India - Pakistan: భారత గడ్డపై పాక్ అడుగు..'ఆపరేషన్ సిందూర్' తర్వాత తొలిసారి..!
India - Pakistan: నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ఎస్‌సీఓ 'సివిలైజేషనల్ డైలాగ్' సదస్సుకు పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ హాజరుకానున్నారు.
India - Pakistan: భారత గడ్డపై పాక్ అడుగు..'ఆపరేషన్ సిందూర్' తర్వాత తొలిసారి..!
Pakistan Minister Musadik Malik: అంతర్జాతీయ దౌత్య రంగంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణల అనంతరం పాకిస్థాన్‌కు చెందిన ఓ కీలక మంత్రి భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. న్యూఢిల్లీ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు పాకిస్థాన్ తన ప్రతినిధిగా ఫెడరల్ మంత్రి ముసాదిక్ మాలిక్‌ను పంపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో ఎస్‌సీఓ ఆధ్వర్యంలో 'సివిలైజేషనల్ డైలాగ్' సమావేశం జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరుకావాల్సిందిగా ఎస్‌సీఓ సభ్య దేశాలన్నింటికీ భారత్ అక్టోబర్ 28నే ఆహ్వానాలు పంపింది.
భారత్ ఆహ్వానం మేరకు తమ పర్యావరణ సమన్వయ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ ఈ సమావేశంలో పాల్గొంటారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఎస్‌సీఓ వేదికగా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, పరస్పర గౌరవాన్ని పెంపొందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పాక్ పేర్కొంది.
భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ మంత్రి హాజరవుతుండటం దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం గతేడాది జరిగిన పరిణామాలే. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా, మే 7న భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో గట్టి బదులిచ్చింది.
నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో సైనిక ఘర్షణ కొనసాగి మే 10న ముగిసింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల తర్వాత ఒక పాకిస్థాన్ మంత్రి అధికారికంగా భారత్‌కు రావడం ఇదే ప్రథమం.
బహుళపాక్షిక వేదికైన ఎస్‌సీఓ నిబంధనల ప్రకారం భారత్ అన్ని సభ్య దేశాలను ఆహ్వానించినప్పటికీ, ఉగ్రవాదంపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలపై రాజీపడే ప్రసక్తే లేదని, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడాన్ని అరికట్టడంలో ఎస్‌సీఓ దేశాలన్నీ ఏకతాటిపై నిలవాలని భారత్ నిలదీస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో పాక్ మంత్రి పర్యటన కేవలం సదస్సుకే పరిమితమవుతుందా, లేక దౌత్యపరంగా ఏవైనా కొత్త చర్చలకు దారితీస్తుందా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.




