Pakistan Vs Afghanistan : భూకంపం కాదు పాక్ బాంబుల మోత.. ఆఫ్ఘనిస్థాన్ మ్యాప్ నుంచి మాయం కాబోతోందా?

Pakistan Vs Afghanistan : పాకిస్థాన్ వాయుసేన ఆఫ్ఘనిస్థాన్‌పై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ గజబ్-లిల్-హక్‎లో భాగంగా 641 మంది తాలిబన్లను హతమార్చినట్లు పాక్ ప్రకటించింది. ఈ దాడుల్లో నలుగురు పౌరులు మరణించారు.

CR Reddy
Published on: 13 March 2026 10:53 AM IST
Pakistan Vs Afghanistan : భూకంపం కాదు పాక్ బాంబుల మోత.. ఆఫ్ఘనిస్థాన్ మ్యాప్ నుంచి మాయం కాబోతోందా?
X

Pakistan Vs Afghanistan : ప్రపంచం మొత్తం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వైపు చూస్తుంటే, అటు పొరుగునే ఉన్న పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య నెత్తుటి యుద్ధం ముదురుతోంది. తాజాగా పాకిస్థాన్ వాయుసేన ఆఫ్ఘనిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి బాంబుల వర్షం కురిపించింది. ఈ మెరుపు దాడుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా రాజధాని కాబూల్, కందహార్, పక్టికా, పక్టియా వంటి ప్రధాన నగరాల్లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ విమానాలు దాడులు చేయడంతో సామాన్య జనం విలవిలలాడుతున్నారు.

పాకిస్థాన్ చేపట్టిన ఈ సైనిక చర్యలో కేవలం ఉగ్రవాద స్థావరాలే కాకుండా, సామాన్యుల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. కందహార్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని కామ్ ఎయిర్ సంస్థకు చెందిన ఇంధన డిపోపై పాక్ సైన్యం క్షిపణులతో విరుచుకుపడింది. ఈ డిపో పౌర విమానాలతో పాటు ఐక్యరాజ్యసమితి విమానాలకు కూడా ఇంధనాన్ని సరఫరా చేసేది. ఈ దాడితో ఆఫ్ఘనిస్థాన్‌లో మానవీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

నిజానికి గత కొన్నాళ్లుగా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అక్టోబర్‌లో పాక్ చేసిన దాడులకు ప్రతికారంగా, గత నెలలో ఆఫ్ఘన్ దళాలు 2,611 కిలోమీటర్ల సరిహద్దు పొడవునా 53 చోట్ల పాకిస్థాన్ పై విరుచుకుపడ్డాయి. దీనికి బదులుగా పాక్ ఫిబ్రవరి 26న ఆపరేషన్ గజబ్-లిల్-హక్ (Operation Gazab-lil-Haq) పేరుతో భారీ సైనిక చర్యకు దిగింది. ఈ ఆపరేషన్ లో ఇప్పటివరకు 641 మంది ఆఫ్ఘన్ తాలిబన్ ఉగ్రవాదులను హతమార్చామని, మరో 855 మందిని గాయపరిచామని పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ ప్రకటించారు.

పాక్ సైన్యం కేవలం గాలిలోనే కాదు, భూమిపైన కూడా విధ్వంసం సృష్టించింది. ఇప్పటివరకు 243 ఆఫ్ఘన్ సరిహద్దు పోస్టులను నేలమట్టం చేయడమే కాకుండా, 219 ట్యాంకులు, ఇతర సాయుధ వాహనాలను ధ్వంసం చేసింది. సుమారు 65 చోట్ల అత్యంత ఖచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులు జరిగాయని పాక్ ప్రభుత్వం పేర్కొంది. తాలిబన్లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని పాక్ ఆరోపిస్తుంటే, తమ దేశ సార్వభౌమాధికారాన్ని పాక్ దెబ్బతీస్తోందని ఆఫ్ఘనిస్థాన్ మండిపడుతోంది. మొత్తానికి ఈ రెండు పొరుగు దేశాల మధ్య సాగుతున్న పోరు ఆసియా ఖండంలో పెను కలకలం రేపుతోంది.

CR Reddy

CR Reddy

Next Story