Poland vs Zelenskyy: యుద్ధంలో మద్దతిచ్చి...జెలెన్‌స్కీకి షాకిచ్చిన పోలాండ్‌... మిత్ర దేశాల మధ్య చిచ్చుపెట్టిందేమిటి?

ఉక్రెయిన్‌ ప్రతిపాదించిన యూపీఏ సైన్యంపై పోలాండ్‌ వ్యతిరేకభావంతో ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఇచ్చిన అత్యున్నత పురస్కారాన్ని తిరిగి తీసుకుంది.

Balachander
Published on: 20 Jun 2026 12:54 PM IST
Poland vs Zelenskyy: యుద్ధంలో మద్దతిచ్చి...జెలెన్‌స్కీకి షాకిచ్చిన పోలాండ్‌... మిత్ర దేశాల మధ్య చిచ్చుపెట్టిందేమిటి?
X

Poland vs Zelenskyy: గత నాలుగేళ్లుగా రష్యాతో జరుగుతున్న భీకర యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా నిలబడిన అత్యంత ముఖ్యమైన మిత్రదేశం పోలాండ్. కానీ, తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఈ రెండు దేశాల దౌత్య సంబంధాలలో తీవ్రమైన చిచ్చు పెట్టింది. ఉక్రెయిన్‌లోని ఒక మిలిటరీ యూనిట్‌కు వివాదాస్పద "ఉక్రేనియన్ ఇన్సర్జెంట్ ఆర్మీ" పేరు పెట్టడమే ఈ వివాదానికి మూలకారణం. ఉక్రెయిన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోత్స్కీ... జెలెన్‌స్కీకి గతంలో తమ దేశం అందించిన అత్యున్నత పౌర పురస్కారం "ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగిల్" ను వెనక్కి తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అసలు వివాదానికి కారణమేంటి?

ఈ వివాదాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే రెండో ప్రపంచ యుద్ధం కాలానికి వెళ్లాలి. యూపీఏ దళం అంటే ఉక్రెయిన్‌ ప్రజల దృష్టిలో సోవియట్‌ రెడ్‌ ఆర్మీ, నాజీ ఆర్మీలకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులుగాను, దేశభక్తులుగాను భావిస్తారు. కానీ, ఉక్రెయిన్‌ మిత్రదేశం పోలాండ్‌ ప్రకారం... గంలో ఇదే ఉక్రెయిన్‌ దేశభక్త సైన్యం యూపీఏ... వోల్హీనియా ప్రాంతంలో దాదాపు లక్షమందికి పైగా నిర్దోషులైన పోలీష్‌ పౌరులను అత్యంత క్రూరంగా ఊచకోత కోసింది. యూపీఏ అంటే అప్పటి నుంచే పోలాండ్‌కు ఒకవిధమైన శతృత్వం ఉంది. యూపీఏ సైన్యానికి పోలాండ్‌ పూర్తిగా వ్యతిరేకం. పోలాండ్‌లోని మెజారిటీ ప్రజలు యూపీఏ సైన్యాన్ని కిరాతక హంతక ముఠాగానే చూస్తుంది. అలాంటి దళాన్ని ఉక్రెయిన్‌ ప్రభుత్వం అధికారికంగా గౌరవించడాన్ని పోలాండ్‌ సహించలేకపోయింది.

ఈయూ సభ్యత్వానికి బ్రేక్ పడుతుందా?

2022 లో రష్యా దాడి చేసినప్పటి నుంచి పోలాండ్ లక్షలాది మంది ఉక్రెయిన్ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది. అంతగా ఆదుకున్న దేశ సెంటిమెంట్‌ను జెలెన్‌స్కీ గాయపరిచారని పోలాండ్ భావిస్తోంది. అంతేకాదు, ఉక్రెయిన్ గనుక యూరోపియన్ యూనియన్ లో చేరాలనుకుంటే.. ఇలాంటి హింసాత్మక చరిత్ర కలిగిన శక్తులను కీర్తించడం ఆపాలని, లేదంటే పోలాండ్ తన వీటో పవర్‌తో ఉక్రెయిన్ ఈయూ సభ్యత్వాన్ని అడ్డుకుంటుందని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, పోలాండ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా తీవ్రంగా ఖండించారు. ఇదొక "వ్యూహాత్మక తప్పిదం" అని, తమ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించకపోవడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ వివాదం దౌత్యపరంగా రగులుతున్నప్పటికీ.. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు అందించే సైనిక మద్దతును మాత్రం ఆపబోమని పోలాండ్ స్పష్టం చేయడం గమనార్హం. మరి రష్యా దీనిని ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి. పోలాండ్‌తో చెలరేగిన ఈ చిన్నపాటి సంఘర్షణ ఎటువైపు దారితీస్తుందో చూడాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story