Pakistan Fuel Crisis: పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం.. ఇక ప్రతి రోజూ పెరగనున్న ధరలు

Pakistan Fuel Crisis: పాకిస్థాన్‌లో రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరల నిర్ణయంపై వివాదం చెలరేగింది. దీంతో పెట్రోల్ పంప్ అసోసియేషన్ బంకులు బంద్ చేసి సమ్మెకు దిగింది.

CR Reddy
Published on: 23 July 2026 6:37 AM IST
Pakistan Fuel Crisis
X

Pakistan Fuel Crisis

Pakistan Fuel Crisis: పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకు ప్రతి 7 లేదా 15 రోజులకు ఒకసారి మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను ఇకపై ప్రతిరోజూ మార్చాలని పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దీనివల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని ఆల్ పాకిస్తాన్ పెట్రోల్ పంప్ అసోసియేషన్ మండిపడింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆకస్మిక సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో పాకిస్థాన్‌లో ఇంధన కొరత ఏర్పడి, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోజువారీ ధరల నిర్ణయం

పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ప్రభుత్వం ఒక పెద్ద మార్పు చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ(OGRA) ఇకపై చమురు ధరలను వారానికి ఒకసారి కాకుండా రోజువారీ ప్రాతిపదికన నిర్ణయించి వెబ్‌సైట్‌లో ప్రచురించనుంది. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో మునుపెన్నడూ లేనివిధంగా చమురు ధరలు పెరుగుతున్నాయని పాక్ పెట్రోలియం మంత్రి వెల్లడించారు. పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

భగ్గుమన్న పెట్రోల్ పంపుల యజమానులు

ప్రభుత్వం తీసుకున్న ఈ రోజువారీ ధరల విధానాన్ని పాకిస్థాన్ పెట్రోల్ పంపుల అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ డిమాండ్లు, మార్జిన్ పెంపుపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బంట్లు నిరసనగా బంద్‌ను ప్రకటించాయి. ప్రభుత్వ సానుకూల నిర్ణయం వెలువడే వరకు తమ సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. దీంతో వాహనదారులు పెట్రోల్ కోసం బంట్ల చుట్టూ పరుగులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ వాదన, ప్రస్తుత రేట్లు

ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ సమాచార మంత్రి అత్తా తారార్ మాట్లాడుతూ.. గ్లోబల్ మార్కెట్‌లో ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనం వెంటనే ప్రజలకు అందాలనే ఉద్దేశంతోనే ఈ రోజువారీ విధానం తెచ్చామని తెలిపారు. అయితే, ప్రస్తుతం పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.320.73 ఉండగా, డీజిల్ ధర రూ.367.21కి చేరుకుంది. ఈ భారీ ధరల మధ్య రోజువారీ మార్పులు సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story