Russia North Korea: మరింత బలపడుతున్న రష్యా...నార్త్ కొరియా బంధం... దగ్గర చేస్తున్న బ్రిడ్జ్
రష్యా, ఉత్తర కొరియా మధ్య కొత్త రహదారి వంతెన అందుబాటులోకి వచ్చింది. వాణిజ్యం, రవాణాతో పాటు సైనిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ఈ బ్రిడ్జ్ వెనుక వ్యూహం వెనుక రహస్యాలను తెలుసుకుందాం.
Russia North Korea: ఉక్రెయిన్ సంక్షోభం వేళ ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఒక సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. రష్యా, ఉత్తర కొరియా దేశాల సరిహద్దులోని తుమెన్ నదిపై నిర్మించిన తొలి రహదారి వంతెన అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు కేవలం రైల్వే మార్గం, విమాన సర్వీసులకే పరిమితమైన ఈ రెండు దేశాల రవాణా, ఇప్పుడు ఈ కొత్త వంతెనతో మరింత వేగవంతం కానుంది. బాహ్య ప్రపంచానికి ఈ వంతెనను వ్యాపారం, పర్యాటకం, సాంస్కృతిక సంబంధాల వారధిగా చూపిస్తున్నప్పటికీ, దీని వెనుక ఒక బలమైన సైనిక వ్యూహం దాగి ఉందనే విశ్లేషణలు అంతర్జాతీయంగా వెలువడుతున్నాయి.
వంతెన రూపకల్పన .. రవాణా సామర్థ్యం
సుమారు కిలోమీటరు పొడవుతో, రెండు లైన్లతో రూపుదిద్దుకున్న ఈ వంతెన నిర్మాణం వెనుక పెద్ద కథే ఉంది. 2024లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. దాదాపు 495 రోజుల వ్యవధిలో సిద్ధమైన ఈ వంతెనపై రోజుకు దాదాపు 300 వాహనాలు, 2,323 మంది ప్రయాణించే వీలుంది. గతంలో రోడ్డు రవాణాకు సరైన మార్గం లేక రైల్వే వంతెనపై చెక్క పలకలు పరిచి తాత్కాలికంగా వాహనాలను పంపించేవారు. ఇప్పుడు ఈ శాశ్వత వంతెన అందుబాటులోకి రావడంతో సరుకు రవాణా వేగవంతం కానుంది. ఈ వంతెన నేరుగా రష్యాలోని వ్లాదివోస్తోక్ నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్ వరకు విస్తరించి ఉన్న జాతీయ రహదారి వ్యవస్థతో అనుసంధానమై ఉంది.
కవర్ట్ మిలిటరీ కారిడార్... అసలు వ్యూహం అదేనా?
ఉక్రెయిన్‌తో జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో రష్యాకు అవసరమైన ఆయుధాలు, బలగాలను చేరవేసేందుకే ఈ రహదారి ఉపయోగపడుతుందని ఉక్రేనియన్ నిఘా సంస్థలు బాహాటంగానే ఆరోపిస్తున్నాయి. ఉత్తర కొరియా ఇప్పటికే ఓడల ద్వారా సుమారు 7 బిలియన్ల నుంచి 14 బిలియన్ డాలర్ల విలువైన రాకెట్లు, క్షిపణులు, పదాతిదళ ఆయుధాలను రష్యాకు అందించినట్లు దక్షిణ కొరియా నిఘా వర్గాల అంచనా. అంతేకాకుండా, దాదాపు 11,000 మంది ఉత్తర కొరియా సైనికులు రష్యా తరుఫున ఉక్రెయిన్ పోరులో పాల్గొంటున్నారు. ఉపగ్రహ నిఘా నుంచి తప్పించుకుంటూ రహస్య సైనిక రవాణా సాగించడానికి, లేబర్ వర్కర్లను, సైనిక అధికారులను నేరుగా రష్యాలోకి పంపడానికి ఈ కొత్త రోడ్డు మార్గం ఒక "సీక్రెట్ లాజిస్టిక్స్ కారిడార్"గా మారుతుందన్నది విశ్లేషకుల ప్రధాన సందేహం.
ఆంక్షలను దాటుకుని సాగుతున్న దోస్తీ
ఐక్యరాజ్యసమితి ఆంక్షల ప్రకారం ఉత్తర కొరియా కార్మికులను ఇతర దేశాలు ఉపయోగించకూడదు. అయితే, విద్యార్థి వీసాల పేరిట దాదాపు 10,000 మంది ఉత్తర కొరియా వాసులు రష్యాలోని నిర్మాణ రంగాలు, కలప శిబిరాల్లో పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ రోడ్డు మార్గం ద్వారా వారి రవాణా ఇంకా తేలికవుతుంది. ప్రతిఫలంగా రష్యా నుంచి క్షిపణి సాంకేతికత, ఇతర శక్తి వనరులు ఉత్తర కొరియాకు చేరుతున్నాయి. ఈ పరిణామం కేవలం ఒక వంతెన ప్రారంభం మాత్రమే కాదు. రష్యా-ఉత్తర కొరియాల మధ్య మరింత బలపడుతున్న మిలిటరీ, ఆర్థిక బంధానికి బలమైన నిదర్శనం. పాశ్చాత్య దేశాల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా రూపుదిద్దుకున్న ఈ రహదారి, రాబోయే రోజుల్లో ఆసియా-యురేషియా రాజకీయాల్లో ఏ రకమైన మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి.




