Russia Ukraine War: షాపింగ్ మాల్‌పై రష్యా డ్రోన్ల వర్షం.. 14 మంది మృతి, 121 మందికి గాయాలు

Russia Ukraine War: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ స్వగ్రామమైన క్రివీ రిహ్ నగరంపై రష్యా డ్రోన్లతో దాడులు తెగబడటంతో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 22 మంది చిన్నారులతో సహా 121 మంది తీవ్రంగా గాయపడ్డారు.

CR Reddy
Published on: 22 Aug 2026 6:41 AM IST
Russia Ukraine War
X

Russia Ukraine War

Russia Ukraine War: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ స్వగ్రామమైన క్రివీ రిహ్ నగరంపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ప్రజలతో కిటకిటలాడే ఒక ప్రధాన షాపింగ్ మాల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడింది. మొదటి దాడి జరిగిన వెంటనే ప్రాణనష్టం అంచనా వేస్తూ సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో, రష్యా దళాలు రెండోసారి దాడికి ఒడిగట్టడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్రూరమైన చర్యలో మాల్‌లోని విభాగాలు ధ్వంసమై శవాల దిబ్బగా మారాయి.

22 మంది చిన్నారులకు గాయాలు

ఈ దాడిలో ఇప్పటివరకు 14 మంది మరణించినట్లు స్థానిక యంత్రాంగం ధ్రువీకరించింది. గాయపడిన 121 మందిలో 22 మంది చిన్నపిల్లలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన 29 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, రక్షణ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో బాధితుల రోదనలు మిన్నంటాయి. ఆసుపత్రులన్నీ గాయపడిన వారితో నిండిపోయాయి.

అంతర్జాతీయ సమాజం స్పందించాలి: జెలెన్‌స్కీ

తన సొంత నగరంపై జరిగిన ఈ ఘోర దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరాయుధులైన సాధారణ పౌరులను, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ముమ్మాటికీ ఉగ్రవాద చర్యేనని సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. రష్యా క్రూరత్వాన్ని అడ్డుకోవడానికి అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు తక్షణమే స్పందించి, ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు విధించాలని కోరారు. ఉక్రెయిన్‌కు మరింత ఆత్మరక్షణ ఆయుధాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

మళ్లీ మళ్లీ లక్ష్యంగా మారుతున్న క్రివీ రిహ్

యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి క్రివీ రిహ్ నగరం రష్యాకు ప్రధాన లక్ష్యంగా మారింది. గతంలోనూ ఇక్కడ అనేక దాడులు జరిగాయి. ఈ నెల 16న ఇక్కడి ప్రముఖ ఉక్కు కర్మాగారంపై జరిగిన దాడిలో ఇద్దరు ఉద్యోగులు మరణించారు. గతేడాది ఏప్రిల్‌లో చిన్నారులు ఆడుకునే మైదానంపై రష్యా దాడి చేయడంతో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నిరంతరం జరుగుతున్న ఈ దాడులతో క్రివీ రిహ్ నగర ప్రజలు నిత్యం భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story