Pakistan Petrol Price: పాక్‌లో పెట్రోల్ షాక్.. ప్రజల దెబ్బకు 80 రూపాయలు తగ్గించిన ప్రభుత్వం!

Pakistan Petrol Price: పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరల సెగ. ప్రజల ఆగ్రహంతో దిగివచ్చిన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. పెట్రోల్‌పై 80 రూపాయలు తగ్గిస్తూ అర్ధరాత్రి సంచలన నిర్ణయం. తాజా ధర లీటరుకు 378 పీకేఆర్.

Arun Chilukuri
Published on: 4 April 2026 10:24 AM IST
Pakistan Petrol Price
X

Pakistan Petrol Price: పాక్‌లో పెట్రోల్ షాక్.. ప్రజల దెబ్బకు 80 రూపాయలు తగ్గించిన ప్రభుత్వం!

Pakistan Petrol Price Cut: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు పొరుగు దేశం పాకిస్థాన్‌ను వణికిస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌లో ఇంధన ధరల పెంపు చిచ్చు రేపింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో, ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెనక్కి తగ్గక తప్పలేదు. రాత్రికి రాత్రే పెట్రోల్ ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వడ్డింపు.. ఆపై వెనక్కి:

పశ్చిమాసియా ఘర్షణల సాకుతో గురువారం పాక్ ప్రభుత్వం చమురు ధరలను భారీగా పెంచింది. పెట్రోల్‌పై ఏకంగా 43 శాతం, హైస్పీడ్ డీజిల్ (HSD)పై 55 శాతం భారాన్ని మోపింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 458 పీకేఆర్ (PKR) కు, డీజిల్ ధర 520 పీకేఆర్ కు చేరి సామాన్యుడి నడ్డి విరిచింది.

అర్ధరాత్రి ప్రకటన:

ధరల పెంపుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో శుక్రవారం అర్ధరాత్రి ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ ధరపై 80 పాకిస్థానీ రూపాయలను (PKR) తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్ ధర 378 పీకేఆర్ కు తగ్గింది. ఈ ధరలు కనీసం నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని హామీ ఇచ్చారు. డీజిల్‌పై విధిస్తున్న లెవీని కూడా ప్రభుత్వం తొలగించింది.

ప్రధాని వివరణ:

"పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరత వల్లే ధరలు పెంచాల్సి వచ్చింది. కానీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నాం. ధరలను నియంత్రణలో ఉంచేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది" అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story