Strait of Hormuz tensions: ఉద్రిక్తంగా మారిన హోర్ముజ్‌...అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ దాడి

Strait of Hormuz tensions: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి.

Balachander
Published on: 20 April 2026 9:49 AM IST
Strait of Hormuz tensions
X

Strait of Hormuz tensions: ఉద్రిక్తంగా మారిన హోర్ముజ్‌...అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ దాడి

Strait of Hormuz tensions: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. హోర్ముజ్‌ జలసంధిలో అమెరికా ఇరాన్‌ మధ్య తలెత్తిన తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తున్నాయి. జలసంధి పూర్తిగా ఓపెన్‌ అయిందని చెబుతున్నా... నౌకలను సీజ్‌ చేస్తుండటం, కాల్పులు జరుగుతున్నాయి. ఒకవైపు శాంతి చర్చల మాటలు వినిపిస్తుండగానే, యుద్ధవాతావరణం నెలకొనడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

చర్చల ప్రకటన.. ఇరాన్ ఖండన

రెండో విడత శాంతి చర్చల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఓ కీలక ప్రకటన చేశాడు. పాకిస్తాన్‌ వేదికగా రెండో విడత చర్చలు ఉంటాయని, మంగళవారం ఈ భేటి ఉంటుందని తెలిపాడు. శాంతి చర్చల మాట మాట్లాడుతూనే ఇరాన్‌కు హెచ్చరికలు కూడా జారీ చేశాడు. తాము చెప్పిన ఒప్పందానికి ఇరాన్‌ ఒప్పుకొని తీరాలని, లేదంటే ఇరాన్‌లోని విద్యుత్‌ కేంద్రాలు, వంతెలను ధ్వంసం చేస్తామని హెచ్చరించాడు. చర్చలు అంటూనే హెచ్చరికలు జారీ చేయడంతో ఇరాన్‌ మండిపడింది. చర్చల వార్తలను కొట్టిపారేసింది. ఇస్లామాబాద్‌లో ఎలాంటి చర్చలు జరగడం లేదని, ఇదంతా అమెరికా ఆడుతున్న మైండ్‌గేమ్‌లో భాగమేనని ఇరాన్‌ అధికారిక వార్త సంస్థ స్పష్టం చేసింది. చర్చలనేవి వట్టిమాటలేనని, ఇరాన్‌ను నాశనం చేయడమే వారి లక్ష్యమని ఇరాన్‌ సైన్యం చెబుతోంది. అమెరికా ఎలాంటి దాడులకు తెగబడినా దానికి తగిన సమాధానం చెబుతామని హెచ్చరించింది.

నౌక సీజ్.. డ్రోన్లతో ప్రతికారం

ఎలాగైనా ఇరాన్‌ పోర్టులను దిగ్బంధం చేయాలని అనుకున్న అమెరికా...హోర్ముజ్‌ జలసంధిలోకి అడుగుపెట్టడానికి పలు ప్రయత్నాలు చేసింది. కానీ వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో జలసంధి బయట పెద్ద ఎత్తున మోహరించాయి. జలసంధిగుండా వచ్చే నౌకలను సీజ్‌ చేయాలని చూశాయి. ఇందులో భాగంగానే గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ గుండా ఇరాన్‌ జెండాతో వెళ్తున్న ఓ నౌకను అమెరికా దళాలు బలవంతంగా ఆపి సీజ్‌ చేసింది. అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నామని హెచ్చిరించడమే కాకుండా నౌకపై రెండు రౌండ్ల కాల్పులు కూడా జరిపినట్టు అమెరికా ప్రకటించింది. ఈ సంఘటనకు ప్రతీకగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ రంగంలోకి దిగింది. అమెరికా యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకొని అత్యాధునిక ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. ఈ పరిణామంతో హోర్ముజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డ్రోన్‌లతో పాటు తమ అమ్ములపొదిలోని అత్యాధునిక రాకెట్లతో విరుచుకు పడతామని హెచ్చరించింది.

ఉత్కంఠలో ప్రపంచ దేశాలు

మొదటి విడత కాల్పుల విరమణ గడువు ఏప్రిల్‌ 22తో ముగియనున్నది. అంటే ఇంకా మిగిలి ఉన్నది కేవలం 48 గంటలు మాత్రమే. ఈలోపు చర్చలు సఫలం కాకపోతే పూర్తిస్థాయి యుద్ధం తప్పదని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ జలసంధి ద్వారా ప్రపంచానికి చమురు సరఫరా కాకపోతే అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. యుద్ధం తాము కోరుకున్నది కాదని ప్రపంచదేశాలు చెబుతున్నాయి. యుద్ధం ఆగకుంటే అనివార్యంగా మిగతా దేశాలు కూడా ఈ యుద్ధరంగంలోకి అడుగుపెట్టవలసి వస్తుంది. తద్వారా పరిణామాలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

శాంతి చర్చల ముసుగులో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు చివరకు ఎటు దారితీస్తుందో అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సామాన్య ప్రజలు సైతం గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ వారి క్షేమం గురించి ఆందోళన చెందుతున్నారు. యుద్ధం ముగిసిందని భావిస్తున్న తరుణంలో, మళ్ళీ తుపాకుల మోత వినిపించడం పశ్చిమాసియా దౌర్భాగ్యమనే చెప్పాలి. ఈ నివురుగప్పిన నిప్పు ఎప్పుడు చల్లారుతుందోనని ఎదురు చూడటం తప్ప చేసేదేమి లేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story