Bangladesh: బంగ్లాదేశ్ జైళ్లలో మగ్గుతున్న విదేశీ ఖైదీలు.. సగానికి పైగా మనవాళ్లే!
Bangladesh: బంగ్లాదేశ్ జైళ్లలో 238 మంది భారతీయులు మగ్గుతున్నారు. వీరిలో 168 మంది శిక్ష పూర్తయినా జాతీయత నిర్ధారణలో జాప్యం వల్ల స్వదేశానికి రాలేకపోతున్నట్లు భారత హైకమిషన్ తెలిపింది.
Bangladesh: బంగ్లాదేశ్ జైళ్లలో మగ్గుతున్న విదేశీ ఖైదీలు.. సగానికి పైగా మనవాళ్లే!
Bangladesh: బంగ్లాదేశ్‌లోని వివిధ జైళ్లలో మగ్గుతున్న విదేశీ ఖైదీలలో సగానికి పైగా భారతీయులే ఉన్నట్లు అక్కడి స్థానిక మీడియా కథనాలు వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్, గోల్డ్ స్మగ్లింగ్ వంటి పలు నేర ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు చెందిన కనీసం 407 మంది విదేశీయులు బంగ్లాదేశ్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ విదేశీ ఖైదీలలో అత్యధికంగా 238 మంది భారతీయులే ఉండటం గమనార్హం.
బంగ్లాదేశ్ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీలలో దాదాపు 168 మంది శిక్షాకాలం ఇప్పటికే ముగిసింది. అయితే, సాంకేతిక కారణాలు మరియు దౌత్యపరమైన ప్రక్రియలు పూర్తి కాకపోవడంతో వారు ఇంకా నిర్బంధంలోనే కాలం వెళ్లదీస్తున్నారు. భారతీయులతో పాటు మయన్మార్, నైజీరియా, పాకిస్థాన్, మలేషియా దేశాలకు చెందిన ఖైదీలు కూడా బంగ్లా జైళ్లలో ఉన్నారు.
శిక్షాకాలం ముగిసిన భారతీయ ఖైదీల అధికారిక జాబితాలను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమకు పంపిందని భారత హైకమిషన్ (High Commission of India) అధికారి వెల్లడించారు. అయితే, ఆ ఖైదీలు నిజంగా భారతీయులేనా అనే విషయాన్ని (Nationality Verification) ధ్రువీకరించుకోవడంలో కొన్ని పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, అందుకే వారి విడుదలలో జాప్యం జరుగుతోందని తెలిపారు.
ఖైదీలను నేరుగా కలిసి మాట్లాడేందుకు, వారి వివరాలను సేకరించేందుకు బంగ్లాదేశ్ అధికారుల అనుమతి కోరినట్లు హైకమిషన్ పేర్కొంది. ప్రస్తుతం బంగ్లా విదేశాంగ శాఖ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, ఖైదీల జాతీయతను త్వరలోనే నిర్ధారించి వారిని స్వదేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.




