POK Protests: ఎన్నికల వేళ పాక్‌లో ఉద్రిక్తతలు... పీవోకేలో కాల్పులు...19 మంది మృతి
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు రణరంగంగా మారాయి. మూడు విడతలుగా జరుగనున్న పోలింగ్‌లో మొదటివిడత సమయంలో జరిగిన అల్లర్ల కారణంగా 19 మంది మృతి చెందారు.
POK Protests: పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ తీవ్రమైన ఆందోళనలు, విస్తృత స్థాయి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మూడు విడతల్లో జరగాల్సిన ఈ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ రోజున భద్రతా బలగాల కాల్పులు, రాజకీయ ఘర్షణలు చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాల్పులు ...తీవ్ర ప్రాణనష్టం
పాకిస్థాన్ రేంజర్లు, భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో దాదాపు 19 మంది నిరసనకారులు మరణించగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు సర్దార్ ఉమర్ నజీర్ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా ఉన్నట్లు స్థానిక ఆధారాలు ధృవీకరించాయి. ఇక, సమాహ్ని నియోజకవర్గ పరిధిలోని రామ్లోహా పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ సిబ్బందిని బందీలుగా చేసుకున్నారనే ఆరోపణలతో తుపాకుల నీడన బోగస్ ఓటింగ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. సాయుధులైన వ్యక్తులు ఓటింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పెట్టెలను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇక పోలింగ్ విషయానికి వస్తే...పీవోకే అసెంబ్లీలో మొత్తం 53 స్థానాలు ఉండగా, 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 8 స్థానాలు మహిళలు, నిపుణులు, మతపెద్దలకు కేటాయించారు. ఈ పోలింగ్ ప్రక్రియ జులై 27 నుండి ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. పీపీపీ, పీఎంఎల్-ఎన్ పార్టీలు ఒకరిపై ఒకరు అక్రమాల ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
పోరాటానికి మూలకారణం ఏమిటి?
పాకిస్థాన్ ప్రభుత్వం కేటాయించిన 12 శరణార్థి స్థానాలను పూర్తిగా రద్దు చేయాలని 'జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' డిమాండ్ చేస్తోంది. గతంలో జీఏఏసీని నిషేధించిన నాటి నుంచి ప్రభుత్వానికి, స్థానిక ప్రజలకు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. రావాలాకోట్ నుంచి ముజఫరాబాద్ వైపు ఆందోళనకారులు చేపట్టిన లాంగ్ మార్చ్‌పై బలగాలు అణచివేత చర్యలకు దిగడం పరిస్థితిని మరింత క్షీణింపజేసింది. పాకిస్తాన్ నుంచి పీవోకేను తప్పించాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.




