ఉక్రెయిన్‌పై 110కి పైగా క్షిపణుల దాడి.. నాటో తరహా భద్రతా హామీలను తోసిపుచ్చిన మాస్కో
Russia Ukraine War: యుద్ధం మొదలైనప్పటి నుంచి జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా రష్యా శుక్రవారం ఉక్రెయిన్‌పై 110కు పైగా క్షిపణులను ప్రయోగించిందని.
ఉక్రెయిన్‌పై 110కి పైగా క్షిపణుల దాడి.. నాటో తరహా భద్రతా హామీలను తోసిపుచ్చిన మాస్కో
Russia Ukraine War: యుద్ధం మొదలైనప్పటి నుంచి జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా రష్యా శుక్రవారం ఉక్రెయిన్‌పై 110కు పైగా క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడుల్లో కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధభూమిలో, దౌత్యరంగంలో ఎదురవుతున్న వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మాస్కో ఇలాంటి ఉగ్రదాడులకు పాల్పడుతోందని జెలెన్స్కీ తీవ్రంగా ఆరోపించారు. గురువారం చైనాలో జరిగిన సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌లతో కలిసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచాన్ని కొత్తగా తీర్చిదిద్దేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
పోలండ్ గగనతల ఉల్లంఘనపై దర్యాప్తు
మరోవైపు, ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని పోలండ్ భూభాగంలో గుర్తుతెలియని వస్తువు కూలిపోయిన ఘటనతో తమ గగనతల ఉల్లంఘన జరిగిందా లేదా అనే కోణంలో పోలండ్ సైన్యం దర్యాప్తు ప్రారంభించింది. ఆ వస్తువును స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అది ఏమిటనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు రష్యా జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు, వంతెనలు, రవాణా వ్యవస్థకు నష్టం వాటిల్లింది. పోలండ్‌లో ఐరోపా బలగాలు సైనిక విన్యాసాలు చేస్తున్న సమయంలో ఇది మరో రష్యా రెచ్చగొట్టే చర్యలా ఉందని రక్షణ మంత్రి వ్లాదిస్లావ్ కొసిన్యాక్-కామిష్ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రులు, సైనిక కమాండర్లు, భద్రతా సంస్థల అధిపతులతో ప్రధాని డొనాల్డ్ టస్క్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
నాటో తరహా హామీలు అంగీకరించబోమన్న రష్యా
ఉక్రెయిన్‌కు నాటో ఆర్టికల్ 5 తరహా సామూహిక రక్షణ హామీలు ఇవ్వాలన్న ప్రతిపాదనలను రష్యా శుక్రవారం తిరస్కరించింది. ఉక్రెయిన్ నాటోలో అనధికార సభ్యత్వం పొందేలా ఏ ఏర్పాటు చేసినా మాస్కోకు ఆమోదయోగ్యం కాదని ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ స్పష్టం చేశారు. బెర్లిన్ సదస్సు తర్వాత ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపై పునరాలోచించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సూచించిన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఆర్టికల్ 5 ఆధారిత భద్రతా హామీల విషయంలో రష్యా సానుకూలంగా ఉన్నట్లు అమెరికా సంధానకర్త జారెడ్ కుష్నర్ పేర్కొనగా, ర్యాబ్కోవ్ ఆ వాదనను ఖండించారు. ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో చేరదన్న తమ డిమాండ్‌ను అంగీకరించిన తర్వాతే భద్రతా హామీలపై చర్చలు సాధ్యమని తేల్చిచెప్పారు.
మాస్కోకు ఐరోపా రాయబారుల పర్యటనపై చర్చలు
ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చల విషయంలో ఐరోపా దేశాల వైఖరిని స్పష్టం చేసుకునేందుకు వాటి రాయబారులను మాస్కోకు ఆహ్వానించే ప్రతిపాదనను పుతిన్ గురువారం ప్రస్తావించారు. దీనిపై బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ప్రతినిధుల మాస్కో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చలు జరుగుతున్నాయని ర్యాబ్కోవ్ ధృవీకరించారు.




