Raul Jon Aju: 17 ఏళ్లకే ఏఐ కంపెనీ...యువ పారిశ్రామికవేత్తగా పుతిన్‌తో సెల్ఫీ...ఆశ్చర్యపోతున్న ప్రపంచం

రళకు చెందిన 17 ఏళ్ల ఏఐ యువ పారిశ్రామికవేత్త రౌల్ జోన్ అజు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సెల్ఫీ దిగి వార్తల్లో నిలిచాడు. తొమ్మిదేళ్లకే ఏఐ నేర్చుకున్న అతడి ప్రయాణం, స్టార్టప్, విజయాల గురించి తెలుసుకుందాం.

Rudrachander
Published on: 27 Nov 2026 4:24 PM IST
Raul Jon Aju: 17 ఏళ్లకే ఏఐ కంపెనీ...యువ పారిశ్రామికవేత్తగా పుతిన్‌తో సెల్ఫీ...ఆశ్చర్యపోతున్న ప్రపంచం
X

Raul Jon Aju: చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేరళ యువకుడు రౌల్ జోన్ అజు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచాడు. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో స్టార్టప్‌ను స్థాపించి, పలువురికి శిక్షణ ఇస్తున్న ఈ యువ పారిశ్రామికవేత్తకు అరుదైన అవకాశం దక్కింది. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుసుకుని సెల్ఫీ దిగాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో రౌల్ పేరు ఒక్కసారిగా వైరల్‌గా మారింది.

పుతిన్‌తో భేటీ.. ఎలా దక్కిందీ అవకాశం?

నవంబర్ 26న ప్రారంభమైన మూడు రోజుల ‘ఏఐ జర్నీ 2026’ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు, యువ ప్రతిభావంతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రౌల్‌కు పుతిన్‌తో మాట్లాడే అవకాశం లభించింది. సదస్సు ప్లీనరీ సమావేశం ముగిసిన తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం జరిగినట్లు రష్యా మీడియా కథనాలు వెల్లడించాయి. రష్యా రాయబార కార్యాలయం కూడా రౌల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘థింక్‌క్రాఫ్ట్’ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించిన పాఠశాల విద్యార్థిగా అతడిని పరిచయం చేసింది. కజకిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్-జోమార్ట్ టోకయేవ్‌తో పాటు పుతిన్‌ను కలిసిన యువ ఏఐ ప్రతిభావంతుల్లో రౌల్ కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న రౌల్.. చిన్నప్పుడు సరదాగా వీడియోలు రూపొందించిన తనకు 17 ఏళ్లకే ఓ దేశాధ్యక్షుడిని కలిసే అవకాశం వస్తుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశాడు.

తొమ్మిదేళ్ల వయసులోనే ఏఐపై ఆసక్తి

రౌల్ ప్రయాణం సాధారణంగా మొదలైంది. తొమ్మిదేళ్ల వయసులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఎవరి దగ్గరా ప్రత్యేకంగా శిక్షణ తీసుకోకుండా సొంతంగా నేర్చుకోవడం ప్రారంభించాడు. వీడియో ఎడిటింగ్ ద్వారా సాంకేతిక ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. అతడి తండ్రికి అడోబ్ సంస్థలో ఉద్యోగం రావడంతో ప్రీమియం సాఫ్ట్‌వేర్ సాధనాలను ఉపయోగించే అవకాశం లభించిందని చెప్పాడు. ఆ పరిచయమే ఏఐపై మరింత ఆసక్తిని పెంచింది. పాఠశాల సైన్స్ ప్రాజెక్టులో భాగంగా ‘మీబాట్’ పేరుతో రోబోను కూడా రూపొందించాడు. ఆ తర్వాత తన ఆసక్తిని వ్యాపారంగా మార్చి ‘ఏఐ రియల్మ్ టెక్నాలజీస్’ అనే స్టార్టప్‌ను స్థాపించాడు.

తండ్రికి కూడా ఉద్యోగం ఇచ్చిన కొడుకు!

రౌల్ విజయ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అతడి సంస్థలో ప్రస్తుతం 15 మంది పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఏఐపై శిక్షణ అందించినట్లు సమాచారం. అంతేకాదు, అతడి తండ్రి కూడా అదే సంస్థలో పనిచేస్తూ నెలకు రూ.2 లక్షల వేతనం పొందుతున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు ఖర్చుల కోసం డబ్బులు ఇస్తుంటారు. కానీ రౌల్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. తన సంస్థలో తండ్రికే ఉద్యోగం కల్పించడం అతడి ప్రయాణంలో ప్రత్యేకంగా నిలుస్తోంది.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు