Fire Accident: గ్యాస్ ప్లాంట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది కార్మికులు దుర్మరణం
Fire Accident: రష్యాలోని ఆమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
Fire Accident
Fire Accident: రష్యాలోని ఆమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 15 మంది ఉద్యోగులు అగ్నికి ఆహుతయ్యారు. ఒక రష్యన్ పౌరుడితో పాటు 14 మంది విదేశీ కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో ప్లాంట్ వద్ద భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాస్కోకు దాదాపు 5,500 కిలోమీటర్ల దూరంలో చైనా సరిహద్దులకు అతిసమీపంలో ఉన్న ఆమూర్ ప్రాంతంలో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఈ వారంలో హఠాత్తుగా ప్లాంట్‌లోని సహాయక ప్రాసెసింగ్ విభాగంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు విస్తరించడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ప్రాణాలు దక్కించుకోవడానికి చెల్లాచెదరుగా పరుగులు తీశారు. సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ 15 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు చైనా పౌరులు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.
రష్యా-చైనా కంపెనీల భాగస్వామ్య ప్రాజెక్టు
ఈ ఆమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ రష్యాకు చెందిన ప్రముఖ పెట్రోకెమికల్ సంస్థ సిబుర్, చైనా ప్రభుత్వ రంగ సంస్థ సినోపెక్ కలిసి సంయుక్తంగా చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టు. 2027 ప్రారంభం నుంచి ఈ ప్లాంట్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 2.7 మిలియన్ టన్నుల పాలిథిలిన్, పాలిప్రొపైలిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్లాంట్‌లో ప్రమాదం జరగడం ఇరు దేశాల యాజమాన్యాల్లో కలవరాన్ని రేపింది.
రంగంలోకి దర్యాప్తు బృందాలు
అగ్నిప్రమాదం సమాచారం అందగానే రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. నిబంధనల ఉల్లంఘన లేదా సాంకేతిక లోపాల కోణంలో రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ విచారణ జరుపుతోంది. అయితే ఈ ఘటన వెనుక ఎలాంటి సబ్స్టాండేజ్ లేదా విధ్వంసకర కోణం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించలేదు. చైనా రాయబార కార్యాలయం కూడా తన నిపుణుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపి పరిస్థితిని సమీక్షిస్తోంది.
ముఖ్యమైన పరికరాలకు తప్పిన ముప్పు
ప్రమాదం జరిగినప్పటికీ కాంప్లెక్స్‌లోని ప్రధాన యంత్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్లాంట్ యాజమాన్యం ప్రకటించింది. అనుబంధ విభాగంలోనే మంటలు చెలరేగడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపింది. ప్రమాదం జరగని ఇతర ప్రాంతాల్లో నిర్మాణ పనులు యథావిధిగా సాగుతున్నాయి. గాలి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వాతావరణంలో విషవాయువుల ప్రభావం సురక్షిత పరిమితిలోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు.




