Environmental Disaster: రష్యా తీరాన్ని ముంచెత్తుతున్న విపత్తు - వ్యూహాలే కారణమా?
ప్రస్తుతం రష్యాలోని దక్షిణ ప్రాంతం ఆధునిక చరిత్రలోనే చూడని అతిపెద్ద పర్యావరణ విపత్తును ఎదుర్కొంటోంది.
Environmental Disaster: ప్రస్తుతం రష్యాలోని దక్షిణ ప్రాంతం ఆధునిక చరిత్రలోనే చూడని అతిపెద్ద పర్యావరణ విపత్తును ఎదుర్కొంటోంది. యుద్ధం కేవలం ప్రాణాలను మాత్రమే కాదు, ప్రకృతిని కూడా ఎలా బలి తీసుకుంటుందో అనడానికి నల్ల సముద్ర తీరంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. ముఖ్యంగా తువాప్సే లోని రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల వల్ల భారీగా చమురు లీక్ అయ్యి, సముద్ర తీరమంతా కలుషితమైపోయింది. ఎంత దారుణమంటే, ఆ ప్రాంతంలో ఆకాశం నుండి 'నల్లటి వర్షం' కురుస్తోందని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.
యుద్ధం ముసుగులో ప్రకృతి విధ్వంసం
ఏప్రిల్ నెలలో జరిగిన ఈ దాడుల వల్ల సోచి వంటి పర్యాటక ప్రాంతాల తీరాలు చమురుతో నిండిపోయాయి. వేల సంఖ్యలో సముద్ర జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే, ఈ విపత్తును అరికట్టడం కన్నా, దీని గురించి మాట్లాడే వారి నోళ్లు నొక్కేయడానికే రష్యా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పర్యావరణ వేత్తలను 'విదేశీ ఏజెంట్లు'గా ముద్ర వేసి వేధిస్తుండటం గమనార్హం.
విపత్తుకు కారణం కేవలం యుద్ధమేనా?
ఈ విధ్వంసానికి ఉక్రెయిన్ దాడులే కారణమని పైకి కనిపిస్తున్నా, దీని వెనుక రష్యా దశాబ్దాలుగా అనుసరిస్తున్న పర్యావరణ వ్యతిరేక విధానాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుద్ధం కోసం చమురు ఉత్పత్తిని పెంచే క్రమంలో పర్యావరణ భద్రతా ప్రమాణాలను రష్యా పూర్తిగా విస్మరించింది. నిబంధనలను పాటించకపోవడం కూడా ఈ విపత్తుకు ఓ కారణం. ఇక ప్రపంచంలోనే స్వచ్చమైన నీటిలో 23 శాతం కలిగిన బైకాల్ సరస్సు రక్షణ చట్టాలను కూడా యుద్ధ అవసరాల కోసం సడలించారు. మంచినీటి సరస్సుకు ముప్పు వాటిల్లడం కూడా పర్యావరణ కాలుష్యానికి కారణాల్లో ఒకటిగా మారిపోయింది.
అంతర్జాతీయ మౌనం.. సామాన్యుడి ఆవేదన
నల్ల సముద్ర తీరంలో చమురు తెట్టు పేరుకుపోయి ఉన్నా, అధికారులు మాత్రం లాభాల కోసం బీచ్‌లను తెరిచి టూరిజం సీజన్ ప్రారంభించాలని చూస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు నిషేధించినా, రష్యా ప్రజలు వీపీఎన్‌ల ద్వారా తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఈ విపత్తు రష్యా ఉక్రెయిన్ సమస్య మాత్రమే కాదు. యుద్ధ సమయంలో జరిగే వివిధ దేశాల్లో జరిగే పర్యావరణ విధ్వంసమే. అయితే, ఈ విధ్వంసాన్ని అంతర్జాతీయ నేరంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఆకాశం నుంచి స్వచ్చమైన నీరు కాకుండా చమురు వర్షం కురుస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు యుద్ధంపై కాకుండా పర్యావరణాన్ని రక్షించి మానవ మనుగడపై దృష్టిసారిస్తే మంచిది.




