభమైన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం వల్ల లెబనాన్, ఇరాన్ దేశాలలో సరికొత్త సంక్షోభం తలెత్తింది. ఈ దాడుల వల్ల లెబనాన్‌లో 10 లక్షల మందికి పైగా, ఇరాన్‌లో 32 లక్షల మంది అంతర్గతంగా నిర్వాసితులయ్యారు. సుమారు 6.86 కోట్ల మంది తమ దేశాల్లోనే సరిహద్దులు దాటలేక అంతర్గతంగా నలిగిపోతున్నారు. ఇక 2.85కోట్ల మంది యూఎన్‌హెచ్‌ఆర్‌ పరిధిలో శరణార్థులుగా కాలం వెల్లబుచ్చుతున్నారు. 90 లక్షల మంది వివిధ దేశాల్లో ఆశ్రయం కోసం ధరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇక 60 లక్షల మంది పాలస్తీనా శరణార్థులుగా మిగిలిపోయారు. ఈ గణాంకాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి.

శరణార్థులు ఎక్కడి నుండి వస్తున్నారు? ఎటు వెళ్తున్నారు?

ప్రపంచ శరణార్థులలో దాదాపు 72 శాతం మంది కేవలం ఏడు దేశాల నుంచే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్నారు. ఇందులో వెనుజులా నుంచి 64 లక్షలు, పాలస్తీనా నుంచి 60 లక్షలు, ఉక్రెయిన్‌ నుంచి 52 లక్షలు, సిరియా నుంచి 42 లక్షలు, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి 37 లక్షల మంది ఉన్నారు. ఇక వీరికి ఆశ్రయం ఇస్తున్న దేశాల్లో కొలంబియా, జర్మనీ, టర్కీ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. శరణార్థులలో 65 శాతం మంది తమ పొరుగు దేశాలలోనే తలదాచుకుంటున్నారు.

1951లో ఐరాస శరణార్థుల ఒప్పందం జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేవలం 21 లక్షల మంది శరణార్థులు ఉండేవారు. కానీ 1980ల నాటి ఆఫ్ఘన్ యుద్ధం, 2003 ఇరాక్ దాడి, 2022 ఉక్రెయిన్ యుద్ధం, నేటి మిడిల్ ఈస్ట్ సంక్షోభాల వల్ల ఈ సంఖ్య 11 కోట్లు దాటిపోవడం ఆందోళనకరం. అయితే, ఇందులో ఒక ఆశ్చర్యకరమైన కోణం కూడా ఉంది. 2025లో చరిత్రలోనే అత్యధికంగా 1.47 కోట్ల మంది శరణార్థులు తిరిగి తమ సొంత గూటికి చేరుకున్నారు. ముఖ్యంగా కాంగో, సూడాన్, సిరియా దేశాలకు ప్రజలు తిరిగొచ్చారు. కానీ, వారు తిరిగి వెళ్లిన ప్రాంతాల్లో ఇంకా పూర్తిస్థాయిలో శాంతి భద్రతలు నెలకొనకపోవడం వల్ల వారి భవిష్యత్తు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story