PSL: పాకిస్థాన్‌లో సూప‌ర్ లీగ్‌లో ఆడేవారంతా.. రిటైర్డ్ అయిన వారే. ఈ వ్యాఖ్య‌లు చేసింది మ‌రెవ‌రో కాదు

PSL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మధ్య పోలికపై మళ్లీ చర్చ మొదలైంది.

Mokshith
Updated on: 15 April 2026 4:28 PM IST
PSL
X

PSL

PSL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మధ్య పోలికపై మళ్లీ చర్చ మొదలైంది. ఈసారి ఆసక్తికర విషయం ఏమిటంటే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తానే PSLపై విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది.

రైలి రూసో వ్యాఖ్యలతో మొదలైన వివాదం

దక్షిణాఫ్రికా ఆటగాడు రైలి రూసో ఇటీవల IPLను “సినిమా లాంటిది”గా, PSLను “మరింత పోటీతో కూడిన లీగ్”గా అభివర్ణించాడు. ప్రస్తుతం అతను క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున PSLలో ఆడుతున్నాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ముఖ్యంగా, IPL ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ అని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ పోలికపై వివాదం చెలరేగింది.

అహ్మద్ షెహజాద్ ఘాటు వ్యాఖ్యలు

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ రూసో వ్యాఖ్యలకు బలంగా స్పందించాడు. ఈ విష‌య‌మై ఆయ‌న మాట్లాడుతూ.. IPLలో అవకాశం దక్కని ఆటగాళ్లు PSLను మెచ్చుకుంటారు. ఒకే సమయంలో రెండు లీగ్‌లలో ఆడే అవకాశం వస్తే, ప్రతి ఆటగాడు ముందుగా IPLనే ఎంచుకుంటాడు. PSLలో ఆడే విదేశీ ప్లేయర్లు ఎక్కువగా డబ్బు కోసం మాత్రమే లీగ్‌ను పొగుడుతారు. అతను నేరుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)పై కూడా విమర్శలు చేస్తూ, లీగ్ స్థాయి గురించి నిజాలు బయటపెట్టాడు.

రిటైర్డ్ ప్లేయ‌ర్లు మాత్ర‌మే అంటూ..

షెహజాద్ ఇంకా మాట్లాడుతూ.. PSLలో ఎక్కువగా ఆడేది IPL నుంచి బయటకు వచ్చిన లేదా కెరీర్ చివరి దశలో ఉన్న ఆటగాళ్లేనని చెప్పాడు ఉదాహరణగా డేవిడ్ వార్నర్, కెవిన్ పీటర్సన్, క్రిస్ గేల్ వంటి పేర్లు ప్రస్తావించాడు

వీరిలో చాలామంది IPL తర్వాత లేదా అంతర్జాతీయ కెరీర్ తగ్గిన తర్వాత PSL వైపు వ‌స్తున్నార‌ని అన్నాడు. PSLలో జట్ల సంఖ్యను పెంచినా, లీగ్ నాణ్యత తగ్గిందని విమర్శించాడు. ప్రొఫెషనల్ ప్లేయర్లు మంచి అవకాశాల కోసం IPLను ఎంచుకోవడం సహజమని చెప్పుకొచ్చాడు. మ‌రి షెహ‌జాద్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ఎలాంటి చ‌ర్చ‌కు దారి తీస్తాయో చూడాలి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story