POK Drone Strikes: పీఓకేను గాజాతో పోలుస్తున్న పాకిస్థానీలు.. డ్రోన్ దాడులపై ఆగ్రహం

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో డ్రోన్ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రావలకోట్‌లో ఏడుగురు మృతి, 23 మందికి గాయాలైనట్లు నివేదికలు వెల్లడించాయి. పాక్ బలగాలను ఐడీఎఫ్‌తో పోలుస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Rudrachander
Published on: 6 Nov 2026 3:36 PM IST
POK Drone Strikes: పీఓకేను గాజాతో పోలుస్తున్న పాకిస్థానీలు.. డ్రోన్ దాడులపై ఆగ్రహం
X

POK Drone Strikes: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో నిరసనకారులపై భద్రతా బలగాలు చేపట్టిన చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రావలకోట్‌లో నవంబర్‌ 5న జరిగిన ఆపరేషన్‌లో కాల్పులు, డ్రోన్ల వినియోగం కారణంగా ఏడుగురు పౌరులు మరణించగా, మరో 23 మంది గాయపడినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇళ్లలో మంటలు చెలరేగిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. దీంతో పాకిస్థాన్‌ భద్రతా బలగాల తీరుపై ఆ దేశానికి చెందిన కొందరు పౌరులు, కశ్మీరీ కార్యకర్తలు సైతం విమర్శలు చేస్తున్నారు. పీఓకేలో పరిస్థితులను గాజాలోని దృశ్యాలతో పోలుస్తూ, పాక్‌ బలగాలు ఇజ్రాయెల్‌ సైన్యం తరహాలో వ్యవహరిస్తున్నాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

నిరసన శిబిరాల తొలగింపుతో మొదలైన ఘర్షణ

రావలకోట్‌లో నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు పాకిస్థాన్‌ రేంజర్స్‌, ఫ్రాంటియర్‌ కార్ప్స్‌ సిబ్బంది, స్థానిక పోలీసులు నవంబర్‌ 5న రంగంలోకి దిగారు. జమ్మూ కశ్మీర్‌ జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన శిబిరాలను తొలగించేందుకు ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని, నిరసన శిబిరాలు, నివాస ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు చేశాయని JAAC నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ కమిటీకి చెందిన నేత సర్దార్‌ ఉమర్‌ నజీర్‌.. దాడుల అనంతరం లభించినవిగా చెబుతున్న బాంబు శకలాలను వీడియోలో చూపించారు. అయితే, ఈ ఆరోపణలను స్వతంత్రంగా నిర్ధారించే ఆధారాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. మరోవైపు, నిరసనకారుల్లోని సాయుధ వ్యక్తులే తొలుత కాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్నారు.

ఐడీఎఫ్‌తో పాక్‌ బలగాల పోలిక

ఈ ఘటనపై పాకిస్థాన్‌లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇస్లామాబాద్‌కు చెందిన సీమా బాలి అనే కశ్మీరీ మహిళ.. గతంలో పాకిస్థాన్‌కు మద్దతుగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆ దేశ భద్రతా బలగాల చర్యలు తనను నిరాశపరిచాయని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. పాక్‌ బలగాలు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (IDF) తరహాలో వ్యవహరిస్తున్నాయని ఆమె విమర్శించారు. అబుదాబికి చెందిన కశ్మీరీ కార్యకర్త సోహైబ్‌ ఖాన్‌ కూడా రావలకోట్‌లో ఇళ్లు కాలిపోతున్న దృశ్యాలను గాజాలోని పరిస్థితులతో పోల్చారు. నిరసనకారులపై బలప్రయోగం చేయడం సమస్యకు పరిష్కారం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

38 డిమాండ్లతో ఉద్యమం

పీఓకేలో ఈ ఆందోళనలు జూన్‌ నుంచి కొనసాగుతున్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, స్థానిక వనరుల వినియోగంలో తమకు న్యాయం జరగడం లేదన్న ఆరోపణలు ఉద్యమానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం అసెంబ్లీలో కేటాయించిన 12 స్థానాలను కూడా JAAC వ్యతిరేకిస్తోంది. వాటి వల్ల స్థానిక రాజకీయాల్లో ఇస్లామాబాద్‌ జోక్యం పెరుగుతోందని ఆందోళనకారులు చెబుతున్నారు. కమిటీ ప్రతిపాదించిన 38 అంశాల డిమాండ్లలో తక్కువ ధరకు విద్యుత్‌, సబ్సిడీపై గోధుమలు, మెరుగైన వైద్యం, విద్య, ఉద్యోగాలు, రాజకీయ స్వయంప్రతిపత్తి ఉన్నాయి. జలవిద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ స్థానికులకు దాని ప్రయోజనాలు అందడం లేదని ప్రజలు వాదిస్తున్నారు. జూన్‌లో పాక్‌ ప్రభుత్వం JAACపై నిషేధం విధించడం, కార్యకర్తల అరెస్టులు కూడా ఆగ్రహాన్ని పెంచాయి. మృతుల సంఖ్యపై మాత్రం భిన్నమైన నివేదికలు వెలువడుతున్నాయి. కొన్ని వార్తా కథనాలు ఏడుగురు మరణించారని పేర్కొనగా, మరికొన్ని మూడు మరణాలను మాత్రమే ధ్రువీకరించాయి. మరికొందరు జర్నలిస్టులు సంఖ్య 12 వరకు ఉండొచ్చని చెబుతున్నారు. అందువల్ల తుది మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో పీఓకేలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అసంతృప్తి మరోసారి అంతర్జాతీయ చర్చకు వచ్చింది.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు