Pakistan: మింగలేక కక్కలేక...అమెరికాకు ఎదురు చెప్పలేక...పాపం పాక్
ఇరాన్ ఒప్పందానికి చారిత్రక ‘అబ్రహం అకార్డ్స్ ను ముడిపెడుతూ, ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించుకోవాలని పాక్‌కు ట్రంప్ ఆహ్వానం పంపారు. దీంతో పాక్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకలా, మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైంది.
Pakistan: కాకలు తిరిగినవారికే అంతర్జాతీయ రాజకీయాల్లో నెగ్గుకురావడం కష్టం. అలాంటిది రాజకీయ, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయంగా తాము కూడా పెద్ద పెద్ద సమస్యలను తీరుస్తామని, మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పడం విడ్డూరమే కదా. సరిగ్గా ఇలానే ఇరుక్కుపోయింది పాకిస్తాన్. అంతర్జాతీయ రాజకీయాల్లో 'మేము కూడా పెద్దన్నలమే' అని నిరూపించుకోవాలని చూసిన పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పాక్‌ను, ట్రంప్ తన ఒక్క ప్రకటనతో డిఫెన్స్‌లో పడేశారు. ఇరాన్ ఒప్పందానికి చారిత్రక ‘అబ్రహం అకార్డ్స్ ను ముడిపెడుతూ, ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించుకోవాలని పాక్‌కు ట్రంప్ ఆహ్వానం పంపారు. దీంతో పాక్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకలా, మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైంది.
అబ్రహం అకార్డ్స్ మెలిక.. ట్రంప్ వ్యూహం ఏంటి?
పశ్చిమాసియాలో శాంతి, వాణిజ్య బంధాల కోసం 2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ‘అబ్రహం అకార్డ్స్’ రూపుదిద్దుకున్నాయి. ఇజ్రాయెల్‌ను గుర్తిస్తూ దౌత్య సంబంధాలు పెట్టుకోవడానికి అప్పట్లో యూఏఈ, బహ్రెయిన్, సూడాన్, మొరాకో వంటి దేశాలు సంతకాలు చేశాయి. ఇప్పుడు తాజాగా ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో చేసిన ఒక సుదీర్ఘ పోస్ట్‌తో సరికొత్త చర్చకు తెరలేపారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరాలంటే, ముస్లిం మెజార్టీ ఉన్న మరో ఆరు దేశాలు తక్షణమే అబ్రహం అకార్డ్స్‌పై సంతకం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్, జోర్డాన్ దేశాలు ఉన్నాయి. అయితే, సౌదీ అరేబియా, ఖతార్ మొదట సంతకాలు చేస్తే మిగిలిన దేశాలు వాటిని అనుసరించాలని ట్రంప్ స్పష్టం చేశారు.
షరీఫ్‌ను మరిచి మునీర్ పేరు.. పాక్‌కు ఘోర అవమానం!
ఈ ప్రతిపాదన ఒకెత్తయితే, ట్రంప్ తన పోస్ట్‌లో ఆయా దేశాధినేతల పేర్లను ప్రస్తావించిన విధానం పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాల ముందు తీవ్ర అవమానానికి గురిచేసింది. పాక్ అధికారిక ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పేరును పూర్తిగా పక్కనబెట్టేసిన ట్రంప్, ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పేరును నేరుగా ప్రస్తావించారు. పాక్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కేవలం రబ్బరు స్టాంప్ మాత్రమేనని, అక్కడ నడుస్తోంది సైనిక పాలనేనని ట్రంప్ తన పోస్ట్ ద్వారా ప్రపంచానికి బల్లగుద్ది మరీ చెప్పినట్లయింది. ఇరాన్‌తో దౌత్య సంబంధాలు పెంపొందించేందుకు పాకిస్తాన్ ముందు నుంచే ఆసక్తి చూపుతున్నది. అందులోనూ జనరల్ మునీర్ ముందుండి నడిపిస్తున్నాడు. ఇదే విషయాన్ని ట్రంప్ పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించారు కూడా. ఈ నేపథ్యంలో బహుశా పాక్ ప్రధాని పేరుకు బదులుగా మునీర్ పేరును ప్రస్తావించి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
పాక్ తిరస్కరణ.. ఎందుకీ భయం?
గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడుల కారణంగా ముస్లిం దేశాల్లో ఇజ్రాయెల్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. పాకిస్థాన్ కూడా ఇంతవరకు ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించలేదు. 2020లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడే అమెరికా ఈ ప్రతిపాదన తెచ్చినా ఆయన ఒప్పుకోలేదు, ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఒకవేళ ట్రంప్ మాట విని అబ్రహం అకార్డ్స్‌పై సంతకం చేస్తే, పాకిస్థాన్ సొంత దేశంలోనే తీవ్రమైన రాజకీయ, ఆర్థిక తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే "అబ్రహం అకార్డ్స్‌పై పాక్ సంతకం చేయదు.. అది మా ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధం" అని పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ అధికారికంగా ప్రకటించారు. ఇటు అమెరికాను కాదనలేక, అటు ఇజ్రాయెల్‌ను ఒప్పుకోలేక పాక్ పడుతున్న అవస్థలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారాయి.
అయితే, ఇప్పటి వరకు దౌత్య సంబంధాల విషయంలో పాకిస్తాన్‌ను వెనకేసుకుంటూ వచ్చిన ట్రంప్... ఈ విషయంలో పాకిస్తాన్‌పై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. యూఏఈ ఇప్పటికే ప్రాథమికంగా అంగీకరించి గతంలోనే సంతకం చేసింది. ఇరాన్ కూడా ఈ ఒప్పందంలో చేరితే బాగుంటుందని ట్రంప్ చెప్పడం విశేషం. కానీ, పాక్ పరిస్థితే అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఔనంటే దేశంలో...కాదంటే అంతర్జాతీయంగా విమర్శలు, నిందలు మోయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థికంగా పీకలలోతుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్‌కు ఇది మరోకదెబ్బ అనే చెప్పాలి. ఈ విషయంలో ఎలాంటి దౌత్యరాజకీయాలు చేస్తుందో చూడాలి.




