Pakistan Bus Accident: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు.. 40 మంది ప్రయాణికులు దుర్మరణం!

Pakistan Bus Accident: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 40 మంది దుర్మరణం పాలయ్యారు.

Arun Chilukuri
Published on: 3 July 2026 2:04 PM IST
Pakistan Bus Accident
X

Pakistan Bus Accident: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు.. 40 మంది ప్రయాణికులు దుర్మరణం!

Pakistan Bus Accident: పాకిస్థాన్‌లో అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఏకంగా 40 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో అత్యధికంగా మహిళలు, చిన్న పిల్లలే ఉండటం స్థానికంగా తీవ్ర కలచివేస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

బలోచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో క్వెట్టా నగరం నుండి రాజధాని ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున బలోచిస్థాన్ - ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల సరిహద్దు ప్రాంతమైన దారాసర్‌కు చేరుకోగానే.. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు శరవేగంతో పక్కనే ఉన్న ఒక లోతైన లోయలోకి దూసుకెళ్లిపోయింది. కొండరాళ్ల మధ్య బస్సు పడిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్రంగా నలిగిపోయారు.

ఈ ఘోర ప్రమాదానికి గల ప్రధాన కారణాన్ని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. క్వెట్టా నుండి ఇస్లామాబాద్‌కు ఈ బస్సు వెళ్తున్న మార్గమధ్యంలో.. అదే రూట్‌లో వెళ్తున్న మరో బస్సు హఠాత్తుగా బ్రేక్‌డౌన్ (పాడైపోయింది) అయ్యింది. దీంతో ఆ పాడైపోయిన బస్సులోని ప్రయాణికులను కూడా మానవతా దృక్పథంతో కాకుండా, అదనపు సంపాదన కోసం ఈ బస్సు డ్రైవర్, కండక్టర్లు తమ బస్సులోనే ఎక్కించుకున్నారు.

దీనివల్ల బస్సు తన పూర్తి సామర్థ్యానికి మించి (Overloaded) విపరీతమైన రద్దీతో ప్రయాణించాల్సి వచ్చింది. దారాసర్ కొండల మలుపుల వద్దకు వచ్చేసరికి బస్సు బరువు ఎక్కువై, అదుపుతప్పి లోయలోకి పడిపోయిందని షాహిద్ రింద్ స్పష్టం చేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు, పాక్ సైన్యం రంగంలోకి దిగాయి. లోయ చాలా లోతుగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కొండరాళ్లను బద్దలు కొట్టి బస్సు లోపల ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story