Russia New Strategy: ఆశ్చర్యపరుస్తున్న రష్యా నిర్ణయాలు... ఈ దేశాలపైనే ఫోకస్?
ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసియా, ఆఫ్రికా దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, టాంజానియా వంటి దేశాలతో కొత్త ఒప్పందాల వెనుక ఉన్న వ్యూహం ఏమిటో తెలుసుకుందాం.
Russia New Strategy: ఒకవైపు ఉక్రెయిన్‌తో నాలుగేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధం, మరోవైపు పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలు.. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతున్నారు. అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టడమే లక్ష్యంగా, పుతిన్ ఇప్పుడు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని వెనుకబడిన దేశాలను చేరదీస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం, ఆఫ్రికా దేశమైన టాంజానియాతో రష్యా కుదుర్చుకుంటున్న తాజా ఒప్పందాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. 1990కి ముందు ప్రపంచ రాజకీయాలను శాసించిన సోవియట్ యూనియన్ నాటి వైభవాన్ని రష్యాకు తిరిగి తీసుకురావాలన్నదే పుతిన్ ప్రధాన ప్లాన్. దీనికోసం అమెరికాపై వ్యతిరేకత ఉన్న దేశాలను ఒక తాటిపైకి తెస్తున్నారు.
తాలిబాన్లతో రష్యా దోస్తీ...వ్యూహాత్మక అడుగు
దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో పోరాడిన అమెరికా సైన్యం చివరకు తాలిబాన్లను ఓడించలేక అక్కడి నుండి వెనుతిరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు మెజారిటీ ప్రపంచ దేశాలు నిరాకరించాయి. కానీ, రష్యా మాత్రం ఇందుకు భిన్నంగా అడుగులు వేసింది. అమెరికా వదిలివెళ్లిన సాంప్రదాయ ఆయుధాలతోనే తాలిబాన్లు ప్రస్తుతం కాలం వెళ్లదీస్తున్నారు. తమ సైనిక శక్తిని ఆధునీకరించుకోవడానికి వారికి అధునాతన ఆయుధాలు కావాలి. ఆ ధైర్యం, సాయం రష్యా మాత్రమే చేయగలదని నమ్మి, తాలిబాన్ అగ్రనేతలు రష్యాలో పర్యటించి రక్షణ రంగ తాత్కాలిక ఒప్పందాలు చేసుకున్నారు. ఇంధన వనరుల్లో తిరుగులేని శక్తిగా ఉన్న రష్యా, ఆఫ్ఘనిస్తాన్‌కు వాణిజ్య సహకారాన్ని కూడా అందిస్తోంది.
ఆఫ్రికాపై ఫోకస్ ... టాంజానియాతో ఒప్పందాలు
కేవలం ఆసియానే కాకుండా ఖనిజ వనరులు పుష్కలంగా ఉండి, ఆర్థికంగా వెనుకబడిన ఆఫ్రికా దేశాలపై రష్యా గట్టిగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే టాంజానియా అధ్యక్షురాలు ఇటీవల రష్యాలో పర్యటించి కీలక ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు. పుతిన్ తనపై ఉన్న అంతర్జాతీయ యుద్ధ నేరాల ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై ఈ పేద, మధ్యతరగతి దేశాల ఓటు బ్యాంకును ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉందో వాటిని సరఫరా చేస్తూ, ప్రతిగా వారి మద్దతును పుతిన్ కూడగడుతున్నారు. అమెరికా ప్రపంచ పోలీసుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలకు రష్యా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా కనిపిస్తోంది. ఈ అంతర్జాతీయ చదరంగంలో పుతిన్ వేస్తున్న అడుగులు రాబోయే రోజుల్లో ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చేలా ఉన్నాయి.




