పీఓకేలో మళ్లీ హింస.. కాల్పులతో దద్దరిల్లిన రావల్కోట్
పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK)లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. అక్కడి పౌరుల నిరసనలపై పాకిస్తానీ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. రావల్కోట్లోని ఉమర్
పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK)లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. అక్కడి పౌరుల నిరసనలపై పాకిస్తానీ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. రావల్కోట్లోని ఉమర్ ఫరూఖ్ చౌక్ సమీపంలో భద్రతా దళాలు జరిపిన డ్రోన్ దాడులు, విచక్షణారహిత తుపాకీ కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచే పాకిస్తానీ సైనికులు నిరాయుధులైన నిరసనకారులు, పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దహనమవుతున్న ఇళ్లు.. దద్దరిల్లుతున్న రావల్కోట్
ఈ దాడులకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పౌరుల ఇళ్లు తగలబడుతుండటం, నిరంతరంగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తుండటం రావల్కోట్లో నెలకొన్న భయానక వాతావరణానికి అద్దం పడుతోంది. ఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న శ్రాప్నెల్ (బాంబు శకలాలు)ను ప్రదర్శిస్తూ, పాకిస్తాన్ సైన్యం తమపై మరణ శాసనం రాస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా భద్రతా దళాలు కాల్పులు జరిపాయని తీవ్రంగా మండిపడుతున్నారు.
జూన్ నుంచి 153 మందికి పైగా బలి
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పౌరులపై సైనిక దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత జూన్ నుంచి ప్రారంభమైన పౌర నిరసనలను అణచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 153 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రావల్కోట్లో నిరసనల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం ముందస్తు చర్యగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. అయినప్పటికీ, ప్రజలు భయాందోళనలను పక్కనపెట్టి పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
సైన్యం అణచివేతపై తిరుగుబాటు జెండా
అసిమ్ మునీర్ నేతృత్వంలోని పాకిస్తాన్ సైన్యం ఎంతటి దమనకాండకు పాల్పడినా వెనక్కి తగ్గేది లేదని స్థానిక ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం సబ్సిడీ పిండి, చౌక విద్యుత్ కోసం మాత్రమే జరుగుతున్న పోరాటం కాదని.. స్థానిక శాసనసభలో సరైన ప్రాతినిధ్యం, తమ ప్రాంతీయ వనరులపై తమకే హక్కులు , పరిపాలనా స్వయంప్రతిపత్తి సాధించేంత వరకు ఈ పోరాటం ఆగదని నిరసనకారులు తేల్చిచెబుతున్నారు. ఈ పరిణామాలు పాకిస్తాన్ ఆక్రమణ నుంచి విముక్తి దిశగా PoK ప్రజల్లో వస్తున్న చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.




