Pakistan Crisis: పాకిస్తాన్‌లో ఆంక్షలు.. కార్ల కొనుగోళ్లు, పెళ్లిళ్లు బంద్
Pakistan Crisis: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభం తలెత్తింది.
Pakistan Crisis
Pakistan Crisis: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఎర్ర సముద్రంలో కొనసాగుతున్న అలజడి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో దిగుమతి ఖర్చులు, ఇంధన వ్యయం, ప్రభుత్వ ఖర్చులను అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కీలకమైన పొదుపు చర్యలను ప్రకటించింది. గురువారం (సెప్టెంబర్ 17) కేబినెట్ డివిజన్ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం కొన్ని నిబంధనలు తక్షణమే అమల్లోకి రాగా, మరికొన్నింటిని రాబోయే మూడు నెలల పాటు కఠినంగా అమలు చేయనున్నారు.
కొత్త కార్ల కొనుగోలుపై నిషేధం
దేశంలో పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పాక్ ప్రభుత్వం నూతన వాహనాల కొనుగోళ్లపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కేవలం ఐటీ సంబంధిత కొనుగోళ్లు, కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ శాఖల అధికారిక వాహనాలకు వినియోగించే ఇంధనాన్ని ఏకంగా 50 శాతానికి కోత పెట్టారు. అయితే సాయుధ దళాలు, శాంతిభద్రతల పరిరక్షణ సంస్థలు, అత్యవసర సేవా వాహనాలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు. అలాగే ప్రభుత్వ నాన్-సాలరీ ఖర్చుల్లో ప్రతి నెల 5 శాతం కోత విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
విదేశీ పర్యటనలపై ఆంక్షలు
ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలపై మూడు నెలల పాటు నిషేధం విధించారు. మంత్రులు, సలహాదారులు, ఎంపీలు అత్యవసర పర్యటనలకు వెళ్లాల్సి వస్తే కేవలం ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించాలని స్పష్టం చేశారు. మరోవైపు సామాన్య ప్రజలను నేరుగా ప్రభావితం చేసేలా వివాహ వేడుకల్లో కేవలం ఒకే రకమైన వంటకాన్ని మాత్రమే వడ్డించాలని నిబంధన తెచ్చారు. అంతేకాకుండా విద్యుత్ ఆదా కోసం దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్, దుకాణాలు రాత్రి 9 గంటలకే మూసివేయాలని, మ్యారేజ్ హాల్స్ రాత్రి 10 గంటలకు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటలకు బంద్ చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.




