Russia: పుతిన్ కొత్త వ్యూహం.. ఇరాన్‌కు రష్యా రహస్య అంతరిక్ష సమాచారం!
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వేళ రష్యా ఉపగ్రహ నిఘా సామర్థ్యంపై చర్చ మొదలైంది. సైనిక స్థావరాలు, యుద్ధ విమానాలు, నౌకాదళ కదలికలను గుర్తించే రష్యా స్పై శాటిలైట్లు ఇరాన్‌కు ఎలా ఉపయోగపడవచ్చో తెలుసుకుందాం.
Russia: అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడికి దిగితే.. ఈసారి పరిణామాలు గతంలో కంటే భిన్నంగా ఉండవచ్చా? ఇరాన్‌కు రష్యా అందిస్తున్న ఉపగ్రహ నిఘా సమాచారం ఈ ప్రశ్నకు కారణమవుతోంది. అమెరికా సైనిక బలగాల కదలికలు, యుద్ధ విమానాల మోహరింపు, నౌకాదళ కార్యకలాపాలను ముందుగానే గుర్తించేందుకు రష్యా సైనిక ఉపగ్రహాలు సహాయపడుతున్నాయన్నది తాజా విశ్లేషణలోని ప్రధాన వాదన. ఈ సమాచారం నిజంగా ఇరాన్‌కు చేరితే, అమెరికా దాడిని ముందుగానే అంచనా వేయడంతో పాటు ప్రతిదాడికి కూడా టెహ్రాన్‌కు అవకాశం లభించవచ్చు.
మధ్యవర్తిత్వ ప్రయత్నాల మధ్య కొత్త కోణం
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కథనం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త దాడులను తాత్కాలికంగా నిలిపివేయడానికి పలు కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వాటిలో ఇరాన్ ముందస్తు నిఘా సామర్థ్యం కూడా ఒకటిగా చెబుతున్నారు.
20 రష్యా ఉపగ్రహాలపై నిఘా
Project AURORAH పేరుతో గత ఎనిమిది నెలలుగా రష్యా గూఢచారి ఉపగ్రహాల కదలికలను పరిశీలిస్తున్నట్లు ఈ విశ్లేషణ రచయిత వెల్లడించారు. ఇందులో భాగంగా Kosmos-2600 శ్రేణికి చెందిన కనీసం 20 రష్యా అంతరిక్ష వాహకాలను గుర్తించగా, వాటిలో 18 ఉపగ్రహాల కదలికలను ట్రాక్ చేయగలిగినట్లు తెలిపారు. ఈ ఉపగ్రహాలు సాధారణ ఫొటోలు తీయడానికే పరిమితం కావు. సైనిక స్థావరాలు, భౌగోళిక పరిస్థితులను పరిశీలించడం, రాడార్ సంకేతాలను గుర్తించడం, సైనిక సమాచార ప్రసారాలను పర్యవేక్షించడం వంటి పనులు చేయగలవని విశ్లేషణ చెబుతోంది.
యుద్ధ ప్రాంతంపై నిరంతర నిఘా
సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్‌తో పాటు హోర్ముజ్ జలసంధి, బాబ్ అల్ మందెబ్ ప్రాంతాలపై ఈ ఉపగ్రహాల నిఘా విస్తరించినట్లు రచయిత పేర్కొన్నారు. ఇవి సుమారు ప్రతి 95 నిమిషాలకు భూమి చుట్టూ ఒకసారి తిరుగుతాయి. పరిస్థితులను బట్టి రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు కీలక ప్రాంతాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. కొన్ని ఉపగ్రహాలను ప్రత్యేకంగా మళ్లించి సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలపై నిఘా పెట్టినట్లు పరిశీలనలో గుర్తించారట. దాడులకు ముందు, అనంతరం కూడా ఆయా ప్రాంతాల మీదుగా ఉపగ్రహాలు వెళ్లినట్లు చెబుతున్నారు. దీని ద్వారా దాడుల ప్రభావాన్ని అంచనా వేసే అవకాశం ఉందని విశ్లేషణ అభిప్రాయపడుతోంది.
అమెరికా సైనిక కదలికలపై ముందస్తు సమాచారం
ఈ నిఘా సామర్థ్యం ఇరాన్‌కు కేవలం దాడి చేయాల్సిన లక్ష్యాలను గుర్తించడానికే కాకుండా, అమెరికా సైన్యం ఎప్పుడు, ఎక్కడ బలగాలను మోహరిస్తోందో తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడవచ్చు. యుద్ధ విమానాల కదలికలు, నౌకాదళాల స్థానాలు, సైనిక స్థావరాల్లో పెరుగుతున్న కార్యకలాపాలను ఉపగ్రహాల ద్వారా అంచనా వేయవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఉపగ్రహాల కదలికలను గమనించడం ఒకటైతే, వాటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఇరాన్‌కు అందించినట్లు నిర్ధారించడం మరో విషయం. ఈ సమాచార బదిలీకి సంబంధించి ప్రత్యక్ష ఆధారాలు బహిరంగంగా వెల్లడికాలేదు. 2025 జూన్‌లో అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’లో B-2 బాంబర్ విమానాలు అమెరికా భూభాగం నుంచి బయలుదేరి ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఇలాంటి దాడులు మళ్లీ జరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని, అమెరికా సైనిక కదలికలను ముందుగానే గుర్తించేందుకు రష్యా ఉపగ్రహాల సమాచారం ఉపయోగపడవచ్చన్నది ఈ విశ్లేషణలో మరో కీలక అంశం.
గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాలకూ ముప్పు
ఇరాన్‌కు ముందస్తు సమాచారం అందితే, అది తన రక్షణ ఏర్పాట్లను బలోపేతం చేసుకోవడమే కాకుండా ప్రతిదాడికి కూడా సిద్ధం కావచ్చు. ముఖ్యంగా చమురు శుద్ధి కేంద్రాలు, ఎగుమతి టెర్మినళ్లు, సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే ప్లాంట్లు, విద్యుత్ కేంద్రాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషణ హెచ్చరిస్తోంది. ఇలాంటి ప్రాంతాలపై దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా దెబ్బతినడంతో పాటు అంతర్జాతీయ చమురు మార్కెట్లపైనా ప్రభావం పడుతుంది.
రష్యాకు వ్యూహాత్మక ఆధిక్యం
ఈ వ్యవహారంలో రష్యాకు మరో ప్రయోజనం ఉంది. ఇరాన్‌కు అవసరమైన నిఘా సమాచారాన్ని అందించడం లేదా నిలిపివేయడం ద్వారా, నేరుగా యుద్ధంలో పాల్గొనకుండానే టెహ్రాన్‌పై ప్రభావం చూపే అవకాశం మాస్కోకు ఉంటుంది. అమెరికా మాత్రం తన సైనిక కదలికలను ప్రత్యర్థి గమనించే పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బలగాల మోహరింపు, సమాచార ప్రసారాల భద్రత, వ్యూహాత్మక మార్పులపై మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరోవైపు, భూమిపై జరుగుతున్న యుద్ధం అంతరిక్ష రంగానికీ విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. రష్యా ఉపగ్రహం ఫిన్లాండ్కు చెందిన వాణిజ్య ఉపగ్రహానికి సమీపంగా వెళ్లిన ఘటన కూడా ఈ ఆందోళనలకు కారణమైంది. అయితే దాన్ని దాడి సాధనంగా పరీక్షించారనే విషయం నిర్ధారణ కాలేదు.




