Pakistan Economic Crisis 2026: సౌదీ ఇచ్చినా.. యూఏఈ షాకిచ్చింది.. పాక్ ముందున్న అప్పుల సవాల్!

Pakistan Economic Crisis 2026: పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా నుంచి 2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం. యూఏఈకి 3.5 బిలియన్ డాలర్ల అప్పు తీర్చాల్సి రావడంతో పాక్ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి.

Arun Chilukuri
Published on: 16 April 2026 2:12 PM IST
Pakistan Economic Crisis 2026
X

Pakistan Economic Crisis 2026: సౌదీ ఇచ్చినా.. యూఏఈ షాకిచ్చింది.. పాక్ ముందున్న అప్పుల సవాల్!

Pakistan Economic Crisis 2026: పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. ఒక చేత్తో అప్పు తీసుకుంటూ.. మరో చేత్తో పాత బాకీలు తీరుస్తూ ‘దాయాది దేశం’ కత్తిమీద సాము చేస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం (యుద్ధ మేఘాలు) నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి మరింత పెరిగింది.

తీవ్ర విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరతతో ఉన్న పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా అండగా నిలిచింది.పాక్‌కు మొత్తం 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేసేందుకు సౌదీ అరేబియా సిద్ధమైంది. తొలి విడత ఇందులో భాగంగా తాజాగా 2 బిలియన్ డాలర్ల నిధులను సౌదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ పాకిస్థాన్‌కు బదిలీ చేసింది. ధ్రువీకరణ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ (SBP) ఈ నిధులు అందినట్లు అధికారికంగా వెల్లడించింది.

యూఏఈ ‘రిటర్న్’ షాక్!

సౌదీ నుంచి నిధులు వచ్చాయన్న సంతోషం పాకిస్థాన్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. గతంలో తాను ఇచ్చిన 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 32 వేల కోట్లు) రుణాన్ని తక్షణమే తిరిగి చెల్లించాలని యూఏఈ (UAE) పాక్‌ను డిమాండ్ చేసింది. సాధారణంగా ఇలాంటి రుణాలను యూఏఈ ప్రతి ఏడాది పొడిగిస్తూ (Rollover) వచ్చేది. కానీ, తాజా అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏప్రిల్ నెలాఖరులోగా మొత్తం సొమ్మును చెల్లించాలని కోరింది. ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, ‘జాతీయ గౌరవం’ కోసం ఆ అప్పును ఈ నెల 30 లోపు తిరిగి చెల్లిస్తామని పాక్ ప్రకటించింది.

షెహబాజ్ షరీఫ్ సౌదీ పర్యటన

ఈ గందరగోళ పరిస్థితుల మధ్య పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. బుధవారం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయి.. ద్వైపాక్షిక సంబంధాలు మరియు మరిన్ని పెట్టుబడులపై చర్చలు జరిపారు.ప్రస్తుతం పాక్ వద్ద సుమారు 16.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. తాజా చెల్లింపుల తర్వాత ఈ నిల్వలు భారీగా తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story