Aviation Fuel Exports : గ్లోబల్ మార్కెట్‌కు పుతిన్ బిగ్ షాక్.. విమానాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోనున్నాయా..?
Aviation Fuel Exports : ఉక్రెయిన్ దాడుల వల్ల చమురు ఉత్పత్తి తగ్గడంతో రష్యా ప్రభుత్వం నవంబర్ 30 వరకు విమాన ఇంధన ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
jet fuel
Aviation Fuel Exports : ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో రారాజుగా వెలుగొందుతున్న రష్యా అంతర్జాతీయ మార్కెట్‌కు ఒక గట్టి షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌తో సుదీర్ఘ కాలంగా సాగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశీయ అవసరాలు, నిల్వలను కాపాడుకునేందుకు గాను విమాన ఇంధనం ఎగుమతులపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆంక్షలు ఈ ఏడాది నవంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని క్రెమ్లిన్ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
రష్యా ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. తమ దేశీయ ఇంధన మార్కెట్లో ధరలు పెరగకుండా స్థిరత్వాన్ని కాపాడటం కోసమే ఈ తాత్కాలిక నిషేధాన్ని విధిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రష్యా డీజిల్, జెట్ ఫ్యూయల్ ఎగుమతులను ఆపేయవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రష్యా అంతర్గత చమురు రంగాన్ని సమతుల్యం చేయడానికి ఈ వ్యూహాత్మక వాణిజ్య ఆంక్షల నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది.
రష్యాలో ఇంధన ఉత్పత్తి పడిపోవడానికి ప్రధాన కారణం ఉక్రెయిన్ సైన్యం జరిపిన మెరుపు దాడులేనని చెప్పాలి. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ రష్యాకు చెందిన కీలకమైన ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేసింది. రష్యాలోని అతిపెద్ద ఆయిల్ ప్రాసెసింగ్ రిఫైనరీలు, అంతర్జాతీయ పైప్‌లైన్ నెట్‌వర్క్‌లపై ఉక్రెయిన్ వరుసగా డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు తెగబడింది. ఈ దాడుల వల్ల రష్యాలో చమురు శుద్ధి ప్రక్రియ గడిచిన కొన్ని ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యల్ప స్థాయికి పడిపోయింది.
ఒకవైపు ఉక్రెయిన్ దాడుల వల్ల ఇంధన ఉత్పత్తి తగ్గడం, మరోవైపు రష్యాలో ప్రస్తుతం సీజనల్ డిమాండ్ భారీగా పెరగడంతో పుతిన్ సర్కార్ అప్రమత్తమైంది. ఇలాంటి క్లిష్ట సమయంలో అంతర్జాతీయ దేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేయడం కంటే.. ముందుగా తమ దేశ అవసరాలకు సరిపడా నిల్వలను సురక్షితంగా ఉంచుకోవడమే ముఖ్యమని రష్యా భావించింది. అందుకే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా నవంబర్ ఆఖరి వరకు విమాన ఇంధన సప్లైని నిలిపివేసింది.
ప్రపంచంలోనే పెట్రోలియం ప్రొడక్టులను అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో రష్యా చాలా కీలకమైనది. అంతర్జాతీయంగా ఎంతోమంది కొనుగోలుదారులు రష్యా డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్పైనే ఆధారపడతారు. అయితే ఈ తాజా ఎగుమతుల నిషేధం వల్ల పాత కస్టమర్లకు ఇబ్బంది లేకుండా రష్యా ఒక క్లారిటీ ఇచ్చింది. వివిధ దేశాలతో రష్యాకు అంతకుముందే ఉన్న అంతర ప్రభుత్వ ఒప్పందాల ప్రకారం జరగాల్సిన ఇంధన సరఫరాకు ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచే రష్యా అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగానే రష్యా ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే ఆటోమొబైల్ ఇంధనమైన పెట్రోల్ ఎగుమతులపై కూడా పరిమితులు విధించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ తన వ్యూహాత్మక దాడులను మరింత తీవ్రం చేయడం, రష్యా కూడా ప్రతిరోజూ మిసైళ్లు, డ్రోన్లతో బదులిస్తుండటంతో యుద్ధం కారణంగా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది.




