Pakistan: పాకిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి దాడి.. 11 మంది దుర్మరణం, 30 మందికి గాయాలు!
Pakistan Suicide Attack: పాకిస్థాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉగ్ర దాడి. పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద వాహనం పేల్చివేతతో 11 మంది మృతి, 30 మందికి గాయాలు.
Pakistan: పాకిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి దాడి.. 11 మంది దుర్మరణం, 30 మందికి గాయాలు!
Pakistan Suicide Attack: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలో శనివారం దారుణ ఆత్మాహుతి దాడి జరిగింది. తీవ్ర పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు, పోలీసు చెక్‌పోస్టును లక్ష్యంగా చేసుకుని వాహనాన్ని పేల్చివేశాడు. ఈ తీవ్రమైన పేలుడు ధాటికి 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, అంబులెన్సులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు; గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణ ఘాతుకానికి తమదే బాధ్యత అని పాకిస్థానీ తాలిబన్‌గా పిలిచే తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) బహిరంగంగా ప్రకటించింది. పేలుడు తర్వాత ఘటనా స్థలం నుంచి భారీగా పొగ ఎగసిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు తీవ్ర స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా టీటీపీ (TTP) తో పాటు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి వేర్పాటువాద గ్రూపులు వరుస దాడులతో విరుచుకుపడుతున్నాయి. తాజా ఘటనతో దేశంలో మళ్లీ భద్రతా లోపాలు బయటపడటంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.




