Russia Attacks Kyiv: కీవ్‌పై రష్యా మహా ప్రళయం.. 11 గంటల పాటు నిరంతరాయంగా విరుచుకుపడ్డ డ్రోన్లు, మిసైళ్లు
Russia Attacks Kyiv: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా 11 గంటల పాటు డ్రోన్లు, మిసైళ్లతో ఘోర దాడికి తెగబడింది. ఈ దాడిలో 21 మంది పౌరులు మరణించారు.
Russia Attacks Kyiv
Russia Attacks Kyiv: ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా మారాయి. గురువారం తెల్లవారుజామున రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఘోరమైన వైమానిక దాడికి తెగబడింది. దాదాపు 11 గంటల పాటు నిరంతరాయంగా సాగిన ఈ దాడిలో రష్యా వందలాది పేలుడు డ్రోన్లు, క్షిపణులను కీవ్ నగరంపైకి గుప్పించింది. ఈ భయానక దాడి కారణంగా కీవ్ నగరం మొత్తం భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. నగరంలోని ఆకాశం నల్లటి దట్టమైన పొగతో నిండిపోగా, రష్యా ప్రయోగించిన క్షిపణులు నివాస ప్రాంతాలపై పడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
రక్తసిక్తమైన ఉక్రెయిన్ రాజధాని
దేశ అత్యవసర సేవల విభాగం వెల్లడించిన సమాచారం ప్రకారం.. రష్యా జరిపిన ఈ క్రూరమైన క్షిపణి దాడుల వల్ల కీవ్ నగరంలో కనీసం 21 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 90 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. నగరవ్యాప్తంగా దాదాపు 30కి పైగా ప్రాంతాలలో భారీ నష్టం వాటిల్లింది. వీటిలో సుమారు 20 నివాస గృహాల అపార్ట్‌మెంట్లు పూర్తిగా ధ్వంసమై బూడిదయ్యాయి. కీవ్‌లోని డెస్నియాన్స్కీ, డార్నిట్స్కీ జిల్లాల్లో తొమ్మిది అంతస్తుల నివాస భవనాలు కుప్పకూలడంతో వాటి శిథిలాల కింద అనేకమంది ప్రజలు చిక్కుకుపోయారు. రెస్క్యూ సిబ్బంది రోజుమొత్తం శ్రమించి మృతదేహాలను, క్షతగాత్రులను వెలికితీశారు. దురదృష్టవశాత్తూ నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 7 ఏళ్ల చిన్నారి కూడా మరణించింది.
మెట్రో స్టేషన్లలో దాక్కున్న 50 వేల మంది ప్రజలు
రష్యా దాడుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అక్కడి మెట్రో రైల్వే అధికారులు వెల్లడించిన గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గురువారం తెల్లవారుజామునే అధికారులు వైమానిక దాడి హెచ్చరికలు జారీ చేయడంతో, ప్రాణభయంతో కీవ్ నగరానికి చెందిన 50,000 మందికి పైగా ప్రజలు భూగర్భంలో ఉన్న సబ్‌వే స్టేషన్లలోకి పరుగు తీసి తలదాచుకున్నారు. నగరవాసి అయిన 24 ఏళ్ల సెర్హీ బుడ్కో మాట్లాడుతూ.. తాము షెల్టర్ లోపల ఉన్న సమయంలో వరుసగా మూడు, నాలుగు బాలిస్టిక్ మిసైళ్లు పడ్డాయని, ఆ సమయంలో కింది నేల, పైకప్పుతో సహా షెల్టర్ మొత్తం భూకంపం వచ్చినట్లు ఊగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు.
రష్యా ఇంధన గుండెకాయపై ఉక్రెయిన్ దెబ్బ
రష్యా దళాలు ఈ స్థాయిలో విరుచుకుపడటానికి ఉక్రెయిన్ చేసిన ముందస్తు ప్రతీకార దాడులే కారణమని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చిన 40 రోజుల మెరుపు దాడిలో భాగంగా ఉక్రెయిన్ సైన్యం రష్యా దేశంలోకి చొచ్చుకెళ్లి అక్కడి ప్రధాన చమురు కేంద్రాలను, ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేసింది. రష్యా తూర్పు ప్రాంతంలోని నిజ్నీ నొవ్‌గోరోడ్‌లో ఉన్న రష్యాలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసి భారీగా తగలబెట్టింది. దీనితో పాటు రష్యా ఆక్రమిత లుహాన్స్క్ ప్రాంతంలో రష్యా సైన్యం ఆయుధాలు, బలగాలను రవాణా చేసే ఒక కీలకమైన రైల్వే వంతెనను కూడా ఉక్రెయిన్ దళాలు పేల్చివేశాయి.
యుద్ధ క్షేత్రంలో రష్యా సైన్యానికి బ్రేకులు
రష్యా తన పొరుగు దేశమైన ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దురాక్రమణకు దిగి దాదాపు నాలుగేళ్లు దాటిపోతోంది. అయితే ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్ దేశీయంగా సాధించిన డ్రోన్ ఇంజనీరింగ్ సాంకేతిక పురోగతి ఈ యుద్ధంలో రష్యాకు చుక్కలు చూపిస్తోందని అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. ఫ్రంట్ లైన్ వెనుక వైపు ఉన్న రష్యా సప్లై రూట్లను ఉక్రెయిన్ సమర్థవంతంగా దెబ్బతీయడం వల్ల యుద్ధభూమిలో రష్యా సైన్యం ముందుకు సాగలేక నెమ్మదించింది. ముఖ్యంగా 2014 లో రష్యా అక్రమంగా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పానికి వెళ్లే ఇంధన సరఫరాను ఉక్రెయిన్ కట్ చేయడంతో అక్కడ రష్యా చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ ఇంధన సంక్షోభం ఏర్పడింది. తాము యుద్ధంలో గెలుస్తున్నామన్న పుతిన్ భ్రమలకు ఉక్రెయిన్ డ్రోన్లు గట్టి దెబ్బ కొట్టాయి.
పుతిన్‌ను చర్చల మేజిక్ ముందుకు తెచ్చే వ్యూహం
రష్యాను ఆర్థికంగా దెబ్బతీసి, వ్లాదిమిర్ పుతిన్‌ను శాంతి చర్చల టేబుల్ ముందుకు తీసుకురావడమే తమ ప్రధాన వ్యూహమని ఉక్రెయిన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే రష్యా మాత్రం చర్చలకు రాకుండా మరింత కసితో దాడులను తీవ్రం చేస్తోంది. ఈ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం చేసిన రాయబార ప్రయత్నాలు కూడా ఇప్పటివరకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. వచ్చే వారం టర్కీ దేశంలో ప్రతిష్టాత్మకమైన నాటో దేశాల శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకు డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ ఇద్దరూ హాజరుకానున్నారు. పాశ్చాత్య దేశాల మద్దతు కాలక్రమేణా తగ్గిపోతుందని, అంతవరకు బాంబుల దాడితో ఉక్రెయిన్‌ను లొంగదీసుకోవచ్చని పుతిన్ భావిస్తున్నట్లు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సుదీర్ఘ యుద్ధంలో ఇప్పటివరకు 16,000 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో ఇరువైపులా కలిపి దాదాపు 18 లక్షల మంది సైనికులు మరణించడం లేదా గాయపడటం లేదా కనిపించకుండా పోవడం జరిగింది.




